సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిని గగన్‌యాన్ ప్రాజెక్టు సంవత్సరంగా పరిగణిస్తోందని, మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని సతీశ్‌ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. శుక్రవారం షార్‌లో 75వ గణతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 నాటికి మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చంద్రయాన్–3, ఆదిత్య ఎల్–1 ప్రయోగాలతో 2023 ఇస్రో చరిత్రలో గుర్తుండిపోతుందన్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌కు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం ఇస్రోకు గిఫ్ట్ అని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌డే ఉత్సవాల్లో చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని పంపిన ఎల్‌వీఎం మార్క్–3 రాకెట్, ల్యాండర్, రోవర్‌ను ప్రదర్శించడం అభినందనీయ మన్నారు. కొత్త ఏడాదికి కానుకగా పీఎస్‌ఎల్‌వీ సీ58 ప్రయోగం నిర్వహించామని తెలిపారు.
ఫిబ్రవరి రెండోవారంలో ఇన్‌శాట్–3 డీఎస్ ప్రయోగం నిర్వహించనున్నామని, ఈ ఏడాది మరో పది ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. విద్యార్థులంతా స్పేస్ సైన్స్‌పై అవగాహన పెంచుకుని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో సామాన్యులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని, సైన్యానికి విలువైన సమాచారాన్ని అందజేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో ఈ ఏడాది నుంచి వాణిజ్యపరంగానే కాకుండా ప్రైవేట్ స్పేస్ సంస్థలకు చెందిన ప్రయోగాలూ చేపడుతుందని రాజరాజన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment