Mobile Companies
-
ఇక కొత్త ఫోన్‌తో చార్జర్ రాదు
న్యూఢిల్లీ: గతంలో మొబైల్ కొంటే దాంతో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ వచ్చేవి. కాలక్రమేణా ఇయర్ ఫోన్స్ ఫోన్ తో పాటు రావడం ఆగిపోయింది. రానున్న రోజుల్లో చార్జర్ ను తొలగించి ఖర్చులను తగ్గించుకోవాలని ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ ఫోన్ తయారీ దారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తయారీదారులకు చార్జర్ తయరీ ఖర్చులతో పాటు ఫోన్ ప్యాకేజింగ్ లో అయ్యే అదనపు ఖర్చు కూడా మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై శాంసంగ్, యాపిల్ తయారీదారుల నుంచి అధికారిక సమాచారం ఏదీ రాలేదు. త్వరలో రానున్న ఐఫోన్ 12లో ఇయర్ ఫోన్స్ తో పాటు, చార్జర్ కూడా రాదని యాపిల్ ఎనలిస్ట్ మింగ్ చుకో అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫోన్లన్నీ దాదాపు టైప్ సీ పోర్టుతో వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో ఒకే తరహా చార్జర్ అందుబాటులోకి వస్తుందని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అంతేగాక వైర్ లెస్ చార్జింగ్ సదుపాయంతో వస్తున్న ఫోన్లకు అసలు చార్జర్ అవసరమే ఉండదు. -
స్మార్ట్‌ఫోన్‌కు ‘కరోనా’ ముప్పు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కట్టడి కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోనుంది. ఇది సుమారు 2 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్‌లో విక్రయాలు గణనీయంగా మందగించడం ఇందుకు కారణంగా ఉంటుందని పేర్కొంది. మార్చి మధ్య దాకా కరోనా మహమ్మారి ప్రభావం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత విజృంభిస్తుండటంతో లాక్డౌన్ అనివార్యమైందని వివరించింది. దీని ఫలితంగా 2020లో స్మార్ట్ఫోన్ల విక్రయం గతేడాది నమోదైన 15.8 కోట్లతో పోలిస్తే 3 శాతం తగ్గి 15.3 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మార్చిలో 27 శాతం తగ్గనుండగా, ఏప్రిల్ 14 దాకా లాక్డౌన్ కొనసాగితే ఈ నెలలో దాదాపు 60 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారికి మూలకేంద్రమైన చైనా నుంచి విడిభాగాల సరఫరా దెబ్బతినడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి. లాక్డౌన్ పెంచితే మరింతగా నష్టాలు.. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగించిన పక్షంలో నష్టాలు మరింత పెరగవచ్చని పాఠక్ చెప్పారు. మొత్తం సరఫరా వ్యవస్థ, ఆదాయాలు, చెల్లింపులు మొదలైనవన్నీ దెబ్బతినడమే ఇందుకు కారణమన్నారు. పైపెచ్చు వినియోగదారులు ఎక్కువగా పొదుపునకు ప్రాధాన్యమిచ్చి, కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం వల్ల డిమాండ్ పడిపోవచ్చని పాఠక్ వివరించారు. భారత్‌ను ఎగుమతుల హబ్‌గా చేసుకున్న ఫ్యాక్టరీలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే, పరిస్థితి మెరుగైతే ఉత్పత్తిని వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఫ్యాక్టరీలు.. ఉద్యోగాల్లో కోతలు విధించడానికి మొగ్గు చూపకపోవచ్చన్నారు. పండుగల సీజన్ దాకా ఇంతే.. ఈ ఏడాది ద్వితీయార్థానికి గానీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఉండకపోవచ్చని పాఠక్ చెప్పారు. ‘ఈ ఏడాది మధ్య నాటికి పరిస్థితి మెరుగుపడినా కూడా.. పండుగల సీజన్ దాకా వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి సాధారణ స్థాయికి తిరిగొస్తే .. ఆన్లైన్ విక్రయాలూ మెరుగుపడొచ్చన్నారు. ఆఫ్‌లైన్ విక్రేతలకు ఆకర్షణీయ ఆఫర్లివ్వడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ స్టాక్స్ సత్వరం అందుబాటులో ఉంచేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తాయని చెప్పారు. -
చైనా కంపెనీలకు ఫేస్బుక్ సమాచారం
వాషింగ్టన్: చైనాకు చెందిన కనీసం నాలుగు మొబైల్ కంపెనీలతో ఫేస్‌బుక్‌కు సమాచార మార్పిడి ఒప్పందం ఉందని అమెరికా మీడియాలో కథనం వెలువడింది. అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా నిఘా వర్గాలు పేర్కొన్న హువాయ్ కంపెనీ కూడా అందులో ఉన్నట్లు తెలిసింది. అమెరికా సంస్థ బ్లాక్‌బెర్రీతో సమాచారం పంచుకోవడానికి ఉన్న ఒప్పందం లాంటిదే చైనా కంపెనీలతోనూ కుదుర్చుకున్నామని ఫేస్బుక్ స్పష్టం చేసింది. చైనా కంపెనీలతో ఒప్పందాలు 2010లో కుదుర్చుకున్నామని, హువాయ్‌తో ఒప్పందం ఈ వారంతోనే ముగుస్తుందని వివరణ ఇచ్చింది. ఫేస్‌బుక్‌తో ఒప్పందం వల్ల హువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్ లాంటి చైనా కంపెనీలు కొందరు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పొందేందుకు వీలవుతుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. చైనా కంపెనీలతో ఫేస్బుక్ ఒప్పందాలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. -
‘95 మొబైల్ కంపెనీలను తీసుకొచ్చాం’
సాక్షి, న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 95 మొబైల్ తయారీ కంపెనీలు దేశంలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి భారత్ హబ్‌గా మారుతున్నదని అన్నారు. భారత్‌కు వచ్చిన మొబైల్ తయారీ ప్లాంట్ల్లో 32 ప్లాంట్లు నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో ఏర్పాటయ్యాయని తెలిపారు. సిలికాన్‌వ్యాలీలో జరిగే ఐటీ నూతన ఆవిష్కరణల్లో 14 శాతం భారత్‌కు చెందిన వారి మేథోశక్తి ఫలితమేనని అన్నారు. ఐఐటీల్లో చదివి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉద్యోగాలను వదిలి దేశానికి తిరిగివస్తున్నారని, వారు స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు.న్యాయ ప్రక్రియ వేగవంతానికి డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. -
కాల్ డ్రాప్ నిబంధనలను పాటించండి
టెల్కోలకు ట్రాయ్ లేఖలు * కోర్టు ఆదేశాలు వస్తేనే పరిహారం చెల్లిస్తామంటున్న టెల్కోలు న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కాల్‌డ్రాప్ విషయంలో మరోసారి కొరడా ఝుళిపించింది. కాల్‌డ్రాప్ నిబంధనలను ఈ నెల 1 నుంచి అమలు చేయాలని మొబైల్ ఆపరేటర్లకు రాసిన లేఖల్లో ఆదేశించింది. కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతనే తాము వినియోగదారులకు నష్టపరిహారం చెల్లిస్తామంటూ టెలికం సంస్థలు పేర్కొన్నప్పటికీ, ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాల్‌డ్రాప్‌కు రూ.1 పరిహారం... వినియోగదారులు కాల్ చేసినప్పుడు, ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్‌లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ. 1 చొప్పున, రోజుకు రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని నిబంధనలను ట్రాయ్ రూపొందించింది. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా పలు మొబైల్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశం కోర్టు విచారణలో ఉన్నదని, కోర్టు ఆదేశాలిస్తే పరిహారం చెల్లిస్తామని అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి అశోక్ సూద్ తెలిపారు. -
మొబైల్స్ విడుదలకు బ్రేకులు!
- ఈ నెల 13 నుంచి బీఐఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి - అనుమతికి వందల మోడళ్ల ఎదురుచూపు ల్యాబ్‌ల కొరతతో అనుమతులకు జాప్యం - కొన్నాళ్లపాటు తేదీని వాయిదా వేయాలంటున్న కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజుకు సగటున మూడు నాలుగు సెల్ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తున్న మొబైల్ కంపెనీలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇకపై మొబైల్ ఫోన్లతో పాటు చార్జర్లు, బ్యాటరీలకు సైతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాం డర్డ్స్ (బీఐఎస్) ధ్రువీకరణ తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ఈ నిబంధన అమల్లోకి రాబోతోంది కూడా. నిజానికి కంపెనీలకు ఈ నిబంధనను పాటించడానికి ఇబ్బందులేమీ లేవు, ఎందుకంటే ప్రముఖ కంపెనీలన్నీ ఇపుడు వాటి ఉత్పత్తులను బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగానే రూపొందిస్తున్నాయి. కాకపోతే అనుమతి అనేసరికే వీటికి ఎటూ పాలుపోవటం లేదు. కారణం ఇపుడు బీఐఎస్‌కు వీటిని పరీక్షించి అనుమతివ్వగలిగే సామర్థ్యం ఉన్న ల్యాబొరేటరీలు ఎనమిది మాత్రమే ఉన్నాయి. కుప్పలుతెప్పలుగా వస్తున్న కొత్త మొబైల్స్, చార్జర్లు, బ్యాటరీలను ఇవి తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే ఈ ఎనిమిదింటితో అయ్యే పని కాదు. ఇప్పటికే దాదాపు 1,500లకు పైగా మోడళ్ల దరఖాస్తులు బీఐఎస్ వద్ద పెండింగ్‌లో ఉండటం గమనార్హం. కంపెనీల హోరాహోరీ.. ప్రస్తుతం ఇండియాలో మొబైల్ శకం నడుస్తోంది. కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. విదేశీ దిగ్గజాలతో పాటు దేశీయంగా అసెంబ్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని స్థానిక కంపెనీలు సైతం నువ్వానేనా అన్నట్లుగానే పోటీ ఇస్తున్నాయి. 2014లో సగటున రోజుకు 3 మోడళ్లను విడుదల చేసిన ఈ కంపెనీలు... ఇప్పుడు కూడా ఒకదాన్ని మించి ఒకటి కొత్త కొత్త ఫీచర్లతో, ఆకట్టుకునే ధరలతో అత్యాధునిక మోడళ్లను తెస్తున్నాయి. ఇలాంటి పోటీలో కొత్త మోడళ్ల ప్రవేశం గనక ఏ కొంచెం ఆలస్యమైనా అవి వెనకబడిపోతాయి. అందుకే కంపెనీలు ఇప్పటికే తమ మోడళ్లను బీఐఎస్ ధ్రువీకరణ కోసం పంపిం చాయి. 2014లో దేశంలో 95 బ్రాండ్లు 1,135 మోడళ్లను విడుదల చేశాయి. వీటిలో 691 స్మార్ట్ఫోన్లున్నాయి. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారత్‌ది ప్రస్తుతం 3వ స్థానం. మేం సిద్ధమే... కానీ! నాణ్యత ప్రమాణాలు పరిశ్రమకు అవసరమని శాంసంగ్ ఐటీ, మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వినియోగదారుకు నాణ్యమైన సరుకు అందుతుందన్నారు. ఇదే విషయాన్ని సెల్కాన్ సీఎండీ వై.గురు ప్రస్తావిస్తూ... ‘‘ప్రధాన బ్రాండ్లు ఇప్పటికే తమ మోడళ్లను బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాయి. ధ్రువీకరణ విధానంతో నకిలీలను అడ్డుకోవచ్చు కూడా. కానీ ల్యాబ్‌లు విరివిగా ఏర్పాటు చేసేవరకూ అమలు తేదీని వాయిదా వేస్తే బాగుంటుందని సెల్యులర్ పరిశ్రమ భావిస్తోంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఒకే ల్యాబ్‌లో కాకుండా హ్యాండ్సెట్లకు, బ్యాటరీలకు, చార్జర్లకు వేర్వేరుగా ధ్రువీకరణ తీసుకోవాల్సి వస్తోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు సంబంధించి 8 ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయని మరో కంపెనీ ప్రతినిధి తెలిపారు. ధ్రువీకరణ విషయంలో తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ‘‘ల్యాబ్‌లు సరిపడినన్ని లేవు. ల్యాబ్‌లు విరివిగా ఏర్పాటయ్యే వరకు ధ్రువీకరణ అమలు తేదీని వాయిదా వేయాల్సిందిగా సెల్యులార్ అసోసియేషన్ తరఫున కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు వినతి పత్రం ఇచ్చాం’’ అని ఆయన వెల్లడించారు. నిలిచిన వేలాది మోడళ్లు.. బీఐఎస్ ల్యాబ్‌ల వద్ద వేల మోడళ్లు నిలిచిపోవటంతో కొత్త మోడళ్లు మరింత ఆలస్యం కానున్నాయి. ఒక్కో మోడల్ ధ్రువీకరణకు ఎంత కాదన్నా 60 రోజుల సమయం పడుతోందని ఉత్తరాదికి చెందిన ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం తమ కంపెనీకి చెందిన 30 మోడళ్లు వివిధ ల్యాబ్‌ల వద్ద నిలిచిపోయాయన్నారు. తమ అంచనా ప్రకారం ల్యాబ్‌ల వద్ద అన్ని కంపెనీలవి 1,500లకుపైగా మోడళ్లు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. బ్యాటరీల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు 2 మాత్రమే ఉన్నాయని సెల్కాన్ ఈడీ మురళి, రేతి నేని చెప్పారు. కంపెనీలకు ఇది ఇబ్బందికర పరిణామమన్నారు. ‘దరఖాస్తులు ఎన్ని వస్తాయో బీఐఎస్ అంచనా వేయలేదు. ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యం సరిపోదు. అయితే ఎక్కడో ఒక దగ్గర ఫుల్స్టాప్ పడాలి. అమలు తేదీని వాయిదా వేయడం ఒక్కటే పరిష్కారం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పదు’ అని ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీల సమాఖ్య ఎంఏఐటీ ఈడీ అన్వర్ శిర్పూర్వాలా తెలిపారు.