
సంచలనం సృష్టించిన హజిరా బాలిక హత్యాచార కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నిందితుడు సుజిత్ సాకేత్‌ను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా(గుజరాత్) కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువరించిన జడ్జికి.. కోర్టు హాల్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.
జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ సుజిత్‌కు ప్రత్యేక(పోక్సో) న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన వెంటనే నిందితుడు సుజిత్ సాకేత్ కోపంతో ఊగిపోయాడు. తన కాలి చెప్పులను తీసి జడ్జి పీఎస్ కళ మీదకు విసిరాడు. అయితే ఆ చెప్పులు జడ్జి మీద పడలేదు. ఆయనకు కాస్త ముందున్న సాక్షి బోనులో పడ్డాయి. దీంతో న్యాయమూర్తి కంగుతినగా.. పోలీసులు వెంటనే సుజిత్‌ను అదుపు చేశారు.
Special POCSO Judge P.S. Kala
ఇదిలా ఉంటే జడ్జి పీఎస్ కళ గతంలోనూ పోక్సో నేరాలకు సంబంధించి సంచలన తీర్పులెన్నింటినో వెలువరించారు. త్వరగతిన తీర్పులు వెలువరిస్తారని ఆయనకు పేరుంది. గతంలోనూ ఓ కేసులో నిందితుడిని ‘చచ్చే వరకు జైళ్లోనే మగ్గాలి’ అంటూ తీర్పు ఇచ్చారు. పలు కేసుల కోసం ఆయన అర్ధరాత్రిళ్లు సైతం విచారణలు కొనసాగించడం విశేషం.
ఇదిలా ఉంటే హజిరా ఉదంతంలో బాధితురాలు ఐదేళ్ల బాలిక. ఆమె ఓ వలస కార్మికుడి కుటంబానికి చెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్ వలస మీద హజిరాకు వచ్చి.. ఆ కుటుంబం పక్కనే ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చాక్లెట్ ఆశ చూపించి..ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను హతమార్చాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కేసు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు.
ఘటన తర్వాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో 26 మంది సాక్షులను విచారించారు. మరోవైపు కోర్టు కూడా 53 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను పరిశీలించాకే తుది తీర్పు వెలువరించింది. ఇక తుదితీర్పు సందర్భంగా గుమిగూడిన జనాలు.. నిందితుడిని అక్కడికక్కడే ఉరి తీయాలంటూ నినాదాలు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment