ArcelorMittal
-
హాజీరా స్టీల్ ప్లాంటు పనులు వేగవంతం
అహ్మదాబాద్: హాజీరా ఉక్కు ప్లాంటు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్ తెలిపారు. ఇది 2026 నాటికల్లా అందుబాటులోకి రాగలదని ’వైబ్రెంట్ గుజరాత్’ సదస్సు 20 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 20,000 మంది పైచిలుకు వర్కర్లు పాలుపంచుకుంటున్నారని మిట్టల్ చెప్పారు. ఆర్సెలర్‌మిట్టల్‌లో భాగమైన ఏఎంఎన్ఎస్ ఇండియా గతేడాది అక్టోబర్‌లో హాజీరా ప్లాంటు సామరŠాధ్యలను 15 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తొలి దశలో ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, ఆ తర్వాత మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్ చెప్పారు. భారత్ దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడం భారత్ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేసిందని మిట్టల్ చెప్పారు. అటు, గుజరాత్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇన్వెస్టర్ల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వెల్స్పన్ సంస్థ చైర్మన్ బీకే గోయెంకా తెలిపారు. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై కసరత్తు చేసేందుకు జపానీస్ వ్యాపార బృందాన్ని నవంబర్‌లో ఆహా్వనించే యోచనలో ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకీ తెలిపారు. తదుపరి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు వచ్చే ఏడాది జనవరి 10–12 మధ్య గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు. -
ఆర్సెలర్ చేతికి ఎస్సార్ పోర్టులు
న్యూఢిల్లీ: పోర్టుల బిజినెస్‌ను మెటల్ రంగ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌కు విక్రయించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్సార్ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఇందుకు 2.4 బిలియన్ డాలర్ల(రూ. 19,000 కోట్లు) విలువైన తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్–19 తదుపరి దేశీయంగా ఇది అతిపెద్ద డీల్‌కాగా.. నిర్ణీత పోర్టులతోపాటు, విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను సైతం ఆర్సెలర్‌కు బదిలీ చేయనున్నట్లు ఎస్సార్ తెలియజేసింది. ప్రధానంగా గుజరాత్‌లోని హజీరా స్టీల్ ప్లాంటు అవసరాల కోసం ఏర్పాటు చేసిన వీటిని విక్రయించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా డీల్‌లో భాగంగా హజీరాలో వార్షికంగా 4 ఎంటీ సామర్థ్యంగల ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు రెండు సంస్థలు 50:50 భాగస్వామ్య సంస్థను సైతం నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. హజీరా స్టీల్ ప్లాంటును 2018–19లోనే ఆర్సెలర్‌మిట్టల్ కొనుగోలు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. 3 రాష్ట్రాల్లో... ఎస్సార్ గ్రూప్‌తో కుదిరిన తాజా ఒప్పందంలో భాగంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పోర్టులతోపాటు హజీరాలోగల రెండు విద్యుత్ ప్లాంట్లు సొంతం కానున్నట్లు ఆర్సెలర్ మిట్టల్ విడిగా ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్ ప్రసార లైన్ సైతం దీనిలో భాగమేనని తెలియజేసింది. 2018–19లో దివాలా చట్ట చర్యలలో భాగంగా రూ. 42,000 కోట్లకు ఎస్సార్ స్టీల్‌ను ఆర్సెలర్ మిట్టల్ కొనుగోలు చేసింది. తద్వారా పోర్టు లైసెన్స్ కార్యకలాపాల హక్కులు సైతం దక్కినట్లు ఆర్సెలర్‌మిట్టల్ పేర్కొన్నప్పటికీ ఎస్సార్ బల్క్‌టెర్మినల్ దీనిని వ్యతిరేకించింది. దివాలా చర్యల్లోకి ఇవి రావని వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టులకు చేరింది. అయితే ప్రస్తుతం రెండు సంస్థలూ వీటిపై ఒక ఒప్పందానికి రావడం గమనార్హం! వైజాగ్ టెర్మినల్ సైతం హజీరాలోని డీప్ డ్రాఫ్ట్ బల్క్ పోర్ట్ టెర్మినల్‌లోని 25 ఎంటీపీఏ జెట్టీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోగల 16 ఎంటీపీఏ డీప్ డ్రాఫ్ట్ టెర్మినల్ డీల్‌లో భాగమని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడగల 8 ఎంటీపీఏ ఐరన్ ఓర్ పెల్లెట్ ప్లాంటుతో అనుసంధానమైన సమీకృత కన్వేయర్ కూడా ఉన్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా ఒడిశాలోని 12 ఎంటీపీఏ పారదీప్ డీప్ వాటర్ జెట్టీ, కన్వేయర్ ఒప్పందంలోకి వస్తాయని వివరించింది. వీటితోపాటు హజీరాలోని 270 మెగావాట్ల మల్టీ ఇంధన ప్లాంట్, 515 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటు ఉన్నట్లు వెల్లడించింది. -
వైజాగ్ స్టీల్‌పై ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్)పై ప్రైవేట్ రంగ ఉక్కు దిగ్గజం ఏఎంఎన్ఎస్ ఇండియా (ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్) సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, కంపెనీ మాత్రం ఈ విషయం ్ర«ధువీకరించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏఎంఎన్ఎస్ మాతృ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మి నివాస్ మిట్టల్ భేటీ అవుతున్నట్లు ఏఎంఎన్ఎస్ గురువారం ట్వీట్ చేసింది. అయితే, సమావేశ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్‌పై కంపెనీ దృష్టి పెట్టిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని ఏఎంఎన్ఎస్ ఇండియాలో ఆర్సెలర్‌మిట్టల్‌కు 60 శాతం, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌కు 40 శాతం వాటాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తూర్పు తీరంలో ఉన్న ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు చేస్తే ఆగ్నేయాసియా మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ ఇటీవల తెలిపారు. వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. -
ఉత్తమ్ గాల్వా ఎవరి పరం?
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ చేయడానికి పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మంచి పేరు సాధించిన ఈ కంపెనీ ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. టేకోవర్ బిడ్లకు సంబంధించిన గడువు గత నెల ముగిసింది. ఈ కంపెనీ టేకోవర్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరు రసవత్తరంగా ఉండనున్నది. లోహ దిగ్గజ కంపెనీలు ఈ కంపెనీని టేకోవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. లోహ కుబేరులు–లక్ష్మీ మిట్టల్, జిందాల్ సోదరులు(సజ్జన్, నవీన్ జిందాల్‌లు), వేదాంత కంపెనీ అనిల్ అగర్వాల్ ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ రేసులో ఉన్నారని సమాచారం. 2018లో దివాలా ప్రక్రియ ద్వారా ఈఎస్ఎల్ స్టీల్‌ను వేదాంత కంపెనీ టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే వేదాంత కంపెనీ టేకోవర్ బిడ్‌ను వేదాంత సమర్పించిందని సమాచారం. ఈ లోహ కుబేరులతో పాటు కోటక్ మహీంద్రాకు చెందిన ఫీనిక్స్అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ) కూడా ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీపై కన్నేసింది. అయితే టేకోవర్ వార్తలపై ఈ సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు... ఉత్తమ్ గాల్వా కంపెనీని రాజేంద్ర మిగ్లాని స్థాపించారు. వాహనాలు, విమానాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమల్లో ఉపయోగించే విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి తొలి ఆర్నెల్లలో రూ.277 కోట్ల ఆదాయంపై రూ.140 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2020 మొదట్లో ఉత్తమ్ గాల్వా స్టీల్స్ కంపెనీ 67 లక్షల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఈ కంపెనీపై దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ 2020 మార్చిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఒక పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆరు నెలల తర్వాత ఎస్బీఐ పిటీషన్‌ను ఎన్సీఎల్టీ స్వీకరించింది. దివాలా ప్రక్రియను నిర్వహించడానికి కేఎమ్డీఎస్ అండ్ అసోసియేట్స్‌కు చెందిన మిలింద్ కసోద్కర్ను నియమించింది. అగ్ర భాగంలో ఆర్సెలర్ మిట్టల్... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరులో లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకే అధిక అవకాశాలున్నాయని సమాచారం. ఉత్తమ్ గాల్వా కంపెనీకి అత్యధికంగా అప్పులిచ్చింది లక్ష్మీ మిట్టల్ కంపెనీయే. ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.9,742 కోట్లుగా ఉంది. దీంట్లో ఆర్సెలర్ మిట్టల్ సంస్థల(ఆర్సెలర్ మిట్టల్ ఇండియా, ఏఎమ్‌ఎన్‌ఎస్ లగ్జెంబర్గ్) వాటాలే రూ.7,922 కోట్లుగా ఉన్నాయి. రుణదాతలకున్న మొత్తం ఓటింగ్ రైట్స్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 87.2% వాటా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ చెల్లించాల్సిన రుణాలను ఈ సంస్థలను చెల్లించి, ఆ మేరకు అప్పుల్లో వాటాను తీసుకున్నాయి. ఒకప్పు డు ఉత్తమ్ గాల్వాలో ఒక ప్రమోటర్‌గా ఆర్సెలర్ మిట్టల్ ఉండేది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి గాను ఉత్తమ్ గాల్వా స్టీల్ నుంచి ఆర్సెలర్ మిట్టల్ వైదొలగింది. ఎస్సార్ స్టీల్‌ను టేకోవర్ చేసి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియాగా పేరు మార్చింది. -
ఎస్సార్ ఆస్తుల జప్తు కుదరదు
లండన్: ఒక ఆర్బ్రిట్రేషన్ కేసులో ఎస్సార్ స్టీల్ పేరెంట్ కంపెనీ, ఆ కంపెనీ ప్రమోటర్ కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల జప్తునకు ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న యత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మార్చి 30న లండన్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు అనుమతించాలన్న ఆర్సెలర్‌మిట్టల్ పిటిషన్‌ను లండన్ అప్పీలేట్ కోర్ట్ కొట్టివేసింది. 2019లో మారిషస్‌లో దివాలా చట్రంలోకి వెళ్లిన ఎస్సార్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించి 1.5 బిలియన్ డాలర్ల ఆర్బ్రిట్రేషన్ కేసులో ‘తమ ప్రయోజనాలకు కలిగిన నష్టాలను భర్తీ చేయాలని, ఈ విషయంలో ఎస్సార్, రవి రుయా, ప్రశాంత్ రుయాల ఆస్తులను జప్తు చేయాలని ’ కోరుతూ ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న న్యాయపోరాటాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎస్సార్ చేసిన తాజా ప్రకటన ప్రకారం, ఆర్సెలర్‌మిట్టల్ యూఎస్ఏ (ఏఎంయూఎస్ఏ) అప్పీల్ గెలుపొందడానికి తగిన అంశాలను కలిగిలేదని ఆ సంస్థ (ఆర్సెలర్ మిట్టల్) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ న్యూయీ నేతృత్వంలోని లండన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏప్రిల్ 21న పేర్కొంది. -
భారత ఉక్కు రంగంలోకి ‘ఆర్సెలర్’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఎట్టకేలకు భారత ఉక్కు రంగంలోకి అరంగేట్రం చేసింది. రచ్చ గెలిచిన లక్ష్మీనివాస్ మిట్టల్ ఇంట గెలవడానికి చాలా సమయం పట్టింది. చాలా ఏళ్ల సమయం, ప్రయాసల అనంతరం ఆయన ఉక్కు కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ మన దేశంలోకి అడుగిడింది. భారత్‌లో ఉక్కు కంపెనీని ఏర్పాటు చేయాలన్న ఎల్ఎన్ మిట్టల్ కల ఎట్టకేలకు ఎస్సార్ స్టీల్ టేకోవర్ ద్వారా సాకారమయింది. ఈ టేకోవర్ ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యిందని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అతి పెద్ద దివాలా రికవరీ... ఎస్సార్ స్టీల్ కంపెనీని రూ.42,000 కోట్లకు ఆర్సెలర్ మిట్టల్ టేకోవర్ చేయడానికి సుప్రీం కోర్టు గత నెలలోనే ఆమోదం తెలిపింది. దివాలా చట్టం కింద (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్–ఐబీసీ) పరిష్కారమైన అతి పెద్ద రికవరీ ఇదే. నిప్పన్ స్టీల్ కంపెనీతో కలిసి ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ (ఆర్సెలర్ మిట్టల్ /నిప్పన్ స్టీల్ (ఏఎమ్/ఎన్ఎస్ ఇండియా)) ఇకపై ఎస్సార్ స్టీల్‌ను నిర్వహిస్తుంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ చైర్మన్‌గా అదిత్య మిట్టల్ (ప్రస్తుత ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సీఎఫ్ఓ, ప్రెసిడెంట్ ) వ్యవహరిస్తారు. ఈ జేవీలో ఆర్సెలర్ మిట్టల్‌కు 60 శాతం, నిప్పన్ స్టీల్ కంపెనీకి 40 శాతం చొప్పున వాటాలున్నాయి. లగ్జెంబర్గ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్... భారత్‌లో అడుగిడాలని చాలా ఏళ్ల కిందటే ప్రయత్నాలు ప్రారంభించింది. జార్ఖండ్, ఒడిశాల్లో 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భూ సేకరణ, పర్యావరణ, ఇతర అనేక అవరోధాల కారణంగా ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. -
ఎస్సార్ స్టీల్.. ఆర్సెలర్‌దే!!
న్యూఢిల్లీ: దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించి ఆర్సెలర్‌మిట్టల్ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. బిడ్ మొత్తాన్ని ఫైనాన్షియల్ రుణదాతలు (బ్యాంకులు మొదలైనవి), ఆపరేషనల్ రుణదాతలు (సరఫరాదారులు మొదలైన వర్గాలు) సమానంగా పంచుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. బాకీలు రాబట్టుకోవడంలో మొదటి ప్రాధాన్యత ఫైనాన్షియల్ రుణదాతలకే ఉంటుందని, రుణదాతల కమిటీ (సీవోసీ) తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి లేదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణదాతలకు సమాన హోదా ఉండబోదని స్పష్టం చేసింది. 2018 అక్టోబర్ 23న ఆర్సెలర్‌మిట్టల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలంటూ న్యాయస్థానం.. పరిష్కార ప్రణాళికను సీవోసీకి తిప్పిపంపగలదే తప్ప, రుణదాతల కమిటీ తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయాన్ని మార్చజాలదని సుప్రీం కోర్టు తెలిపింది. పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు దివాలా కోడ్‌లో నిర్దేశించిన 330 రోజుల గడువును కూడా సడలించింది. సీవోసీ పరిష్కార ప్రణాళిక అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని సూచించింది. ఎస్సార్స్టీల్ వేలం ద్వారా వచ్చే నిధులను రుణదాతలంతా సమాన నిష్పత్తిలో పంచుకోవాలన్న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను సవాల్ చేస్తూ బ్యాంకులు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేస్తాం: ఆర్సెలర్‌మిట్టల్ సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన ఆర్సెలర్‌మిట్టల్.. సాధ్యమైనంత త్వరగా ఎస్సార్ స్టీల్ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, బిడ్ చేసిన ఆర్సెలర్ మిట్టల్, దాని భాగస్వామ్య సంస్థ నిప్పన్ స్టీల్‌కు ఎస్సార్ స్టీల్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థను దక్కించుకుంటున్నాయని పేర్కొంది. బ్యాంకులకు ఊరట.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్, ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ తదితర సంస్థలకు సుప్రీం కోర్టు తీర్పు ఊరటనివ్వనుంది. స్టాన్‌చార్ట్ డీబీఎస్ బ్యాంక్ వంటి ఆపరేషనల్ రుణదాతలకు ప్రాధాన్యం తగ్గనుంది. ఎస్బీఐకు ఎస్సార్ స్టీల్ అత్యధికంగా రూ. 15,430 కోట్లు బాకీ పడింది. రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్ణయం ప్రకారం ఎస్సార్ స్టీల్ వేలం ద్వారా వచ్చే నిధుల పంపకాలకు సంబంధించి బ్యాంకుల్లాంటి సెక్యూర్డ్ రుణదాతలు తమకు రావాల్సిన బకాయిల్లో 90% దాకా, రూ. 100 కోట్ల పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్ రుణదాతలు తమకు రావాల్సిన దాంట్లో 20.5% దాకా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని తోసిపుచ్చిన ఎన్సీఎల్ఏటీ.. బ్యాంకులకు 60.7% మేర, రూ. 100 కోట్లు పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్ రుణదాతలు 59.6% దాకా క్లెయిమ్ చేసుకునే వీలు కల్పించింది. దీన్నే సవాలు చేస్తూ బ్యాంకులు.. సుప్రీంను ఆశ్రయించాయి. రెండేళ్ల తర్వాత ఒక కొలిక్కి.. ఎస్సార్ స్టీల్ సంస్థ బ్యాంకులకు, ఇతరత్రా రుణదాతలకు రూ. 54,547 కోట్ల మేర బకాయిపడింది. భారీ డిఫాల్టర్లకు సంబంధించి రెండేళ్ల క్రితం ఆర్బీఐ ప్రకటించిన తొలి జాబితాలోని 12 సంస్థల్లో ఇది కూడా ఉంది. దీంతో బాకీలను రాబట్టుకునేందుకు ఆర్థిక సంస్థలు.. దివాలా స్మృతి (ఐబీసీ) కింద అప్పట్నుంచి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ తర్వాత ఇది అనేక మలుపులు తిరిగింది. దివాలా తీసి, వేలానికి వచ్చిన తమ సంస్థ చేజారిపోకుండా తిరిగి దక్కించుకునేందుకు ప్రమోటర్లయిన రుయా కుటుంబం వివిధ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నించింది. ఆర్సెలర్‌మిట్టల్ ఆఫర్ చేసిన రూ. 42,000 కోట్ల కన్నా ఎక్కువగా రూ. 54,389 కోట్లు కడతాము, వేలాన్ని నిలిపివేయాలంటూ కోరింది. కానీ ఎన్సీఎల్టీ దీన్ని తోసిపుచ్చింది. దివాలా స్మృతికే సవాలుగా నిల్చిన ఈ కేసు ఫలితం .. ఇలాంటి మిగతా కేసులపైనా ప్రభావం చూపనుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఆర్సెలర్‌మిట్టల్‌కు మళ్లీ బ్రేక్!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో వేలానికొచ్చిన ఎస్సార్ స్టీల్ చేజారిపోకుండా ఆ సంస్థ ప్రమోటర్లు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. బిడ్డింగ్‌లో దీన్ని దక్కించుకున్న ఆర్సెలర్‌మిట్టల్ సంస్థను తిరస్కరించాల్సిందిగా ఎస్సార్ స్టీల్‌లో మెజారిటీ వాటాలు ఉన్న ఎస్సార్ స్టీల్ ఆసియా హోల్డింగ్స్ (ఈఎస్‌ఏహెచ్‌ఎల్) .. తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్ఏటీ) ఆశ్రయించింది. ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఆర్సెలర్ మిట్టల్ ప్రమోటరు లక్ష్మి నివాస్ మిట్టల్ .. దివాలా తీసిన తన సోదరుల కంపెనీలతో సంబంధాలను దాచిపెట్టారని ఈఎస్‌ఏహెచ్‌ఎల్ ఆరోపించింది. ఈ సంస్థలకు లక్ష్మి నివాస్ మిట్టల్ ప్రమోటరుగా ఉన్నందున ఎస్సార్ స్టీల్‌కు ఆర్సెలర్‌మిట్టల్ బిడ్‌ను తిరస్కరించాలని కోరింది. ఈ పిటీషన్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా ఆర్సెలర్మిట్టల్ను ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణను మే 13కు వాయిదా వేసింది. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి ఎస్సార్ స్టీల్!
సాక్షి, ముంబై: రుణ భారంతో కుదేలైన ఎస్సార్ స్టీల్ ను ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ ఎట్టకేలకు సొంతం చేసుకుంది. లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్ ఈ స్టీల్స్ ను రూ.42,000కోట్లకు దక్కించుకున్నారు. ఆర్సెలర్ మిట్టల్, భాగస్వామి జపాన్ నిస్సాన్ స్టీల్ అండ్ సుమిటోమోకు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (బ్యాంకుల రుణదాతల కమిటీ ) లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. రూ.49వేల కోట్ల బకాయిలను తాము చెల్లించాల్సి ఉందని మిట్టల్ తెలిపారు. ముందుగా అప్పులను తీర్చుందుకు 42వేల కోట్లను, మరో ఎనిమిదివేల కోట్ల రూపాయల నిర్వాహక పెట్టుబడులను సంస్థకు సమకూర్చనుంది. ఎస్సార్ స్టీల్‌ను దివాలానుంచి బయటపడేందుకు గాను రుణదాతలకు రూ. 54,389 కోట్లు, 47,507 కోట్ల రూపాయల నగదు చెల్లింపులకు ఆర్సెలర్ అంగీకరించిన తర్వాత రోజు ఈ అభివృద్ధి జరిగింది. -
ఎస్సార్ స్టీల్: అప్పులు చెల్లించాకే బిడ్
సాక్షి,న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రుణ సంక్షోభంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్‌ను దక్కించుకునే రేసులో ఉన్న బిడ్డర్లు ఆర్సెలర్ మిట్టల్, నూమెటల్కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇరు కంపెనీల బిడ్స్ చెల్లుతాయన్న కోర్టు నుమెటల్‌కు భారీ ఊరట నిచ్చింది. దీనిపై సీవోసీ (కమిటీ ఆఫ క్రెడిటర్స్) అంగీకరించిన తరువాత మాత్రమే ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ జోక్యం చేసుకుంటాయని తెలిపింది. మెజారిటీ (66శాతం) సీవోసీ సభ్యులు ఈ ప్రక్రియకు అంగీకరించాలనీ, లేదంటే లిక్విడేషన్‌కు వెళుతుందని సుప్రీం స్పష్టం చేసింది. అయితే ఈ వేలానికి ముందు రెండు వారాలలో బకాయిలను క్లియర్ చేయాలని ఇరు సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. రోహిన్టన్ నారిమన్, ఇందుహల్హోత్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాల్చింది. అలాగే ఈ రెండు కంపెనీల బిడ్లపై ఎస్సార్ స్టీల్ రుణదాతల కమిటీ నిర్ణయం తీసుకోవాలని, ఎనిమిది వారాల్లో అత్యుత్తమ బిడ్‌ను ఎంపిక చేయాలని సూచించింది. అంతేకాక 270 రోజుల్లో దివాలా ప్రక్రియ గడువు పూర్తి కావాలని తెలిపింది. ఆర్సెలార్ మిట్టల్ తన అనుబంధ విభాగమైన ఉత్తమ్ గాల్వాకు బకాయిపడిన మొత్తం రూ.7,000 కోట్లు. దీంతో ఉత్తమ్ గాల్వా రుణదాతలకు బకాయిలు చెల్లించేందుకు ఆర్సెలార్ మిట్టల్ ఇప్పటికే రూ.7 వేల కోట్లను తన ఎస్ర్కో ఖాతాలో డిపాజిట్ చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్ 29ఎ ప్రకారం.. బకాయి పడిన కంపెనీలకు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదు. మొత్తం 30 బ్యాంకులు, ఇతర రుణదాతలకు ఎస్సార్ స్టీల్ రూ.49,000 కోట్లు బకాయి పడటంతో సంస్థపై దివాలా పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే దివాలా పరిష్కారానికి చేరువవుతున్న నేపథ్యంలో సంస్థ బకాయిలను ఆస్తుల పునర్వ్యవస్థీకరణ సంస్థల(ఎఆర్‌సి)కు విక్రయించాలన్న ప్రతిపాదనను ఎస్బిఐ ఉపసంహరించుకుంది. ఎస్బిఐకి ఎస్సార్ స్టీల్ రూ.13,000 బకాయిపడింది. -
ఆర్సెలర్ ప్రెసిడెంట్‌గా ఆదిత్య మిట్టల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ప్రెసిడెంట్‌గా ఆదిత్య మిట్టల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్సెలర్ మిట్టల్ యూరప్ విభాగానికి సీఎఫ్‌వో, సీఈవోగా ఉన్న ఆదిత్యకు తాజాగా ప్రెసిడెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్, సీఈవో లక్ష్మీనివాస్ మిట్టల్ కుమారుడే ఆదిత్య మిట్టల్. చైర్మన్‌కి కుడిభుజంగా వ్యవహరిస్తూ.. గ్రూప్ కార్యకలాపాల్లో ఆదిత్య వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నారని సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ఆర్సెలర్ మిట్టల్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
ఆర్సెలర్ మిట్టల్ కొత్త అధ్యక్షుడుగా ఆనంద్
గ్లోబల్ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ కు చెందిన యంగ్ తరంగ్ చేతికి కొత్త పగ్గాలను అందించింది. కంపెనీ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ కుమారుడు, కంపెనీలో ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉన్న ఆదిత్య మిట్టల్(42)కు కొత్తగా ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించింది. యూరప్ గ్రూప్ సీఈవో, సీఎఫ్‌వోగా ఆయన ప్రస్తుత బాధ్యతలకు అదనంగా దీన్ని అప్పగించింది. ఆదిత్యమిట్టల్ ఆర్సెలర్ మిట్టల్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించ నున్నారని లక్సెంబర్గ్ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నియామకం ద్వారా గ్రూప్ అంతటా పెరుగుతున్న ప్రపంచ వ్యూహాత్మక పాత్రను ప్రతిబింబించడంతోపాటు, సంస్థ చైర్మన్ అండ్ సీఈవో లక్ష్మీ మిట్టల్‌కు భారీ మద్దతు లభించనుందని పేర్కొంది. యూరప్ కార్యకలాపాల్లో సీఈవోగా బాధ్యతల నిర్వహణలో ఆదిత్య తన ప్రతిభను నిరూపించుకున్నారని, గ్రూపు భవిష్యత్ వ్యూహాత్మక దిశను రూపొందించడంలో తనతో పాటు పని చేస్తారని లక్ష్మీ మిట్టల్ ప్రకటించారు. కాగా ఆర్సెలర్ మిట్టల్ ప్రపంచంలోనే ప్రముఖ ఉక్కు మైనింగ్ కంపెనీ. దాదాపు 60 దేశాల్లో ఉనికితోపాటు, పారిశ్రామింగా 18దేశాల్లో తనదైన ముద్రను కలిగిఉంది. ప్రధాన ప్రపంచ ఉక్కు మార్కెట్లకు ఆటోమోటివ్, నిర్మాణ, గృహ ఉపకరణం , ప్యాకేజింగ్ సహా నాణ్యత ఉక్కును సరఫరా చేస్తుంది. మరోవైపు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సార్ స్టీల్‌ను కొను గోలు చేయడానికి జపాన్‌కు చెందిన నిప్పన్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అర్సెలర్ మిట్టల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిప్పన్ స్టీల్‌తో ఆర్సెలర్ మిట్టల్ జట్టు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో భాగంగా జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌ఎస్‌ఎంసీ) ఆర్సెలర్ మిట్టల్ చేతులు కలిపింది. నిప్పన్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. భారీ మొండిబాకీలతో దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న 12 కంపెనీల్లో ఎస్సార్ స్టీల్ ఒకటి. దీన్ని కొనుగోలు చేస్తే భారత మార్కెట్లో కీలకంగా ఎదగొచ్చనే ఉద్దేశంతో ఎస్సార్ స్టీల్ కోసం ఆర్సెలర్‌మిట్టల్ బరిలో నిలిచింది. కంపెనీని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను ఆర్సెలర్ మిట్టల్ ఇండియా (ఏఎంఐపీఎల్) ఫిబ్రవరి 12న అందజేసింది కూడా. తమ ప్రణాళికకు గానీ ఎన్సీఎల్టీ ఆమోద ముద్ర వేస్తే నిప్పన్‌తో కలసి ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేస్తామని, సంయుక్తంగా సంస్థ నిర్వహణ చేపడతామని ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 1987 నుంచి ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కలసి అమెరికాలోని ఇండియానాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇటీవలే అమెరికాలోని అలబామాలో కాల్వర్ట్ ఉక్కు ప్లాంటును కూడా కొనుగోలు చేశాయి. ఆర్సెలర్ మిట్టల్‌కి 60 పైగా దేశాల్లో కార్యకలాపాలున్నాయి. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి థిసెన్‌క్రప్ ‘అమెరికా స్టీల్ ప్లాంట్’
న్యూయార్క్: ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ తాజాగా అమెరికాలో మరో ఉక్కు ప్లాంటును కొనుగోలు చేస్తోంది. జర్మన్ సంస్థ థిసెన్క్రప్కి అమెరికాలో ఉన్న ప్లాంటును మరో కంపెనీ నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్‌తో కలిసి కొంటోంది. ఈ డీల్ విలువ సుమారు 1.55 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ వెల్లడించాయి. అలబామా రాష్ట్రంలోని సదరు ప్లాంటులో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 5.3 మిలియన్ టన్నులు. ప్రధానంగా ఆటోమొబైల్, నిర్మాణ రంగాలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి.