చందా కొచర్‌: మరో భారీ కుంభకోణం | Whistleblower in ICICI-Videocon case levels new allegations against Kochhar in letter to prime minister | Sakshi
Sakshi News home page

చందా కొచర్‌: మరో భారీ కుంభకోణం

Published Sat, Jun 2 2018 5:29 PM | Last Updated on Sat, Jun 2 2018 7:43 PM

Whistleblower in ICICI-Videocon case levels new allegations against Kochhar in letter to prime minister - Sakshi

సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్‌ వివాదం ఉచ్చు   బ్యాంకు సీఈఓ చందా కొచర్‌ చుట్టూ మరింత దృఢంగా బిగుస్తూ వుండగానే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్‌ రుణ వివాదాన్ని వెలికి తీసిన అరవింద్‌ గుప్తానే చందా కొచర్‌ దంపతులపై మరోసారి తీవ్రమైన ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఈ మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ రాశారు. మారిషస్‌ కంపెనీల ద్వారా భారీగా చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ లబ్ది పొందినట్లు ఆరోపించారు. ఇందులో ఎస్సార్‌ గ్రూపు రుయా బ్రదర్స్‌ కీలక పాత్ర పోషించారనీ, తద్వారా సుమారు రూ. 453 కోట్లు దీపక్‌ కొచర్‌ కంపెనీ నూ పవర్‌ గ్రూప్‌నకు మళ్ళినట్లు ఆయన ఆరోపించారు. మొత్తం కంపెనీ రుణం 102 కోట్ల డాలర్లు కాగా... ఇందులో 25 శాతం పైగా రుణాలు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిందని అరవింద్‌ గుప్తా ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకే 35 కోట్ల డాలర్ల రుణం ఇచ్చిందన్నారు.  ఈ లావాదేవీలు అన్నింటిపైనా దర్యాప్తు చేయాలనీ, ఈ నిధులు ఎలా బదిలీ అయ్యాయో విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణల పత్రాలను మే 11న ప్రధాని సహా, సంబంధిత మంత్రిత్వ శాఖ, రెగ్యులేటరీ సంస్థలకు పంపారు.

రుయా సోదరుల్లో ఒకరైన రవి రుయా కుమార్తె స్మితి రుయా భర్త నిషాంత్‌ కనోడియాకు మారిషస్‌లో మాటిక్స్‌ అనే గ్రూప్‌ ఉంది. మారిషస్‌లోని ఎస్సార్‌ గ్రూప్‌ ప్రధాన కంపెనీ ఎస్సార్‌ క్యాపిటల్‌ హోల్డింగ్‌ కంపెనీ నిషాంత్‌ కనోడియాకు చెందిన మాటిక్స్‌ గ్రూప్‌ కంపెనీ మాటిక్స్‌ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌లో రూ. 163.53 కోట్లు పెట్టుబడి పెట్టింది. మాటిక్స్‌ ఫర్టిలైజర్స్‌  షేర్లను  భారీగా కొనుగోలు చేసింది. 2010 డిసెంబర్‌ నుంచి 2012 మార్చి 21వ తేదీ మధ్య కాలంలో చందా కొచర్‌ భర్తకు చెందిన నూ పవర్‌ రెన్యూవబుల్స్‌ కంపెనీలో మాటిక్స్‌ గ్రూప్‌ రూ. 324.37 కోట్లు పెట్టుబడి పెట్టింది. తమ గ్రూప్‌నకు చెందిన ఫస్ట్‌ల్యాండ్‌ హోల్డింగ్స్‌ అనే కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టారు. ఇది మొదటి పెట్టుబడి కాగా రెండో పెట్టుబడి రుయాల మేనల్లుడైన అనిరుధ్‌ భూవల్కాకు చెందిన కంపెనీల ద్వారా చందా కొచర్ భర్త కంపెనీకి నిధులు వచ్చాయి. ఎస్సార్‌ గ్రూప్‌నకు చెందిన ఏషియా మోటార్‌ వర్క్స్‌ హోల్డింగ్స్‌ అనే కంపెనీ దీపక్‌ కొచర్‌కు చెందిన నూ పవర్‌ టెక్నాలజీస్‌ అనే కంపెనీని కొనుగోలు చేసింది. నేరుగా పెట్టుబడులు పెట్టడం కాకుండా ఎఎండబ్ల్యూ మోటార్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ద్వారా రూ. 197 కోట్ల పెట్టుబడి పెట్టడాన్ని ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నష్టాల్లో కూరుకుపోయిన నూ పవర్‌ టెక్నాలజీస్‌ని, కేవలం ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి తీసుకున్న భారీ రుణాలకు గాను భర్త దీపక్‌ కొచర్‌ నుంచి భారీ మొత్తంలో కంపెనీ కొనుగోలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు.

ఎస్సార్‌ స్టీల్‌ మినెసొటా (అమెరికా) అలగొమా స్టీల్‌ (కెనడా) కంపెనీల కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన విదేశీ శాఖలు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాయని తెలిపారు. సింగపూర్‌, బ్రిటన్‌, న్యూయార్క్‌లోని తమ శాఖల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ రుణాలు ఇచ్చిందన్నారు. 2010లో ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు 53 కోట్ల డాలర్ల రుణాన్ని లీడ్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎస్సార్‌ గ్రూప్‌కు ఇచ్చింది. అలాగే బ్రిటన్‌లోని స్లాన్‌ఫ్లో రిఫైనరీ కొనుగోలు కోసం మరో 35 కోట్ల డాలర్ల రుణాన్ని ఎస్సార్‌ ఆయిల్‌ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిందని అరవింద్‌ గుప్తా ఆరోపించారు. చందా కొచర్‌ భర్తకు నూ పవర్‌ గ్రూప్‌ పేరుతో పలు కంపెనీలు ఉన్నాయి.  ఇప్పటికే నూ పవర్‌ రెన్యూవల్‌ ఎనర్జీ కంపెనీలోకి వీడియోకాన్‌ నిధుల తరలింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. తాజాగా ఇదే కంపెనీలోకి మారిషస్‌ నుంచి ఎస్సార్‌ గ్రూప్‌ నిధులు వచ్చాయనేది అరవింద్‌ గుప్తా ఆరోపణ. ఎస్సార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ శశిరూయా అల్లుడు నిషాంత్‌ కనోడియా నుంచి రూ. 324.37 కోట్లు నూ పవర్‌ గ్రూప్‌లోకి రాగా, రుయాల మేనల్లుడు అనిరుధ్‌ భూవాల్కా కంపెనీల ద్వారా రూ. 197 కోట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

ఐసీఐసీఐ,ఎస్సార్‌ గ్రూపు ఖండన
అయితే ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖండించింది. ఎస్సార్‌ గ్రూప్‌కు తాము ఒక్కరమే రుణం ఇవ్వలేదని, ఏడు బ్యాంకుల కన్సార్టియం రుణాలనిచ్చినట్టు వాదించింది. అటు అరవింద్‌ గుప్తా ఆరోపణలపై ఎస్సార్‌ గ్రూప్‌ స్పందిస్తూ ఉద్దేశపూర్వక ఆరోపణలంటూ తీవ్రంగా ఖండించింది. నూ పవర్‌లో పెట్టుబడి పెట్టిన ఫస్ట్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌తో తమ గ్రూప్‌నకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. త్వరలోనే తమ వైఖరిని బహిరంగంగా తెలియజేస్తామని పేర్కొంది. 1980 నుంచి తాము ఐసీఐసీఐతో లావాదేవీలు నిర్వహిస్తున్నామనీ, తమ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఎస్సార్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది. అటు మాటిక్స్‌ గ్రూప్‌ కూడా తమకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధం లేదని,తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని వెల్లడించింది. ఫస్ట్‌ల్యాండ్‌ హోల్డింగ్స్‌తో ఎస్సార్‌కు సంబంధం లేదని తెలిపింది. అలాగే కంపెనీ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్న రంగంలో ఉన్నందున నూ పవర్‌లో తాము పెట్టుబడులు పెట్టామని మాటిక్స్‌ పేర్కొంది. తరవాత ఆ కంపెనీ నుంచి వైదొలగామని వెల్లడించింది. కాగా వీడియోకాన్‌-ఐసీఐసీఐ రుణాల కుంభకోణాన్ని 2016 మార్చిలో అరవింద్‌గుప్తా వెలుగులోకి తెచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement