Ports sector
-
ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్ఫ్రా ఫోకస్’ అవార్డు
సాక్షి, అమరావతి: తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాసిన లేఖలో ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. సెప్టెంబర్ 27న ఢిల్లీలోని హయత్ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్నాథ్ను టైమ్స్ గ్రూప్ ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. సముద్ర వాణిజ్యంపై దృష్టి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.25,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. దీనికి తోడు పోర్టులను అనుసంధానిస్తూ జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ, అనంతపురం వద్ద రెండు భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ పేరుతో భారీ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సంబంధించి రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచింది. కాకినాడ వద్ద బల్క్ డ్రగ్ పార్కు, విశాఖ అచ్యుతాపురం, నక్కపల్లి, రాంబిల్లి వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టు ఆథారిత అభివృద్ధి పనులను వివరిస్తూ ఎకనామిక్ టైమ్స్ జాతీయ స్థాయిలో కథనాన్ని ప్రచురించనున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా హార్బర్: మంత్రి అమర్నాథ్ 974 కి.మీ పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకం. సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రానికి, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. -
ఆర్సెలర్ చేతికి ఎస్సార్ పోర్టులు
న్యూఢిల్లీ: పోర్టుల బిజినెస్‌ను మెటల్ రంగ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌కు విక్రయించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్సార్ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఇందుకు 2.4 బిలియన్ డాలర్ల(రూ. 19,000 కోట్లు) విలువైన తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్–19 తదుపరి దేశీయంగా ఇది అతిపెద్ద డీల్‌కాగా.. నిర్ణీత పోర్టులతోపాటు, విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను సైతం ఆర్సెలర్‌కు బదిలీ చేయనున్నట్లు ఎస్సార్ తెలియజేసింది. ప్రధానంగా గుజరాత్‌లోని హజీరా స్టీల్ ప్లాంటు అవసరాల కోసం ఏర్పాటు చేసిన వీటిని విక్రయించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా డీల్‌లో భాగంగా హజీరాలో వార్షికంగా 4 ఎంటీ సామర్థ్యంగల ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు రెండు సంస్థలు 50:50 భాగస్వామ్య సంస్థను సైతం నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. హజీరా స్టీల్ ప్లాంటును 2018–19లోనే ఆర్సెలర్‌మిట్టల్ కొనుగోలు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. 3 రాష్ట్రాల్లో... ఎస్సార్ గ్రూప్‌తో కుదిరిన తాజా ఒప్పందంలో భాగంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పోర్టులతోపాటు హజీరాలోగల రెండు విద్యుత్ ప్లాంట్లు సొంతం కానున్నట్లు ఆర్సెలర్ మిట్టల్ విడిగా ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్ ప్రసార లైన్ సైతం దీనిలో భాగమేనని తెలియజేసింది. 2018–19లో దివాలా చట్ట చర్యలలో భాగంగా రూ. 42,000 కోట్లకు ఎస్సార్ స్టీల్‌ను ఆర్సెలర్ మిట్టల్ కొనుగోలు చేసింది. తద్వారా పోర్టు లైసెన్స్ కార్యకలాపాల హక్కులు సైతం దక్కినట్లు ఆర్సెలర్‌మిట్టల్ పేర్కొన్నప్పటికీ ఎస్సార్ బల్క్‌టెర్మినల్ దీనిని వ్యతిరేకించింది. దివాలా చర్యల్లోకి ఇవి రావని వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టులకు చేరింది. అయితే ప్రస్తుతం రెండు సంస్థలూ వీటిపై ఒక ఒప్పందానికి రావడం గమనార్హం! వైజాగ్ టెర్మినల్ సైతం హజీరాలోని డీప్ డ్రాఫ్ట్ బల్క్ పోర్ట్ టెర్మినల్‌లోని 25 ఎంటీపీఏ జెట్టీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోగల 16 ఎంటీపీఏ డీప్ డ్రాఫ్ట్ టెర్మినల్ డీల్‌లో భాగమని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడగల 8 ఎంటీపీఏ ఐరన్ ఓర్ పెల్లెట్ ప్లాంటుతో అనుసంధానమైన సమీకృత కన్వేయర్ కూడా ఉన్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా ఒడిశాలోని 12 ఎంటీపీఏ పారదీప్ డీప్ వాటర్ జెట్టీ, కన్వేయర్ ఒప్పందంలోకి వస్తాయని వివరించింది. వీటితోపాటు హజీరాలోని 270 మెగావాట్ల మల్టీ ఇంధన ప్లాంట్, 515 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటు ఉన్నట్లు వెల్లడించింది. -
ఏపీ రేవుల రంగంలో పెట్టుబడి అవకాశాలు
• త్వరలో రెండో స్థానంలోకి • కృష్ణపట్నం పోర్ట్ సీఈవో అనిల్ యెండ్లూరి సాక్షి, అమరావతి: తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఓడరేవుల రంగంలో పెట్టుబడులకు అపారఅవకాశాలున్నాయని కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి తెలిపారు. చైనాలో షెన్జెన్ నగరం కేవలం ఓడరేవులతో 300 బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను సృష్టించిందని, అదే విధమైన అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయన్నారు. 974 కి.మీ పొడవైన తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రంలో మొత్తం 14 ఓడరేవులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మంగళవారం విజయవాడలో ’పోర్టులు-లాజిస్టిక్స్’ అనే అంశంపై సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నిర్వహించిన సదస్సులో అనిల్ మాట్లాడుతూ త్వరలోనే రేవుల రంగంలో రాష్ట్రం మహారాష్ట్రను దాటి రెండవ స్థానానికి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 45 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధగమించడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.రాష్ట్రంలోని 13 జిల్లాల్లో హైవేలు, రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు, కంటైనర్లు, లాజిస్టిక్స్‌పై మరింత దృష్టిపెట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం. మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రమంతా కోస్తా తీరం ఉండటంతో వాతావరణ మార్పులు వల్ల జరిగే నష్టాలను అధిగమించే విధంగా మౌలికవసతులు పెంచుకోవాలన్నారు. చెన్నై-వైజాగ్, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడర్లలో భాగంగా రాష్ట్రంలో ఏడు నాడ్సను అభివృద్ధి చేస్తున్నామని ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సి.కుటుంబరావు తెలిపారు.