Essar Group
-
ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూత
ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు శశికాంత్ రుయా(81) వృద్ధాప్య కారణాలతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఎస్సార్ గ్రూప్ సంతాపం తెలియజేసింది. ‘రుయా జీవితకాలంలో లక్షల మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పునకు కారణమయ్యారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. తన వినయం, ఆప్యాయతతో అసాధారణ నాయకుడిగా ఎదిగారు’ అని ఎస్సార్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.శశి రుయా 1943లో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన సోదరుడు రవి రుయాతో కలిసి 1969లో ఎస్సార్ గ్రూప్‌ను స్థాపించారు. ఈ గ్రూప్ ద్వారా విభిన్న రంగాల్లో సేవలిందిస్తున్నారు. మొదట ఈ గ్రూప్ చేపట్టిన ప్రముఖ ప్రాజెక్ట్‌ల్లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ ఔటర్ బ్రేక్ వాటర్ నిర్మాణం ప్రధానమైంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2.5 కోట్లు. దీన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో ఎస్సార్ గ్రూప్‌నకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.మొదట కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్‌పై దృష్టి సారించిన ఎస్సార్ గ్రూప్ క్రమంగా వంతెనలు, ఆనకట్టలు, పవర్ ప్లాంట్లతో సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. 1980ల నాటికి ఇది చమురు, గ్యాస్ రిజర్వ్‌లను కొనుగోలు చేసి ఇంధన రంగంలోకి విస్తరించింది. 1990ల్లో స్టీల్, టెలికమ్యూనికేషన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. క్రమంగా ఎస్సార్ గ్రూప్ స్టీల్ ఇండస్ట్రీ, చమురు శుద్ధి కర్మాగారాన్ని అభివృద్ధి చేసింది. అప్పట్లో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ను రూపొందించడానికి ‘హచిసన్(హచ్)’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తర్వాతి కాలంలో టెలికాం వ్యాపారాన్ని విక్రయించింది. చమురు శుద్ధి కర్మాగారాన్ని రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆధ్వర్యంలోని కన్సార్టియంకు మళ్లించింది.ఎస్సార్ గ్రూప్ ఆధ్వర్యంలోని వ్యాపార విభాగాలుఎస్సార్ ఆయిల్ యూకేఎస్సార్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ ప్లోరేషన్ & ప్రొడక్షన్ఎస్సార్ పవర్ఎస్సార్ పోర్ట్స్ఎస్సార్ షిప్పింగ్ఎస్సార్ స్టీల్ఎస్సార్ మిన్మెట్మెసాబి మెటాలిక్స్ఎస్సార్ ప్రాజెక్ట్స్బ్లాక్ బాక్స్ కార్పొరేషన్‌ది మొబైల్ స్టోర్ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్ (ఈజీఎఫ్ఎల్)ఎస్సార్ క్యాపిటల్ఎక్స్పెన్షియా వెంచర్స్ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు..పలు హోదాల్లో గుర్తింపుశశి రుయా దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థల్లో కీలక పాత్ర పోషించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మేనేజింగ్ కమిటీలో భాగమయ్యారు. ఇండో-యూఎస్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ (ఐఎన్ఎస్ఏ)కు నాయకత్వం వహించారు. ప్రధానమంత్రి ఇండో-యూఎస్ సీఈఓ ఫోరమ్, ఇండియా-జపాన్ బిజినెస్ కౌన్సిల్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో రుయా అంతర్జాతీయ సమస్యలపై పని చేస్తున్న ‘ది ఎల్డర్స్’ కౌన్సిల్ చేరారు. ఇందులో డెస్మండ్ టుటు, కోఫీ అన్నన్, జిమ్మీ కార్టర్ వంటి ప్రముఖులున్నారు. -
లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్
యూకే రాజధాని నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ డీల్‌ను భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ సొంతం చేసుకున్నారు.ఎస్సార్ గ్రూప్‌కు సహ-యజమాని రవి రుయా ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశారు. రష్యన్ ప్రాపర్టీ ఇన్వెస్టర్ ఆండ్రీ గోంచరెంకోకు సంబంధించిన ఈ ప్రాపర్టీ విలువ దాదాపు రూ. 1200 కోట్లు. (145 మిలియన్ డాలర్లు) . 150 పార్క్ రోడ్‌లోని రీజెంట్స్ పార్క్‌కి ఎదురుగా ఉన్న హనోవర్ లాడ్జ్ మాన్షన్‌ను ఇంటిలోని జిబ్రాల్టర్-ఇన్కార్పొరేటెడ్ హోల్డింగ్ కంపెనీ విక్రయం ద్వారా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భవనం ఇటీవలి రెండేళ్ల క్రితం రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థ అనుబంధ సంస్థ గాజ్ప్రోమ్ ఇన్వెస్ట్ యుగ్ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోంచరెంకో యాజమాన్యంలో ఉంది. 2012లో కన్జర్వేటివ్ పార్టీ పీర్ రాజ్‌కుమార్ బగ్రీ లీజుకు తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ నిర్మాణంలో ఉందనీ, ఇది కుటుంబ కార్యాలయానికి ఆకర్షణీయమైన పెట్టుబడిగా చేసే ధరకు అందుబాటులోకి వచ్చింద ని రుయా ఫ్యామిలీ ఆఫీస్ ప్రతినిధి విలియం రెగో ఒక ప్రకటనలో తెలిపారని పలు మీడియా సంస్థలు నివేదించాయి. గత ఏడాది లండన్‌లో విదేశీ సంస్థల రిజిస్టర్ విధానంలో పారదర్శకతను తీసుకు రావడానికి ప్రయత్నించిన తర్వాత కూడా లండన్ అల్ట్రా-ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్లో ఇప్పటికీ గోప్యంగానే ఉండటం విశేషం. అయితే ఈ ఆంక్షల ఫలితంగా ఇప్పటిదాకా చాలా రహస్యంగా జరిగే విలాస వంత గృహాలు క్రయ విక్రయాల్లో కాస్త మార్పు వచ్చింది. బ్రోకర్ హాంప్టన్స్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత ఏడాది చివరి మూడు నెలల్లో లండన్ ఇళ్ల విక్రయాలు భారీగానే నమోదైనాయి. -
భారత్‌లో మొదటి టెస్లా కార్ ఇతనిదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీలలో టెస్లా ఒకటి. దాని వ్యవస్థాపకుడు, సీఈవో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్‌ను కలిశారు. భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మార్కెట్‌గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా ఇప్పటికీ దేశంలో అధికారికంగా లేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ టెస్లా భారత్‌కు వస్తున్నట్లు ప్రకటించారు. అయితే టెస్లా అధికారికంగా భారతదేశంలోకి రానప్పటికీ, భారతీయ రోడ్లపైకి టెస్లా కార్లు ఎప్పుడో వచ్చేశాయి. దేశంలో మొదటి టెస్లా కారును ఓ వ్యక్తి 2017లో దిగుమతి చేసుకున్నారు. ఆయనేం ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ లేదా గౌతమ్ సింఘానియా కాదు. టెస్లాను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడు ఎస్సార్ గ్రూప్ సీఈఓ ప్రశాంత్ రుయా. టెస్లా మోడల్ X SUV బ్లూ కలర్ కార్‌ను ఆయన దిగుమతి చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నడుపుతూ ఆయన చాలా సార్లు కనిపించారు. ఎస్సార్‌ను స్థాపించిన రుయా కుటుంబంలోని రెండవ తరానికి చెందినవారు ప్రశాంత్ రుయా. ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్‌లో ఆయన ఏకైక పెట్టుబడిదారు. ఎస్సార్ సంస్థను 1969లో ప్రశాంత్ రుయా తండ్రి శశి రుయా, మేనమామ రవి రుయాలు స్థాపించారు. ఇదీ చదవండి: అవును.. భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది! స్పష్టం చేసిన ఎలాన్ మస్క్ -
ఆర్సెలర్ చేతికి ఎస్సార్ పోర్టులు
న్యూఢిల్లీ: పోర్టుల బిజినెస్‌ను మెటల్ రంగ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌కు విక్రయించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్సార్ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఇందుకు 2.4 బిలియన్ డాలర్ల(రూ. 19,000 కోట్లు) విలువైన తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్–19 తదుపరి దేశీయంగా ఇది అతిపెద్ద డీల్‌కాగా.. నిర్ణీత పోర్టులతోపాటు, విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను సైతం ఆర్సెలర్‌కు బదిలీ చేయనున్నట్లు ఎస్సార్ తెలియజేసింది. ప్రధానంగా గుజరాత్‌లోని హజీరా స్టీల్ ప్లాంటు అవసరాల కోసం ఏర్పాటు చేసిన వీటిని విక్రయించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా డీల్‌లో భాగంగా హజీరాలో వార్షికంగా 4 ఎంటీ సామర్థ్యంగల ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు రెండు సంస్థలు 50:50 భాగస్వామ్య సంస్థను సైతం నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. హజీరా స్టీల్ ప్లాంటును 2018–19లోనే ఆర్సెలర్‌మిట్టల్ కొనుగోలు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. 3 రాష్ట్రాల్లో... ఎస్సార్ గ్రూప్‌తో కుదిరిన తాజా ఒప్పందంలో భాగంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పోర్టులతోపాటు హజీరాలోగల రెండు విద్యుత్ ప్లాంట్లు సొంతం కానున్నట్లు ఆర్సెలర్ మిట్టల్ విడిగా ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్ ప్రసార లైన్ సైతం దీనిలో భాగమేనని తెలియజేసింది. 2018–19లో దివాలా చట్ట చర్యలలో భాగంగా రూ. 42,000 కోట్లకు ఎస్సార్ స్టీల్‌ను ఆర్సెలర్ మిట్టల్ కొనుగోలు చేసింది. తద్వారా పోర్టు లైసెన్స్ కార్యకలాపాల హక్కులు సైతం దక్కినట్లు ఆర్సెలర్‌మిట్టల్ పేర్కొన్నప్పటికీ ఎస్సార్ బల్క్‌టెర్మినల్ దీనిని వ్యతిరేకించింది. దివాలా చర్యల్లోకి ఇవి రావని వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టులకు చేరింది. అయితే ప్రస్తుతం రెండు సంస్థలూ వీటిపై ఒక ఒప్పందానికి రావడం గమనార్హం! వైజాగ్ టెర్మినల్ సైతం హజీరాలోని డీప్ డ్రాఫ్ట్ బల్క్ పోర్ట్ టెర్మినల్‌లోని 25 ఎంటీపీఏ జెట్టీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోగల 16 ఎంటీపీఏ డీప్ డ్రాఫ్ట్ టెర్మినల్ డీల్‌లో భాగమని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడగల 8 ఎంటీపీఏ ఐరన్ ఓర్ పెల్లెట్ ప్లాంటుతో అనుసంధానమైన సమీకృత కన్వేయర్ కూడా ఉన్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా ఒడిశాలోని 12 ఎంటీపీఏ పారదీప్ డీప్ వాటర్ జెట్టీ, కన్వేయర్ ఒప్పందంలోకి వస్తాయని వివరించింది. వీటితోపాటు హజీరాలోని 270 మెగావాట్ల మల్టీ ఇంధన ప్లాంట్, 515 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటు ఉన్నట్లు వెల్లడించింది. -
విద్యుత్ రంగంలో అదానీ! ట్రాన్స్మిషన్ లైన్ల కోసం వేలకోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ దిగ్గజాలు అదానీ ట్రాన్స్మిషన్, ఎస్సార్ పవర్ లిమిటెడ్ మధ్య తాజాగా రూ. 1,913 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. డీల్‌లో భాగంగా ఎస్సార్ పవర్‌కు చెందిన విద్యుత్ ప్రసార లైన్లను అదానీ ట్రాన్స్మిషన్ కొనుగోలు చేయనుంది. దేశీ కార్పొరేట్ చరిత్రలోనే భారీ రుణ భారాన్ని తగ్గించుకుంటున్న ఎస్సార్ ఈ వ్యూహంలో భాగంగానే తాజా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గత మూడేళ్లలో కంపెనీ రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ. 1.8 లక్షల కోట్లకుపైగా చెల్లించింది. కాగా.. రెండు ట్రాన్స్మిషన్ లైన్ అనుబంధ సంస్థలలో ఒక కంపెనీని అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎస్సార్ పవర్ వెల్లడించింది. మహన్ నుంచి సైపట్ పూలింగ్ సబ్‌స్టేషన్ వరకూ 465 కిలోమీటర్లమేర మూడు రాష్ట్రాలలో విస్తరించిన ఎస్సార్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీని అదానీ ట్రాన్స్మిషన్కు బదిలీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ పవర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 285 వద్ద ముగిసింది. -
చందా కొచర్: మరో భారీ కుంభకోణం
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ వివాదం ఉచ్చు బ్యాంకు సీఈఓ చందా కొచర్ చుట్టూ మరింత దృఢంగా బిగుస్తూ వుండగానే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ రుణ వివాదాన్ని వెలికి తీసిన అరవింద్ గుప్తానే చందా కొచర్ దంపతులపై మరోసారి తీవ్రమైన ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఈ మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ రాశారు. మారిషస్ కంపెనీల ద్వారా భారీగా చందా కొచర్ భర్త దీపక్ కొచర్ లబ్ది పొందినట్లు ఆరోపించారు. ఇందులో ఎస్సార్ గ్రూపు రుయా బ్రదర్స్ కీలక పాత్ర పోషించారనీ, తద్వారా సుమారు రూ. 453 కోట్లు దీపక్ కొచర్ కంపెనీ నూ పవర్ గ్రూప్‌నకు మళ్ళినట్లు ఆయన ఆరోపించారు. మొత్తం కంపెనీ రుణం 102 కోట్ల డాలర్లు కాగా... ఇందులో 25 శాతం పైగా రుణాలు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని అరవింద్ గుప్తా ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకే 35 కోట్ల డాలర్ల రుణం ఇచ్చిందన్నారు. ఈ లావాదేవీలు అన్నింటిపైనా దర్యాప్తు చేయాలనీ, ఈ నిధులు ఎలా బదిలీ అయ్యాయో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల పత్రాలను మే 11న ప్రధాని సహా, సంబంధిత మంత్రిత్వ శాఖ, రెగ్యులేటరీ సంస్థలకు పంపారు. రుయా సోదరుల్లో ఒకరైన రవి రుయా కుమార్తె స్మితి రుయా భర్త నిషాంత్ కనోడియాకు మారిషస్‌లో మాటిక్స్ అనే గ్రూప్ ఉంది. మారిషస్‌లోని ఎస్సార్ గ్రూప్ ప్రధాన కంపెనీ ఎస్సార్ క్యాపిటల్ హోల్డింగ్ కంపెనీ నిషాంత్ కనోడియాకు చెందిన మాటిక్స్ గ్రూప్ కంపెనీ మాటిక్స్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌లో రూ. 163.53 కోట్లు పెట్టుబడి పెట్టింది. మాటిక్స్ ఫర్టిలైజర్స్ షేర్లను భారీగా కొనుగోలు చేసింది. 2010 డిసెంబర్ నుంచి 2012 మార్చి 21వ తేదీ మధ్య కాలంలో చందా కొచర్ భర్తకు చెందిన నూ పవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో మాటిక్స్ గ్రూప్ రూ. 324.37 కోట్లు పెట్టుబడి పెట్టింది. తమ గ్రూప్‌నకు చెందిన ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ అనే కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టారు. ఇది మొదటి పెట్టుబడి కాగా రెండో పెట్టుబడి రుయాల మేనల్లుడైన అనిరుధ్ భూవల్కాకు చెందిన కంపెనీల ద్వారా చందా కొచర్ భర్త కంపెనీకి నిధులు వచ్చాయి. ఎస్సార్ గ్రూప్‌నకు చెందిన ఏషియా మోటార్ వర్క్స్ హోల్డింగ్స్ అనే కంపెనీ దీపక్ కొచర్‌కు చెందిన నూ పవర్ టెక్నాలజీస్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. నేరుగా పెట్టుబడులు పెట్టడం కాకుండా ఎఎండబ్ల్యూ మోటార్స్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా రూ. 197 కోట్ల పెట్టుబడి పెట్టడాన్ని ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నష్టాల్లో కూరుకుపోయిన నూ పవర్ టెక్నాలజీస్‌ని, కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న భారీ రుణాలకు గాను భర్త దీపక్ కొచర్ నుంచి భారీ మొత్తంలో కంపెనీ కొనుగోలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు. ఎస్సార్ స్టీల్ మినెసొటా (అమెరికా) అలగొమా స్టీల్ (కెనడా) కంపెనీల కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన విదేశీ శాఖలు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాయని తెలిపారు. సింగపూర్, బ్రిటన్, న్యూయార్క్‌లోని తమ శాఖల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రుణాలు ఇచ్చిందన్నారు. 2010లో ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు 53 కోట్ల డాలర్ల రుణాన్ని లీడ్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సార్ గ్రూప్‌కు ఇచ్చింది. అలాగే బ్రిటన్‌లోని స్లాన్ఫ్లో రిఫైనరీ కొనుగోలు కోసం మరో 35 కోట్ల డాలర్ల రుణాన్ని ఎస్సార్ ఆయిల్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని అరవింద్ గుప్తా ఆరోపించారు. చందా కొచర్ భర్తకు నూ పవర్ గ్రూప్ పేరుతో పలు కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే నూ పవర్ రెన్యూవల్ ఎనర్జీ కంపెనీలోకి వీడియోకాన్ నిధుల తరలింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. తాజాగా ఇదే కంపెనీలోకి మారిషస్ నుంచి ఎస్సార్ గ్రూప్ నిధులు వచ్చాయనేది అరవింద్ గుప్తా ఆరోపణ. ఎస్సార్ గ్రూప్ ఛైర్మన్ శశిరూయా అల్లుడు నిషాంత్ కనోడియా నుంచి రూ. 324.37 కోట్లు నూ పవర్ గ్రూప్‌లోకి రాగా, రుయాల మేనల్లుడు అనిరుధ్ భూవాల్కా కంపెనీల ద్వారా రూ. 197 కోట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఐసీఐసీఐ,ఎస్సార్ గ్రూపు ఖండన అయితే ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. ఎస్సార్ గ్రూప్‌కు తాము ఒక్కరమే రుణం ఇవ్వలేదని, ఏడు బ్యాంకుల కన్సార్టియం రుణాలనిచ్చినట్టు వాదించింది. అటు అరవింద్ గుప్తా ఆరోపణలపై ఎస్సార్ గ్రూప్ స్పందిస్తూ ఉద్దేశపూర్వక ఆరోపణలంటూ తీవ్రంగా ఖండించింది. నూ పవర్లో పెట్టుబడి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్‌తో తమ గ్రూప్‌నకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. త్వరలోనే తమ వైఖరిని బహిరంగంగా తెలియజేస్తామని పేర్కొంది. 1980 నుంచి తాము ఐసీఐసీఐతో లావాదేవీలు నిర్వహిస్తున్నామనీ, తమ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఎస్సార్ గ్రూప్ స్పష్టం చేసింది. అటు మాటిక్స్ గ్రూప్ కూడా తమకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధం లేదని,తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని వెల్లడించింది. ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్‌తో ఎస్సార్‌కు సంబంధం లేదని తెలిపింది. అలాగే కంపెనీ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్న రంగంలో ఉన్నందున నూ పవర్లో తాము పెట్టుబడులు పెట్టామని మాటిక్స్ పేర్కొంది. తరవాత ఆ కంపెనీ నుంచి వైదొలగామని వెల్లడించింది. కాగా వీడియోకాన్-ఐసీఐసీఐ రుణాల కుంభకోణాన్ని 2016 మార్చిలో అరవింద్‌గుప్తా వెలుగులోకి తెచ్చారు. -
ఆయిల్, గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగం
ఎస్సార్ గ్రూప్ డెరైక్టర్ ప్రశాంత్ రుయా వెల్లడి పనాజి: ఆయిల్,గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగడం లేదని ఎస్సార్ గ్రూప్ సోమవారం స్పష్టం చేసింది. ఈ గ్రూప్ ఇటీవలే తన రిఫైనరీ కంపెనీ, ఎస్సార్ ఆయిల్లో 98 శాతం వాటాను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, ఇతర కంపెనీలకు 1,290 కోట్ల డాలర్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ విక్రయం కారణంగా వచ్చే నిధులతో..రూ.88 కోట్లుగా ఉన్న తమ రుణ భారం సగానికి తగ్గించుకుంటామని, వడ్డీ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించుకుంటామని ఎస్సార్ గ్రూప్ డెరైక్టర్ ప్రశాంత్ రుయా చెప్పారు. అంతేకాకుండా ఇతర వ్యాపారాల్లో స్థిరీకరణకు, వృద్ధికి ఈ నిధులను వినియోగిస్తామని వివరించారు. భారత కార్పొరేట్ చరిత్రలో ఇదే అతి పెద్ద రుణ భారం తగ్గించుకునే ఎక్స్‌ర్‌సైజ్ అని అభివర్ణించారు. అంతా నగదులోనే జరిగే ఈ డీల్ వచ్చే ఏడాది మొదటి క్వార్టర్లో పూర్తవగలదని చెప్పారు. ఎస్సార్ గ్రూప్ ఆయిల్, గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగడం లేదని ప్రశాంత్ రుయా చెప్పారు. యూకేలోని స్టాన్‌లో నగరంలో 12 మిలియన్ టన్నుల రిఫైనరీను నిర్వహిస్తున్నామని, బ్రిటన్‌లో 12-13 శాతం మార్కెట్ వాటా ఉందని తెలిపారు. మౌలిక రంగంలో తగిన స్థాయిలో పెట్టుబడులు పెట్టి, అభివృద్ది చేస్తామని, తర్వాత సరైన సమయంలో విక్రయిస్తామని రుయా చెప్పారు. టెలికం వ్యాపారంలో కూడా ఎస్సార్ గ్రూప్ ఇదే విధంగా చేసింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హచిసన్ వాంపోవను కొనుగోలు చేసింది. తర్వాత 2011లో వొడాఫోన్‌కు 1,800 కోట్ల డాలర్లకు విక్రయించింది. -
‘చమురు-వజ్ర’ బంధం
పుతిన్ పర్యటనలో భారత్ కంపెనీలతో కీలక ఒప్పందాలు ⇒పదేళ్లపాటు క్రూడ్ దిగుమతి చేసుకోనున్న ఎస్సార్ గ్రూప్ ⇒10 బిలియన్ డాలర్ల డీల్... ⇒ఎస్సార్‌కు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్న రష్యా బ్యాంక్... ⇒2 బిలియన్ డాలర్ల వజ్రాల దిగుమతికి 12 కంపెనీల కాంట్రాక్టు న్యూఢిల్లీ: చిరకాల మిత్రదేశాలైన రష్యా, భారత్‌ల మధ్య వాణిజ్య, వ్యాపారం సంబంధాల్లో ‘చమురు-వజ్ర’ బంధానికి తెరలేచింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన సందర్భంగా ముడి చమురు(క్రూడ్), వజ్రాల దిగుమతికి వీలుగా కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌కు చెందిన ఎస్సార్ గ్రూప్... రష్యా నుంచి క్రూడ్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల చొప్పున పదేళ్ల పాటు క్రూడ్‌ను దిగుమతి చేసుకునేందుకు రష్యా చమురు దిగ్గజం ఓఏఓ రాస్నెఫ్ట్తో డీల్ ఓకే అయింది. దీని విలువ 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62,000 కోట్లు). భారత్ ఆయిల్ కంపెనీలు కుదుర్చుకున్న అతిపెద్ద ఆయిల్ డీల్స్‌లో ఒకటిగా కూడా దీన్ని చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ డీల్ అమల్లోకి రానుందని... సముద్రమార్గం ద్వారా క్రూడ్‌ను సరఫరా చేయనున్నట్లు ఓఏఓ రాస్‌నెఫ్ట్ చైర్మన్ ఇగర్ ఇవనోవిచ్ సెచిన్ పేర్కొన్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌ల సమక్షంలో ఎస్సార్ సహ వ్యవస్థాపకుడు శశి రూయా, సెచిన్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. 4,05,000 బ్యారెల్స్ రోజువారీ సామర్థ్యంతో గుజరాత్‌లోని వడినార్‌లో ఎస్సార్ భారీ రిఫైనరీని నిర్వహిస్తోంది. కాగా, వెనెజువెలా నుంచి రోజుకు 3-4 లక్షల బ్యారెళ్ల(బీపీడీ) క్రూడ్ దిగుమతి కోసం గతంలో కుదుర్చుకున్న పదిహేనేళ్ల ఒప్పందం ఇప్పటిదాకా అతిపెద్దదిగా నిలుస్తోంది. కాగా, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం కొత్త పుంతలు తొక్కిస్తుందని సెచిన్ వ్యాఖ్యానించారు. భారత్‌కు ఇంధన భద్రతను కూడా కల్పిస్తుందన్నారు. కాగా, ఎస్సార్ రిఫైనరీలకు దీర్ఘకాలంపాటు ఎలాంటి ఆటం కం లేకుండా క్రూడ్ సరఫరా అయ్యేలా ఈ ఒప్పందం భరోసా కల్పిస్తుందని శశి రూయా పేర్కొన్నారు. ఎస్సార్‌కు బిలియన్ డాలర్ల రుణం... ఎస్సార్ గ్రూప్ కార్పొరేట్, ప్రాజెక్టు అవసరాల కోసం రష్యాకు చెందిన వీటీబీ బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,200 కోట్లు) రుణం ఇవ్వడానికి అంగీకరించింది. మోదీ, పుతిన్‌ల సమక్షంలోనే వీటీబీ చైర్మన్ ఆండ్రే కోట్సిన్, ఎస్సార్ శశి రూయాలు అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశారు. భారత్‌కు రష్యా వజ్రాలు.... రష్యా నుంచి వచ్చే మూడేళ్లలో 2.1 బిలియన్ డాలర్ల విలువైన ముడి వజ్రాలను భారత్ దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు రష్యా డైమండ్ మైనింగ్ దిగ్గజం అల్రోసాతో 12 భారతీయ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పుతిన్, మోదీ గురువారమిక్కడ ప్రారంభించిన ప్రపంచ వజ్రాల సదస్సు సందర్భంగా ఈ డీల్‌పై సంతకాలు జరిగాయి. కిరణ్ జెమ్స్, ఆసియన్ స్టార్, రోసీ బ్లూ ఇండియా తదితర కంపెనీలు విడివిడిగా మొత్తం 12 కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్ విపుల్ షా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల ఉత్పత్తి దేశంగా రష్యా నిలుస్తోంది. మరోపక్క, ముడి వజ్రాలను సానపట్టే విషయంలో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉంది. రష్యా దిగుమతులవల్ల అంతర్జాతీయ ట్రేడింగ్ హబ్స్‌కు చెల్లిస్తున్న భారీ కమిషన్ ఆదా అవుతుందని ముంబైకి చెందిన రోసీ బ్లూ డైమండ్ ఎండీ రసెల్ మెహతా చెప్పారు. ప్రస్తుతం భారత్ ముడి వజ్రాల కోసం దుబై, ఆంట్వెర్ప్, బెల్జియం వంటి అంతర్జాతీయ హబ్‌లపై ఆధారపడుతోంది. కాగా, ఈ డీల్ కారణంగా ఆయా దేశాలపై రష్యా పైచేయి సాధించేందుకు కూడా దోహదం చేయనుంది. కాగా, భారత్‌ను డైమండ్ హబ్‌గా మార్చేం దుకు వీలుగా భారత్‌తో నేరుగా వ్యాపారాన్ని నిర్వహించాలని రష్యా మైనింగ్ కంపెనీలను సదస్సు సందర్భంగా మోదీ ఆహ్వానించారు. ఈ రంగంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించేందుకు నిబంధనలను సరళతరం చేయాలని పుతిన్‌ను కోరారు. 2025కల్లా ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు....ఇరు దేశాల లక్ష్యమిది.. న్యూఢిల్లీ: వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేదిశగా భారత్, రష్యాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉమ్మడిగా చమురు-గ్యాస్ రంగంలో అన్వేషణ, పెట్రోలియం ప్లాంట్ల ఏర్పాటు, పైప్లైన్ల నిర్మాణం చేపట్టాలని.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్మార్ట్ సిటీల ఏర్పాటులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలని కూడా నిర్దేశించుకున్నాయి. పుతిన్ పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘చమురు-గ్యాస్ అన్వేషణ, ఎల్ఎన్జీ ప్రాజెక్టులు, సరఫరా విషయంలో హైడ్రోకార్బన్ కంపెనీల మధ్య విస్తృత భాగస్వామ్యం నెలకొల్పాలి. రష్యాలో కొత్త చమురు-గ్యాస్ క్షేత్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భారతీయ కంపెనీలు మరింత పాలుపంచుకోవాలి. ఇరు దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ పెట్రోకెమికల్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంపై దృష్టిపెట్టాలి. భారత్, రష్యాల మధ్య చమురు-గ్యాస్ పైప్‌లైన్ నెట్వర్క్ వ్యవస్థ నిర్మాణానికిగల అవకాశాలను అధ్యయనం చేయా లి’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. భారత్ తలపెట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా తయారీ రంగంలో విస్తృత అవకాశాలను రష్యా అందిపుచ్చుకోవాలని తెలిపింది. ఇరు దేశాల్లో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని మోదీ, పుతిన్ ఆకాం క్షించారు. కాగా, 2025 నాటికి ఇరే దేశాల కంపెనీల ఉమ్మడి పెట్టుబడులను ద్వైపాక్షిక ప్రాతిపదికన 15 బిలియన్ డాలర్లకు చేర్చాలని నిర్దేశించారు. అడ్డంకులు తొలగిస్తాం: పుతిన్, మోదీ హామీ న్యూఢిల్లీ: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణి జ్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపడతామని పుతిన్, మోదీలు ఇరు దేశాల కార్పొరేట్ దిగ్గజాలకు గురువారం హామీనిచ్చారు. భారత్ పర్యటన సందర్భంగా పుతిన్ అక్కడి టాప్ వ్యాపారవేత్తలతో కూడి అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని వెంటతీసుకొచ్చారు. గురువారం జరిగిన సమావేశంలో భారత్‌కు సంబంధించి ఎస్సార్ గ్రూప్ సారథులు శశి, రవి రూయా, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఎల్అండ్టీ చీఫ్ ఏఎం నాయక్, మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు హాజరయ్యారు. కాగా, ఫార్యా, బ్యాంకింగ్, ఇంధనం, ఇన్ఫ్రా రంగాకు సంబంధించి వాణిజ్యాన్ని పెంచే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు ఇతరత్రా అంశాలను ఈ సందర్బంగా కార్పొరేట్ ఇండియా ప్రతినిధులు లేవనెత్తారు. ‘సమావేశం చాలా బాగా జరిగింది. పెట్టుబడులు, వాణిజ్య పెంపు విషయంలో సమస్యలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఇరు నేతలు హామీనిచ్చారు’ అని ఒక పారిశ్రామిక ప్రతినిధి చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 6 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.37,200 కోట్లు)గా నమోదైంది. కాగా, ఏప్రిల్ 2000 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రష్యా నుంచి భారత్‌కు 93.5 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు లభించాయి.