న్యూఢిల్లీ: అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం.. అన్నీ కలిసి టెలికం పరిశ్రమను కోలుకోలేనంతగా కుదేలెత్తిస్తున్నాయని టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తక్షణమే జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. ఇటు పెట్టుబడులు అటు వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, రెండింటి మధ్య సమతౌల్యం ఉండేలా ట్రాయ్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బడ్జెట్ ముందరి సమావేశాల్లో భాగంగా ఇతర కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సందర్భంగా సునీల్ మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, టెలికం కంపెనీల ఏఆర్‌పీయూ (యూజరుపై సగటు ఆదాయం) క్రమంగా రూ.200 నుంచి రూ.300 దాకా చేరొచ్చని చెప్పారాయన. ‘డేటా, వాయిస్, ఇతర సర్వీసులకు కలిపి నెలకు ఒకో యూజరు కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.450–500 దాకా చెల్లించవచ్చని అంచనా. వీటి సగటు సుమారు రూ.300 దాకా ఉండవచ్చు. డాలర్ రూపంలో నెలకు 4 డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత చౌక టారిఫ్‌లు ఇవే. డేటా వినియోగం మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే రెండు, మూడు రెట్లు ఎక్కువే‘ అని మిట్టల్ పేర్కొన్నారు. ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీలను (ఐయూసీ) ట్రాయ్ ఏడాది పాటు వాయిదా వేయడం, టెలికం సేవలకు కనీస చార్జీలను నిర్ణయించే అంశంపై దృష్టి సారించడం తదితర అంశాల నేపథ్యంలో సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కర్ణాటకలో 3జీ సేవలకు ఎయిర్‌టెల్ గుడ్‌బై
ఎయిర్‌టెల్ క్రమంగా 3జీ సేవలను ఉపసంహరిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కర్ణాటకలో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేసినట్లు కంపెనీ గురువారం తెలిపింది. ఇకపై అక్కడ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను.. హై స్పీడ్ 4జీ నెట్‌వర్క్‌పై అందిస్తామని తెలిపింది. ఫీచర్ ఫోన్ల వినియోగదారుల కోసం 2జీ సేవలు యథాప్రకారం కొనసాగించనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment