Hazira
-
హాజీరా స్టీల్ ప్లాంటు పనులు వేగవంతం
అహ్మదాబాద్: హాజీరా ఉక్కు ప్లాంటు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్ తెలిపారు. ఇది 2026 నాటికల్లా అందుబాటులోకి రాగలదని ’వైబ్రెంట్ గుజరాత్’ సదస్సు 20 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 20,000 మంది పైచిలుకు వర్కర్లు పాలుపంచుకుంటున్నారని మిట్టల్ చెప్పారు. ఆర్సెలర్‌మిట్టల్‌లో భాగమైన ఏఎంఎన్ఎస్ ఇండియా గతేడాది అక్టోబర్‌లో హాజీరా ప్లాంటు సామరŠాధ్యలను 15 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తొలి దశలో ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, ఆ తర్వాత మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్ చెప్పారు. భారత్ దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడం భారత్ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేసిందని మిట్టల్ చెప్పారు. అటు, గుజరాత్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇన్వెస్టర్ల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వెల్స్పన్ సంస్థ చైర్మన్ బీకే గోయెంకా తెలిపారు. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై కసరత్తు చేసేందుకు జపానీస్ వ్యాపార బృందాన్ని నవంబర్‌లో ఆహా్వనించే యోచనలో ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకీ తెలిపారు. తదుపరి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు వచ్చే ఏడాది జనవరి 10–12 మధ్య గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు. -
ఆర్సెలర్ చేతికి ఎస్సార్ పోర్టులు
న్యూఢిల్లీ: పోర్టుల బిజినెస్‌ను మెటల్ రంగ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌కు విక్రయించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్సార్ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఇందుకు 2.4 బిలియన్ డాలర్ల(రూ. 19,000 కోట్లు) విలువైన తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్–19 తదుపరి దేశీయంగా ఇది అతిపెద్ద డీల్‌కాగా.. నిర్ణీత పోర్టులతోపాటు, విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను సైతం ఆర్సెలర్‌కు బదిలీ చేయనున్నట్లు ఎస్సార్ తెలియజేసింది. ప్రధానంగా గుజరాత్‌లోని హజీరా స్టీల్ ప్లాంటు అవసరాల కోసం ఏర్పాటు చేసిన వీటిని విక్రయించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా డీల్‌లో భాగంగా హజీరాలో వార్షికంగా 4 ఎంటీ సామర్థ్యంగల ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు రెండు సంస్థలు 50:50 భాగస్వామ్య సంస్థను సైతం నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. హజీరా స్టీల్ ప్లాంటును 2018–19లోనే ఆర్సెలర్‌మిట్టల్ కొనుగోలు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. 3 రాష్ట్రాల్లో... ఎస్సార్ గ్రూప్‌తో కుదిరిన తాజా ఒప్పందంలో భాగంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పోర్టులతోపాటు హజీరాలోగల రెండు విద్యుత్ ప్లాంట్లు సొంతం కానున్నట్లు ఆర్సెలర్ మిట్టల్ విడిగా ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్ ప్రసార లైన్ సైతం దీనిలో భాగమేనని తెలియజేసింది. 2018–19లో దివాలా చట్ట చర్యలలో భాగంగా రూ. 42,000 కోట్లకు ఎస్సార్ స్టీల్‌ను ఆర్సెలర్ మిట్టల్ కొనుగోలు చేసింది. తద్వారా పోర్టు లైసెన్స్ కార్యకలాపాల హక్కులు సైతం దక్కినట్లు ఆర్సెలర్‌మిట్టల్ పేర్కొన్నప్పటికీ ఎస్సార్ బల్క్‌టెర్మినల్ దీనిని వ్యతిరేకించింది. దివాలా చర్యల్లోకి ఇవి రావని వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టులకు చేరింది. అయితే ప్రస్తుతం రెండు సంస్థలూ వీటిపై ఒక ఒప్పందానికి రావడం గమనార్హం! వైజాగ్ టెర్మినల్ సైతం హజీరాలోని డీప్ డ్రాఫ్ట్ బల్క్ పోర్ట్ టెర్మినల్‌లోని 25 ఎంటీపీఏ జెట్టీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోగల 16 ఎంటీపీఏ డీప్ డ్రాఫ్ట్ టెర్మినల్ డీల్‌లో భాగమని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడగల 8 ఎంటీపీఏ ఐరన్ ఓర్ పెల్లెట్ ప్లాంటుతో అనుసంధానమైన సమీకృత కన్వేయర్ కూడా ఉన్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా ఒడిశాలోని 12 ఎంటీపీఏ పారదీప్ డీప్ వాటర్ జెట్టీ, కన్వేయర్ ఒప్పందంలోకి వస్తాయని వివరించింది. వీటితోపాటు హజీరాలోని 270 మెగావాట్ల మల్టీ ఇంధన ప్లాంట్, 515 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటు ఉన్నట్లు వెల్లడించింది. -
బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం!
సంచలనం సృష్టించిన హజిరా బాలిక హత్యాచార కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నిందితుడు సుజిత్ సాకేత్‌ను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా(గుజరాత్) కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువరించిన జడ్జికి.. కోర్టు హాల్లోనే చేదు అనుభవం ఎదురైంది. జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ సుజిత్‌కు ప్రత్యేక(పోక్సో) న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన వెంటనే నిందితుడు సుజిత్ సాకేత్ కోపంతో ఊగిపోయాడు. తన కాలి చెప్పులను తీసి జడ్జి పీఎస్ కళ మీదకు విసిరాడు. అయితే ఆ చెప్పులు జడ్జి మీద పడలేదు. ఆయనకు కాస్త ముందున్న సాక్షి బోనులో పడ్డాయి. దీంతో న్యాయమూర్తి కంగుతినగా.. పోలీసులు వెంటనే సుజిత్‌ను అదుపు చేశారు. Special POCSO Judge P.S. Kala ఇదిలా ఉంటే జడ్జి పీఎస్ కళ గతంలోనూ పోక్సో నేరాలకు సంబంధించి సంచలన తీర్పులెన్నింటినో వెలువరించారు. త్వరగతిన తీర్పులు వెలువరిస్తారని ఆయనకు పేరుంది. గతంలోనూ ఓ కేసులో నిందితుడిని ‘చచ్చే వరకు జైళ్లోనే మగ్గాలి’ అంటూ తీర్పు ఇచ్చారు. పలు కేసుల కోసం ఆయన అర్ధరాత్రిళ్లు సైతం విచారణలు కొనసాగించడం విశేషం. ఇదిలా ఉంటే హజిరా ఉదంతంలో బాధితురాలు ఐదేళ్ల బాలిక. ఆమె ఓ వలస కార్మికుడి కుటంబానికి చెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్ వలస మీద హజిరాకు వచ్చి.. ఆ కుటుంబం పక్కనే ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చాక్లెట్ ఆశ చూపించి..ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను హతమార్చాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కేసు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. ఘటన తర్వాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో 26 మంది సాక్షులను విచారించారు. మరోవైపు కోర్టు కూడా 53 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను పరిశీలించాకే తుది తీర్పు వెలువరించింది. ఇక తుదితీర్పు సందర్భంగా గుమిగూడిన జనాలు.. నిందితుడిని అక్కడికక్కడే ఉరి తీయాలంటూ నినాదాలు చేయడం విశేషం. -
మిని బస్సు- ట్రక్ ఢీ: ముగ్గురు మృతి
గుజరాత్ రాష్ట్రంలోని హజిర గ్రామ సమీపంలో మిని బస్సు, ఐరన్ లోడ్‌తో ఉన్న ట్రక్‌పైకి దూసుకువెళ్లిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానిక ఎస్ఐ బుధవారం హజిరలో వెల్లడించారు. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారని తెలిపారు. వారిని హుటాహుటిన సూరత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని ఎస్ఐ వివరించారు. హజరి గ్రామ సమీపంలోని నెం 6 జాతీయ రహదారిపై నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు మృతి చెందారని తెలిపారు. గాయపడిన వారిలో 10 మందిని ప్రాధమిక చికిత్స అనంతరం వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారని ఎస్ఐ వివరించారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుందని చెప్పారు.