సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్), ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆధ్వర్యంలో రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలను నిర్వహించనున్నారు. 2024–25 ఆర్థిక ఏడాదిని గగన్‌యాన్ సంవత్సరంగా ప్రకటించి 7 గగన్‌యాన్ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. అలాగే, స్కైరూట్ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన విక్రమ్–1టీబీడీ పేరుతో 4 ప్రయోగాలు, అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన అగ్నిబాన్–టీబీడీ పేరుతో 3 ప్రయోగాలు చేయనున్నారు.
ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 8 ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే ఈ ఏడాది జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ సీ57 ప్రయోగాన్ని పూర్తి చేశారు. వీటి తరువాత పీఎస్‌ఎల్‌వీ సీ58, సీ59, సీ61, సీ62, సీ63, పీఎస్‌ఎల్‌వీ ఎన్1, ఎన్2 పేరుతో 8 ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఈ నెల 17న జీఎ‹Üఎల్‌వీ ఎఫ్14, తరువాత ఎఫ్15, ఎఫ్16, ఎఫ్17 ప్రయోగాలను చేయడానికి సంసిద్ధమవుతున్నారు. ఎ‹Üఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో డీ3, ఎస్1, ఎస్2 పేరుతో 3 ప్రయోగాలు, ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా ఒక ప్రయోగంతో కలిసి ఈ ఏడాదిలో 30 ప్రయోగాలు చేయనున్నారు.
కాబట్టి ఈ ఏడాదిని ‘స్పేస్ రిఫార్మ్ ఇయర్’గా ఇస్రో ప్రకటించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో భాగంగా మార్చిలోపు అగ్నిబాన్, ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగాలు చేయనున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి దాకా 26 ప్రయోగాలు చేయడానికి ఇస్రో ప్రణాళిక రచించింది. ఈ ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన 7 ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే 2025 ఆఖరికి మానవుడిని అంతరిక్షంలోకి పంపించి క్షేమంగా భూమికి తీసుకువచ్చేందుకు ఇస్రోసమాయత్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment