
వాషింగ్టన్: చైనాకు చెందిన కనీసం నాలుగు మొబైల్ కంపెనీలతో ఫేస్‌బుక్‌కు సమాచార మార్పిడి ఒప్పందం ఉందని అమెరికా మీడియాలో కథనం వెలువడింది. అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా నిఘా వర్గాలు పేర్కొన్న హువాయ్ కంపెనీ కూడా అందులో ఉన్నట్లు తెలిసింది. అమెరికా సంస్థ బ్లాక్‌బెర్రీతో సమాచారం పంచుకోవడానికి ఉన్న ఒప్పందం లాంటిదే చైనా కంపెనీలతోనూ కుదుర్చుకున్నామని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. చైనా కంపెనీలతో ఒప్పందాలు 2010లో కుదుర్చుకున్నామని, హువాయ్‌తో ఒప్పందం ఈ వారంతోనే ముగుస్తుందని వివరణ ఇచ్చింది. ఫేస్‌బుక్‌తో ఒప్పందం వల్ల హువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్ లాంటి చైనా కంపెనీలు కొందరు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పొందేందుకు వీలవుతుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. చైనా కంపెనీలతో ఫేస్‌బుక్ ఒప్పందాలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment