న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్
‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు.
ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి.
తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది.
► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి.
► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు.
► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు.
► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్‌లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే
ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు.
ఉభయతారకంగా సంస్కరణలు..
ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్‌ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది.
– నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం..
ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు
– ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్
ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు..
పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్‌టెల్ సిద్ధం.
– సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్‌టెల్
ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం..
పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి.
– కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్
ఎగుమతులకు జోష్...
సవరించిన పీఎల్‌ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది.
–విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్
పరిశ్రమకు దన్ను..
తాజాగా సవరించిన పీఎల్‌ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది.
–వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్
ఇవి అత్యధిక నిధులు..
ప్రభుత్వం ప్రకటించిన పీఎల్‌ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.
–కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్
Comments
Please login to add a commentAdd a comment