కాల్ డ్రాప్ నిబంధనలను పాటించండి
టెల్కోలకు ట్రాయ్ లేఖలు
* కోర్టు ఆదేశాలు వస్తేనే పరిహారం చెల్లిస్తామంటున్న టెల్కోలు
న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కాల్‌డ్రాప్ విషయంలో మరోసారి కొరడా ఝుళిపించింది. కాల్‌డ్రాప్ నిబంధనలను ఈ నెల 1 నుంచి అమలు చేయాలని మొబైల్ ఆపరేటర్లకు రాసిన లేఖల్లో ఆదేశించింది. కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతనే తాము వినియోగదారులకు నష్టపరిహారం చెల్లిస్తామంటూ టెలికం సంస్థలు పేర్కొన్నప్పటికీ, ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
కాల్‌డ్రాప్‌కు రూ.1 పరిహారం...
వినియోగదారులు కాల్ చేసినప్పుడు, ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్‌లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ. 1 చొప్పున, రోజుకు రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని నిబంధనలను ట్రాయ్ రూపొందించింది.
ఈ నిబంధనలకు వ్యతిరేకంగా పలు మొబైల్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశం కోర్టు విచారణలో ఉన్నదని, కోర్టు ఆదేశాలిస్తే పరిహారం చెల్లిస్తామని అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి అశోక్ సూద్ తెలిపారు.