ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి పరిహారం
ముంబై: సెల్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. 'కాల్ డ్రాప్స్'కు పరిహారం చెల్లించాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి చొప్పున చెల్లించాలని.. ఇది 2016, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రోజులో మూడుసార్లు మాత్రమే ఈ పరిహారం అందుతుందని తెలిపింది.
ఫోన్ లో మాట్లాడుతుండగా మధ్యలో కట్ అయితే నాలుగు గంటల్లోగా పరిహారం అందించాలని సూచించింది. పరిహారం అందించిన విషయాన్ని వినియోగదారుడి ఎస్ఎంఎస్ లేదా యూఎస్ఎస్డీ ద్వారా వినియోగదారులకు తెలపాలని ఆదేశించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు తర్వాత నెల బిల్లులో వివరాలు పేర్కొనాలని సలహాయిచ్చింది.
తాము వెలువరించిన ఆదేశాలను టెలికం ఆపరేటర్లు ఏమేరకు పాటిస్తున్నారనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుంటామని తెలిపింది. కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం అయ్యేందుకు సర్వీసు ప్రొవైడర్లు ప్రయత్నించాలని సూచించింది. దీనిపై ఆరునెలల తర్వాత సమీక్ష నిర్వహిస్తామని ట్రాయ్ తెలిపింది.