![Sankaran Naren CIO of ICICI Pru Mutual Fund advised investors to protect the gains made over the past five years](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/naren0.jpg.webp?itok=JNp64DgZ)
భారత స్టాక్‌మార్కెట్ సూచీలు గత కొన్ని రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తీవ్రంగా పడిపోయిన మార్కెట్ సూచీల్లో ప్రధానంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లే అధికంగా ఉన్నాయి. అందుకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) శంకరన్ నరేన్ చేసిన కామెంట్లు కారణమని కొందరు భావిస్తున్నారు. అసలు ఆయన స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేశారో తెలుసుకుందాం. స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లు గత ఐదేళ్లలో సాధించిన లాభాలను కాపాడుకోవాలని నరేన్ సూచించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రస్తుతం అధిక వాల్యుయేషన్‌లో ఉన్నాయని, రిస్క్‌లను నిర్వహించడానికి వైవిధ్యభరితంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
లాభాలు కాపాడుకోవడం: గత ఐదేళ్లలో ఆర్జించిన రాబడులను కాపాడుకోవాలని నరేన్ నొక్కి చెప్పారు. ఆ సమయంలో ఈక్విటీలు లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లు గణనీయమైన రాబడులను చూశారని ఆయన పేర్కొన్నారు.
ఓవర్ వాల్యుయేషన్: లార్జ్ క్యాప్ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు అధిక విలువను కలిగి ఉన్నాయని నరేన్ అన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను విక్రయించడమే ఈ అసమానతలకు కారణమని, ఇది మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ధరలను పెంచేలా చేసిందన్నారు.
డైవర్సిఫైడ్ స్ట్రాటజీ: ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్, గ్లోబల్ స్టాక్స్, బంగారం, వెండి వంటి పెట్టుబడులను సూచిస్తూ వైవిధ్యభరితంగా ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెట్టుబడులన్నీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టొద్దని తెలిపారు.
మార్కెట్ అస్థిరత: 2008-2010 కాలం కంటే 2025 మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు. ఇన్వెస్టర్లు ఈ విభాగాల్లో తమ పెట్టుబడులను రిడీమ్ చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?
వివరణ
నరేన్ చేసిన ఈ వ్యాఖ్యలను మార్కెట్ పరిగణలోకి తీసుకుని భారీగా నష్టపోయినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై నరేన్‌ను వివరణ కోరగా ఆయన స్పందించారు. ‘భారత మార్కెట్‌లో దీర్ఘకాలిక వృద్ధి తథ్యం. దానిపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ప్రస్తుత సవాలు డబ్బు సంపాదించడం కాదు. దాన్ని పరిరక్షించడం. ఇన్వెస్టర్లు తమ లాభాలను కాపాడుకోవడంపై దృష్టి సారించాలి. ఎప్పటినుంచో చాలామంది అంచనా వేస్తున్నట్టుగానే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ భారీగా పెరిగాయి. ఈ పెట్టుబడులతో జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. ఈ వ్యవహారంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా మాట్లాడుతూ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ఒడిదొడుకులకు లోనుకావద్దని, దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment