ఆయిల్, గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగం
ఎస్సార్ గ్రూప్ డెరైక్టర్ ప్రశాంత్ రుయా వెల్లడి
పనాజి: ఆయిల్,గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగడం లేదని ఎస్సార్ గ్రూప్ సోమవారం స్పష్టం చేసింది. ఈ గ్రూప్ ఇటీవలే తన రిఫైనరీ కంపెనీ, ఎస్సార్ ఆయిల్‌లో 98 శాతం వాటాను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, ఇతర కంపెనీలకు 1,290 కోట్ల డాలర్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ విక్రయం కారణంగా వచ్చే నిధులతో..రూ.88 కోట్లుగా ఉన్న తమ రుణ భారం సగానికి తగ్గించుకుంటామని, వడ్డీ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించుకుంటామని ఎస్సార్ గ్రూప్ డెరైక్టర్ ప్రశాంత్ రుయా చెప్పారు.
అంతేకాకుండా ఇతర వ్యాపారాల్లో స్థిరీకరణకు, వృద్ధికి ఈ నిధులను వినియోగిస్తామని వివరించారు. భారత కార్పొరేట్ చరిత్రలో ఇదే అతి పెద్ద రుణ భారం తగ్గించుకునే ఎక్స్‌ర్‌సైజ్ అని అభివర్ణించారు. అంతా నగదులోనే జరిగే ఈ డీల్ వచ్చే ఏడాది మొదటి క్వార్టర్‌లో పూర్తవగలదని చెప్పారు. ఎస్సార్ గ్రూప్ ఆయిల్, గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగడం లేదని ప్రశాంత్ రుయా చెప్పారు. యూకేలోని స్టాన్‌లో నగరంలో 12 మిలియన్ టన్నుల రిఫైనరీను నిర్వహిస్తున్నామని, బ్రిటన్‌లో 12-13 శాతం మార్కెట్ వాటా ఉందని తెలిపారు.
మౌలిక రంగంలో తగిన స్థాయిలో పెట్టుబడులు పెట్టి, అభివృద్ది చేస్తామని, తర్వాత సరైన సమయంలో విక్రయిస్తామని రుయా చెప్పారు. టెలికం వ్యాపారంలో కూడా ఎస్సార్ గ్రూప్ ఇదే విధంగా చేసింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హచిసన్ వాంపోవను కొనుగోలు చేసింది. తర్వాత 2011లో వొడాఫోన్‌కు 1,800 కోట్ల డాలర్లకు విక్రయించింది.