న్యూఢిల్లీ: చాలా కాలం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి ఊరట కలిగించే కీలకమైన ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ వంటి టెలికామ్ కంపెనీలకు భారీ ఊరట కలగనుంది. టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరట కలిగించేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నేడు జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది.
కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను టెలికామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ రంగంలో ఒత్తిడికి ఏజీఆర్ బకాయిలు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏజీఆర్ అనేది చట్టబద్ధమైన బకాయిలచెల్లింపు కొరకు పరిగణించబడే ఆదాయాలను తెలియజేస్తుంది అని అన్నారు. లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జీలు, అన్ని రకాల ఛార్జీల చెల్లింపు విషయాలపై నేడు హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు.(చదవండి: జెట్ ఎయిర్‌వేస్: టేకాఫ్‌కు సిద్ధం!)
భవిష్యత్ వేలంలో స్పెక్ట్రం కాలవ్యవధి 20 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలు చేయనున్నట్లు తెలిపారు. టెలికాంలో 100 శాతం ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. అలాగే ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కూడా ఉందని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. టెలికాం రంగంలో ఆటగాళ్ళ మధ్య ఆరోగ్యకరమైన పోటీని నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment