మొబైల్స్ విడుదలకు బ్రేకులు!
- ఈ నెల 13 నుంచి బీఐఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- అనుమతికి వందల మోడళ్ల ఎదురుచూపు ల్యాబ్‌ల కొరతతో అనుమతులకు జాప్యం
- కొన్నాళ్లపాటు తేదీని వాయిదా వేయాలంటున్న కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజుకు సగటున మూడు నాలుగు సెల్‌ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తున్న మొబైల్ కంపెనీలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇకపై మొబైల్ ఫోన్లతో పాటు చార్జర్లు, బ్యాటరీలకు సైతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాం డర్డ్స్ (బీఐఎస్) ధ్రువీకరణ తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ఈ నిబంధన అమల్లోకి రాబోతోంది కూడా.
నిజానికి కంపెనీలకు ఈ నిబంధనను పాటించడానికి ఇబ్బందులేమీ లేవు, ఎందుకంటే ప్రముఖ కంపెనీలన్నీ ఇపుడు వాటి ఉత్పత్తులను బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగానే రూపొందిస్తున్నాయి. కాకపోతే అనుమతి అనేసరికే వీటికి ఎటూ పాలుపోవటం లేదు. కారణం ఇపుడు బీఐఎస్‌కు వీటిని పరీక్షించి అనుమతివ్వగలిగే సామర్థ్యం ఉన్న ల్యాబొరేటరీలు ఎనమిది మాత్రమే ఉన్నాయి. కుప్పలుతెప్పలుగా వస్తున్న కొత్త మొబైల్స్, చార్జర్లు, బ్యాటరీలను ఇవి తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే ఈ ఎనిమిదింటితో అయ్యే పని కాదు. ఇప్పటికే దాదాపు 1,500లకు పైగా మోడళ్ల దరఖాస్తులు బీఐఎస్ వద్ద పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
కంపెనీల హోరాహోరీ..
ప్రస్తుతం ఇండియాలో మొబైల్ శకం నడుస్తోంది. కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. విదేశీ దిగ్గజాలతో పాటు దేశీయంగా అసెంబ్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని స్థానిక కంపెనీలు సైతం నువ్వానేనా అన్నట్లుగానే పోటీ ఇస్తున్నాయి. 2014లో సగటున రోజుకు 3 మోడళ్లను విడుదల చేసిన ఈ కంపెనీలు... ఇప్పుడు కూడా ఒకదాన్ని మించి ఒకటి కొత్త కొత్త ఫీచర్లతో, ఆకట్టుకునే ధరలతో అత్యాధునిక మోడళ్లను తెస్తున్నాయి. ఇలాంటి పోటీలో కొత్త మోడళ్ల ప్రవేశం గనక ఏ కొంచెం ఆలస్యమైనా అవి వెనకబడిపోతాయి. అందుకే కంపెనీలు ఇప్పటికే తమ మోడళ్లను బీఐఎస్ ధ్రువీకరణ కోసం పంపిం చాయి. 2014లో దేశంలో 95 బ్రాండ్లు 1,135 మోడళ్లను విడుదల చేశాయి. వీటిలో 691 స్మార్ట్‌ఫోన్లున్నాయి. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారత్‌ది ప్రస్తుతం 3వ స్థానం.
మేం సిద్ధమే... కానీ!
నాణ్యత ప్రమాణాలు పరిశ్రమకు అవసరమని శాంసంగ్ ఐటీ, మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వినియోగదారుకు నాణ్యమైన సరుకు అందుతుందన్నారు. ఇదే విషయాన్ని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ప్రస్తావిస్తూ... ‘‘ప్రధాన బ్రాండ్లు ఇప్పటికే తమ మోడళ్లను బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాయి. ధ్రువీకరణ విధానంతో నకిలీలను అడ్డుకోవచ్చు కూడా. కానీ ల్యాబ్‌లు విరివిగా ఏర్పాటు చేసేవరకూ అమలు తేదీని వాయిదా వేస్తే బాగుంటుందని సెల్యులర్ పరిశ్రమ భావిస్తోంది’’ అని చెప్పారు.
ప్రస్తుతం ఒకే ల్యాబ్‌లో కాకుండా హ్యాండ్‌సెట్లకు, బ్యాటరీలకు, చార్జర్లకు వేర్వేరుగా ధ్రువీకరణ తీసుకోవాల్సి వస్తోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు సంబంధించి 8 ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయని మరో కంపెనీ ప్రతినిధి తెలిపారు. ధ్రువీకరణ విషయంలో తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ‘‘ల్యాబ్‌లు సరిపడినన్ని లేవు. ల్యాబ్‌లు విరివిగా ఏర్పాటయ్యే వరకు ధ్రువీకరణ అమలు తేదీని వాయిదా వేయాల్సిందిగా సెల్యులార్ అసోసియేషన్ తరఫున కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు వినతి పత్రం ఇచ్చాం’’ అని ఆయన వెల్లడించారు.
నిలిచిన వేలాది మోడళ్లు..
బీఐఎస్ ల్యాబ్‌ల వద్ద వేల మోడళ్లు నిలిచిపోవటంతో కొత్త మోడళ్లు మరింత ఆలస్యం కానున్నాయి. ఒక్కో మోడల్ ధ్రువీకరణకు ఎంత కాదన్నా 60 రోజుల సమయం పడుతోందని ఉత్తరాదికి చెందిన ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం తమ కంపెనీకి చెందిన 30 మోడళ్లు వివిధ ల్యాబ్‌ల వద్ద నిలిచిపోయాయన్నారు.
తమ అంచనా ప్రకారం ల్యాబ్‌ల వద్ద అన్ని కంపెనీలవి 1,500లకుపైగా మోడళ్లు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. బ్యాటరీల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు 2 మాత్రమే ఉన్నాయని సెల్‌కాన్ ఈడీ మురళి, రేతి నేని చెప్పారు. కంపెనీలకు ఇది ఇబ్బందికర పరిణామమన్నారు. ‘దరఖాస్తులు ఎన్ని వస్తాయో బీఐఎస్ అంచనా వేయలేదు. ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యం సరిపోదు. అయితే ఎక్కడో ఒక దగ్గర ఫుల్‌స్టాప్ పడాలి. అమలు తేదీని వాయిదా వేయడం ఒక్కటే పరిష్కారం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పదు’ అని ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీల సమాఖ్య ఎంఏఐటీ ఈడీ అన్వర్ శిర్‌పూర్‌వాలా తెలిపారు.