
సాక్షి, బెంగళూరు: ఇస్రో తొలి మానవ సహిత ప్రయోగం (గగన్‌యాన్ మిషన్)కు ఫ్రాన్స్ సహకారం అందించనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ సీఎన్‌ఈఎస్ ఒప్పందం చేసుకున్నాయి. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం దేశానికి వచ్చిన ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జీన్ యువేస్ లీ డ్రయాన్ చివరి రోజైన గురువారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు ఇస్రో చైర్మన్ శివన్ స్వాగతం పలికారు. ఇస్రో, సీఎన్‌ఈఎస్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఫ్రాన్స్‌లోని క్యాడమోస్ కేంద్రంలో భారత వ్యోమగాములకు, ఫ్లైట్ ఫిజీషియన్లకు, క్యాప్‌కామ్ మిషన్ కంట్రోల్ బృందాలకు శిక్షణ ఇస్తారు. మైక్రోగ్రావిటీ అప్లికేషన్లు, అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధికి సీఎన్‌ఈఎస్ సహకరిస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో సీఎన్‌ఈఎస్ అభివృద్ధి చేసిన వ్యవస్థను భారత వ్యోమగాములు ఉపయోగించుకోవచ్చు. భారత వ్యోమగాములకు ఫైర్ ప్రూఫ్ క్యారీ బ్యాగ్‌లను కూడా సీఎన్‌ఈఎస్ సమకూరుస్తుంది. రోదసీయానంలో వ్యోమగాముల ఆరోగ్యం ఫ్లైట్ ఫిజీషియన్లు లేదా సర్జన్ల బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment