service providers
-
Telecom Bill 2023: టెలికం సేవలపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ: జాతి భద్రత దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలి్పంచే కీలకమైన టెలికమ్యూనికేషన్స్ బిల్లు–2023ను గురువారం పార్లమెంట్ ఆమోదించింది. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా గ్లోబల్ సర్విస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలున్నాయి. టెలికమ్యూనికేషన్స్ బిల్లు– 2023ను లోక్‌సభ బుధవారమే ఆమోదించగా గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. బిల్లును టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు. టెలికం బిల్లు ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ తావిచ్చేలా ఉందంటూ పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలపై మంత్రి బదులిస్తూ.. వలస పాలన కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. ‘టెలికం రంగంలో ఎంతో క్లిష్టమైన నిబంధనలతో కూడిన 100కు పైగా రకాల లైసెన్సులున్నాయి. ఈ బిల్లులో వీటన్నిటినీ తొలగించి, ఒకే ఒక అధికార వ్యవస్థ కిందికి తెచ్చాం. స్పెక్ట్రమ్ కేటాయింపులు పారదర్శకంగా ఉండేందుకు పలు చర్యలు ప్రతిపాదించాం. ఒకటో షెడ్యూల్లోని ఏవో కొన్ని ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే స్పెక్ట్రమ్ కేటాయింపులన్నీ ఇకపై వేలం ద్వారానే జరుగుతాయి’అని మంత్రి వివరించారు. ‘బిల్లులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. జాతి భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం టెలికం సేవలను తాత్కాలికంగా అధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. తాజాగా దీనిని మరింత బలోపేతం చేశాం. కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధి దేశంలో టెలికం రంగ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది’అని మంత్రి వివరించారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపం దాల్చనుంది. బిల్లు ముఖ్యాంశాలు.. ► శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులున్నాయని భావించినప్పుడు టెలికం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశా(మెసేజీ)లను రహస్యంగా వినొచ్చు, ప్రసారాలను నిలిపివేయవచ్చు. ► ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు దఖలు పడతాయి. ► పై పరిస్థితుల్లో కేంద్రం నేరుగా, లేదా కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రత్యేక అధికారికి టెలికం సర్వి సులను లేదా టెలికం నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకునే అధికారం సమకూరుతుంది. ► ఎవరైనా అనధికారి టెలికం నెట్‌వర్క్‌ను, పరికరాలను, రేడియోలను వినియోగిస్తున్నారని తేలితే ప్రభుత్వం ఏ భవనాన్ని లేదా విమానం, నౌక సహా ఎటువంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయొచ్చు, స్వా«దీనం చేసుకోవచ్చు. ► వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రమ్‌లను వేలం ద్వారానే కేటాయించాలన్న దేశీయ టెలికం సేవల సంస్థలు జియో, వొడాఫోన్ ఐడియా అభ్యర్థనలను తోసిపుచ్చుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రమ్‌లను కేటాయించేలా నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. ► పాలనా అనుమతుల ప్రకారం..స్పెక్ట్రమ్ కేటాయింపులను దేశంలో, అంతర్జాతీయంగా సుదూర శాటిలైట్ సర్వి సెస్, విశాట్..విమానయానం, సముద్రయానంతో అనుసంధానమయ్యే నెట్‌వర్క్‌లు, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలు పొందగలవు. ► ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు, కాల్స్ చేసుకోవడానికి వీలు కలి్పంచే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. వీటిని టెలికం చట్ట పరిధి నుంచి తొలగిస్తారు. ► ఓటీటీ(ఓవర్ ది టాప్) యాప్‌లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పరిధి నుంచి తొలగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. అనధికార ట్యాపింగ్‌లకు.. మూడేళ్ల జైలు, రూ.2 కోట్ల జరిమానా అక్రమంగా, అనుమతుల్లేకుండా ఫోన్ సందేశాలను రహస్యంగా విన్నా, ట్యాపింగ్‌కు పాల్పడినా భారీ జరిమానాతోపాటు కఠిన శిక్ష విధించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలకు, మిత్రదేశాలతో సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరచడం నేరంగా పరిగణిస్తారు. దోషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్ల వరకు జరిమానా, నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం ఉంది. నేరగాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెలికం సేవలను అందించే సంస్థలపైనా చర్యలుంటాయి. కాల్ డేటా, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడినా శిక్ష, జరిమానా తప్పదు. టెలికం నెట్‌వర్క్‌లకు, టెలీకం సదుపాయాలకు ఉద్దేశ పూర్వకంగా నష్టం కలిగించే వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాద నలున్నాయి. తప్పుడు ధ్రువ పత్రాలతో సిమ్.. రూ. 50 లక్షల జరిమానా, జైలు తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్ కార్డు పొందే వారికి రూ.50 లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్షకు ఈ బిల్లు వీలు కలి్పస్తోంది. ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులను వాడి ‘సిమ్‌బాక్స్’తో అక్రమాలకు పాల్పడే వారికి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇతరుల ఫోన్ నంబర్లను స్పూఫింగ్ చేస్తూ మోసాలకు పాల్పడే వారికి కూడా ఇవే శిక్షలుంటాయి. సిమ్ దురి్వనియోగాన్ని అడ్డుకట్ట వేయడంతోపాటు ఇతరులకు వివిధ మార్గాల్లో ఇబ్బంది కలిగించే కాలర్లపైనా చర్యలకు ఇందులో వీలుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేసుకుని, పరిష్కారం పొందేందుకు సైతం బిల్లులో ఏర్పాట్లున్నాయి. -
తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు
న్యూఢిల్లీ: వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తమ ప్రకటనలు ఉండకుండా చూసుకోవాలని తయారీ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనకర్తలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు కేంద్రం సూచించింది. ఇటు వ్యాపార, అటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని పేర్కొంది. ముంబైలో నిర్వహించిన అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు సూచనలు చేశారు. వినియోగదారులకు వెల్లడించాల్సిన కీలక వివరాలను (డిస్క్లోజర్లు) హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింకుల రూపంలో కాకుండా ప్రకటనల్లోనే ప్రముఖంగా కనిపించేలా జాగ్రత్తలు తీసు కోవాలని పేర్కొన్నారు. వీడియోల్లోనైతే డిస్క్లోజర్లను ఆడియో, వీడియో ఫార్మాట్లలో చూపాలని, లైవ్ స్ట్రీమ్‌లలోనైతే ప్రముఖంగా కనిపించేలా, నిరంతరాయంగా చూపాలని సింగ్ చెప్పారు. 50 కోట్ల మంది పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రకటనల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తమ విశ్వసనీయతపై ప్రభా వం చూపేలా ప్రకటనకర్తలతో తమకు ఏవైనా లావాదేవీలు ఉంటే ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వాటిని వెల్లడించాలని సింగ్ తెలిపారు. -
భయపడొద్దు.. సెల్ టవర్లు సురక్షితమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టెలికాం టవర్లు సురక్షితమేనని టెలీ కమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మొబైల్ ఫోన్లతో పాటు వాటి బేస్ స్టేషన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రం (ఈఎంఎఫ్)తో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై డీఓటీ స్పందించింది. రాష్ట్రంలోని వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీలు) ఏర్పాటు చేసిన 4,245 బేస్ ట్రాన్స్‌రిసీవర్ యూనిట్లను (టవర్లు) జూన్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 నడుమ పరీక్షించినట్లు డీఓటీ హైదరాబాద్ విభాగం వెల్లడించింది. వాటిలో ఒకటి మినహా మిగతా టవర్లన్నీ నిబంధనలకు లోబడే ఉన్నట్లు ప్రకటించింది. అపోహలు తొలగించేందుకు తరంగ్ సమాచార్ పేరిట ఓ వెబ్సైట్ ఏర్పాటు చేశామని, ఈఎంఎఫ్‌పై ఆన్లైన్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపింది.తెలంగాణ -
షాకింగ్: సగం ఏటీఎంలు మూత
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి సగానికి సగం ఏటీఎంలు మూత పడనున్నాయనే షాకింగ్ న్యూస్ సంచలనంగా మారింది. స్వయంగా ట్రీ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) బుధవారం (21 నవంబరు) నివేదించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.13 లక్షలఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం 2.38 లక్షల ఏటీఎంలు అందుబాటులో ఉండగా, అందులో సగానికి పైగా అంటే దాదాపు 1.13 లక్షల ఏటీఎంలు 2019 మార్చి కల్లా మూతపడే అవకాశాలున్నాయి. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లు ఒత్తిడి చేయనున్నారని పేర్కొంది. వీటిల్లో సుమారు లక్ష ఆఫ్ సైట్ ఎటిఎంలు, 15వేల వైట్ లేబుల్ ఏటీఎంలు ఉన్నాయని తెలిపింది. తాజా నియంత్రణలు, మార్పులు కారణంగా ఈ మూత తప్పకపోవచ్చని వెల్లడించింది. వీటిలో మెజారిటీ ఏటీఎంలు పట్టణేతర ప్రాంతాల్లో ఉండొచ్చని, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధిదారులు మెషీన్ల ద్వారా తీసుకునేందుకు వీలు కల్పించే చర్యలకు ఏటీఎంల మూత విఘాతం కావచ్చని తెలిపింది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పిఎంజెడివై) పథకం కింద మిలియన్లమంది లబ్దిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారని పేర్కొంది. ఇటీవల చేపట్టిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్, ఇతర నియంత్రణ చర్యల్లో మార్పులు, క్యాష్ లోడింగ్‌కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి వల్ల ఎటీఎం ఆపరేషన్లు ఆచరణ సాధ్యం కాకపోవచ్చని, ఫలితంగా ఏటీఎంలు మూతపడొచ్చని పేర్కొంది. సాంకేతిక పద్ధతుల్లో మార్పు, క్యాసెట్ క్యాష్ స్వాప్ విధానానికే కేవలం రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని సీఏటీఎంఐ అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితికి అదనపు సాంకేతిక పరిజ్ఞానం తోడై పరిస్థితి మరింత దిగజారవచ్చని, సర్వీస్ ప్రొవైడర్ల నెత్తిన మోయలేని భారం పడుతుందని తెలిపింది. ఇది ఏటీఏంల మూతకు దారితీస్తుందని సీఏటీఎంఐ ప్రకటించింది. ఏటీఎంల మూత కారణంగా వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని సీఏటీఎంఐ పేర్కొంది. అంతేకాదు నగదు కొరత వస్తే ఏటీఎంల దగ్గర భారీ క్యూలు, గందరగోళం తప్పదని కూడా వ్యాఖ్యానించింది. -
రేపటి నుంచి సినిమాల ప్రదర్శన బంద్
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(క్యూబ్, యూఎఫ్ఓ) వసూలు చేస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) తగ్గించనందుకు నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)’ స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రాందాస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్లోకి మారుతూ వచ్చింది. వీపీఎఫ్ నామమాత్రమే చెల్లించండి.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పిన క్యూబ్, యూఎఫ్ఓ యాజమాన్యాలు ఇప్పుడు మాట మారుస్తున్నాయి. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్నూ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ చిత్రవర్గాలు నిర్మాత డి.సురేశ్‌బాబు చైర్మన్‌గా, నిర్మాత కిరణ్ కన్వీనర్‌గా ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ని 25శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఫీజును 10 శాతం తగ్గిస్తామని వారు అంటే ఒప్పుకోలేదు. ఫిబ్రవరి 23న బెంగళూరులో మరో సమావేశం నిర్వహించగా, 9శాతం మాత్రమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే ఓ వ్యక్తి ‘ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ’ అని వ్యంగ్యంగా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయాడు. మా డిమాండ్లకు ఒప్పుకోకుంటే మార్చి 2నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని వారికి స్పష్టం చేశాం. మా నిర్ణయానికి సౌత్ ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా క్యూబ్, యూఎఫ్ఓ కంపెనీలు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు మా డిమాండ్లు ఒప్పుకుంటే సినిమాల ప్రదర్శన ఉంటుంది. వారు ఒప్పుకున్నా కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వెనకడుగు వేయం’’ అన్నారు. -
చర్చలు విఫలం
వారం వారం విడుదలయ్యే కొత్త చిత్రాల కోసం సినిమా లవర్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. అయితే మార్చి 2కి థియేటర్లలోకి కొత్త బొమ్మ వచ్చే అవకాశం కనిపించడంలేదు. థియేటర్లు మూతపడబోతున్నాయి. వినడానికి షాకింగ్‌గానే ఉంటుంది. ఎందుకీ పరిణామం అంటే.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్ఓ), నిర్మాతల మధ్య ధర విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ధర ఎక్కువగా ఉందని భావించిన నాలుగు (తెలుగు, తమిళ, కన్నడ, కేరళ) రాష్ట్రాల నిర్మాతలు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు. శుక్రవారం బెంగళూరులో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ జాయింట్ యాక్షన్ కమిటీ (తెలుగు, తమిళ, కేరళ, కర్నాటక) వారు డిజిటల్ ప్రొవైడర్స్‌తో మరో సమావేశం నిర్వహించారు. ఇçప్పుడు వసూలు చేస్తున్న మొత్తంలో 20 శాతం తగ్గిస్తే చాలన్నది నిర్మాతల విన్నపం అని తెలిసింది. గత సమావేశాల్లా ఈసారి కూడా చర్చలు విఫలం అయ్యాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు 9 శాతం మాత్రమే తగ్గించడానికి ముందుకు వచ్చారని సమాచారం. దాంతో మార్చి 2 నుంచి కొత్త చిత్రాల కంటెంట్ ఇవ్వకూడదనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారు. కంటెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా థియేటర్లు మూతపడతాయి. అది మాత్రమే కాదు.. అప్పటికే ఆడుతున్న సినిమాలను కూడా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఈ పరిస్థితి ఎందాకా వెళుతుందో వేచి చూడాలి. -
ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి పరిహారం
ముంబై: సెల్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. 'కాల్ డ్రాప్స్'కు పరిహారం చెల్లించాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి చొప్పున చెల్లించాలని.. ఇది 2016, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రోజులో మూడుసార్లు మాత్రమే ఈ పరిహారం అందుతుందని తెలిపింది. ఫోన్ లో మాట్లాడుతుండగా మధ్యలో కట్ అయితే నాలుగు గంటల్లోగా పరిహారం అందించాలని సూచించింది. పరిహారం అందించిన విషయాన్ని వినియోగదారుడి ఎస్ఎంఎస్ లేదా యూఎస్ఎస్డీ ద్వారా వినియోగదారులకు తెలపాలని ఆదేశించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు తర్వాత నెల బిల్లులో వివరాలు పేర్కొనాలని సలహాయిచ్చింది. తాము వెలువరించిన ఆదేశాలను టెలికం ఆపరేటర్లు ఏమేరకు పాటిస్తున్నారనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుంటామని తెలిపింది. కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం అయ్యేందుకు సర్వీసు ప్రొవైడర్లు ప్రయత్నించాలని సూచించింది. దీనిపై ఆరునెలల తర్వాత సమీక్ష నిర్వహిస్తామని ట్రాయ్ తెలిపింది. -
వాట్సప్‌తో జాగ్రత్త
ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. - ఫొటో అప్లోడ్పై అజాగ్రత్త వద్దు - నిబంధనలు తెలియని యాప్‌లు డౌన్లోడ్ చేయకండి - అపరిచితుల సందేహాలకు సమాధానం ఇవ్వొద్దు. - యాంటీ హ్యాకింగ్ సాప్ట్‌వేర్‌ను మొబైల్లో ఉంచుకోండి. - ఫ్యామిలీ పర్యటనల వివరాలు, లొకేషన్ షేరింగ్ చేయకండి. - పరిచయం, నమ్మకం లేని వ్యక్తులతో షేరింగ్ చేయవద్దు - పిల్లల ఫోటోలు వారి వివరాలను ఇతరులతో షేరింగ్ చేయడమూ ప్రమాదమే. - ఎక్కువ మంది లింక్ అయ్యారని అపరిచిత వ్యక్తులతో షేర్ ఇవ్వవద్దు. - ఎంత పరిచయం ఉన్న వారైనా వారిని మిత్రులుగా ఒప్పుకునే ముందు వారి జాబితాలో ఎవరున్నారు. ఎలాంటి వారున్నారు. అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి పటాన్చెరు : ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ఫోన్లే కనిపిస్తున్నాయి. వాట్సప్‌ల వినియోగం ఎక్కువైంది. వీటి వల్ల ప్రయోజనం ఎంతుందో ప్రమాదం కూడా అంతే ఉంది. వీటిని ఉపయోగించి నేరాలకు పాల్పడే వారి సంఖ్య చాలా పెరిగింది. సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సాయంతో పని చేసే తక్షణ సమాచార వ్యవస్థ వాట్సప్. వీటిలో వీడియోలు, మెసేజ్‌లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపుకునే సౌలభ్యం ఉండడంతో పాటు ఎటువంటి చార్జీలు లేకపోవడంతో అందరూ అధికంగా వాడుతున్నారు. రోజుకు వాట్స్‌ప్‌ల నుంచి కోట్లలో మేసేజ్‌లు, ఫొటోలు వెళ్తున్నట్లు సర్వేలలో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో వాట ్సప్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా జరిగితే.. మనం ఎక్కడో సరదాగా తీసుకున్న వ్యక్తిగత ఫొటోను స్నేహితుల కోసం షేర్ చేస్తే దానిని మన ప్రమేయం లేకుండా ఇతరులు చూసే ఆస్కారం ఉంది. ఆ ఫోటోను మార్ఫింగ్ చేసే ప్రమాదమూ లేకపోలేదు. అందుకు వాట్సప్‌లో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను స్నేహితులకు షేర్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే లొకేషన్ షేరింగ్ కూడా మన భద్రతకు ముప్పు తెస్తోందని, దీనివల్ల మనం ఎక్కడున్నామో అగంతకులకు ఇట్టే తెలిసిపోతుందని హెచ్చరిస్తున్నారు. డౌన్‌లోడ్‌లోనూ.. కాలపరిమితితో ఉచితంగా అందుబాటులోకి వచ్చిన గుగూల్ వాట్సప్, వైబర్, వీచాట్ వంటికి అనేకం అందుబాటులోకి వచ్చాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునే ముందు దాని ఆప్షన్లు నిబంధనలు పూర్తిగా చదివి అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. అలా కాకుండా ఆటోమెటిక్‌గా డౌన్లోడ్ అయ్యే యాప్ వల్ల మన ఫొటోలు మార్ఫింగ్ అయ్యే ప్రమాదముంది. -
వారంలో డేటా ఇవ్వండి
* ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్‌డేటా సమర్పణకు సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీంకోర్టు వారం గడువిచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి, సెల్యూలర్ ఆపరేటర్లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారాన్ని ఈ నెల 24లోపు ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. సీఓఏఐతోపాటు బీఎస్ఎన్ఎల్, ఐడియా తదితర సంస్థలు విడిగా వేసిన పిటిషన్లన్నీ జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ శివ కీర్తిసింగ్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. సర్వీసు ప్రొవైడర్ల తరఫు న్యాయవాది కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ‘ఏపీ, తెలంగాణల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నడుస్తోంది. వారి మధ్య సర్వీసు ప్రొవైడర్లు నలిగిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సర్వీసు ప్రొవైడర్లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు, ఏయే ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారో ఆయా వివరాలను ఇవ్వాలని ఆ దర్యాప్తు బృందం సర్వీసు ప్రొవైడర్లను కోరింది. ఆ డేటా ఇస్తే అధికార రహస్యాల చట్టం కింద న్యాయవిచారణ ఎదుర్కోవలసి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం సంబంధిత డేటా ఎవరికీ ఇవ్వరాదన్నది. విజయవాడ కోర్టు ఈ డేటా ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. రెండు ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు సర్వీసు ప్రొవైడర్లను వేధిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. అది చట్టబద్ధం కాని ట్యాపింగ్: ఏపీ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బసవ ప్రభుపాటిల్, పి.పి.రావు తమ వాదనలు వినిపిస్తూ ‘అక్కడ చట్టబద్ధం కాని ట్యాపింగ్ జరిగింది. దర్యాప్తులో భాగంగా అవసరమైన డాక్యుమెంట్లు, డేటాను సీల్డ్కవర్లో సమర్పిస్తే వచ్చే నష్టం ఏముంది?’ అని పేర్కొన్నారు. హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం.. రిట్ పిటిషన్లు ఉపసంహరణకు అవకాశం ఇస్తూ.. ‘విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టుకు సీల్డ్కవర్లో డేటాను ఇచ్చేందుకు మరో వారం గడువు ఇ స్తున్నాం. ఆ కోర్టు దానిని స్వీకరించిన త ర్వాత వారాల వరకు తెరవకూడదు. అ లాగే మొత్తం నాలుగు వారాల వరకు కోర్టు తన వి చారణను ఆపాలి’ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
'సుప్రీం'కు కాల్ డేటా వ్యవహారం
న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కాల్ డేటా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కాల్ డేటా వివరాలు అందజేయాలన్న విజయవాడ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఆదేశాలను సర్వీసు ప్రొవైడర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశముంది. ఓటుకు కోట్లు కేసులో కాల్ డేటా వివరాలు కీలకం కావడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కాల్ డేటా వివరాలు కోరుతూ సర్వీసు ప్రొవైడర్లకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులిచ్చి మరీ విచారణకు పిలిపించారు. కాల్ డేటా వివరాలు ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. -
‘ట్యాపింగ్’ వివరాలు ఇవ్వండి
ముగ్గురు సర్వీసు ప్రొవైడర్లకు బెజవాడ కోర్టు ఆదేశం * జూలై 1 వరకు గడువు * ఆదేశాల ప్రతులను హైదరాబాద్‌లోని కంపెనీలకు ఇవ్వనున్న సీఐడీ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారానికి కౌంటర్‌గా సీఐడీ చేపట్టిన జెరూసలేం మత్తయ్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాలను బుధవారం లోపు ఇవ్వాల్సిందిగా విజయవాడలోని 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కె.జయకుమార్ ముగ్గురు సర్వీస్ ప్రొవైడర్లను శుక్రవారం ఆదేశించారు. ఈ ఆదేశాలను సీఐడీ అధికారులు శనివారం హైదరాబాద్‌లోని ఆయా టెలికం సంస్థల ప్రధాన కార్యాలయాలకు అధికారికంగా అందజేయనున్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరుసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు న మోదైన కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీఐడీ చేపట్టిన విషయం విదితమే. సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదులో బెదిరింపులకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉన్నాయి. ఆయన స్థానిక మున్సిఫ్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలంలో అవినీతి, లంచానికి సంబంధించిన అంశాలతో పాటు ట్యాపింగ్ వ్యవహారాన్నీ ప్రస్తావించారు. అయితే ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న 88 కేసుల్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) నేరుగా సర్వీసు ప్రొవైడర్లను కొన్ని వివరాలు అడిగి భంగపడింది. దీంతో వ్యూహాత్మకంగా పావులు కదిపిన సీఐడీ అధికారులు ‘ట్యాపింగ్’కు సంబంధించిన వివరాలు అందించేలా సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించాలని కోరుతూ న్యాయస్థానంలో గత వారం మెమో దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు శుక్రవారం ఎయిర్టెల్, రిలయన్స్ సహా మరో సర్వీస్ ప్రొవైడర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మత్తయ్య, ఆయన సోదరుడు, బంధువులు వినియోగిస్తున్న 3 నంబర్లతో పాటు సెబాస్టియన్ (ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు) వినియోగిస్తున్న నంబర్‌ను నిర్ణీత కాలంలో ఎవరైనా ట్యాపింగ్ చేశారా? చేస్తే ఈ మేరకు సర్వీసు ప్రొవైడర్లకు అధికారిక లేఖ ఏ అధికారి నుంచి వచ్చింది? తదితర పూర్తి వివరాలను ఆధారాలతో సహా జూలై 1లోపు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. సీల్డ్ కవర్లో ఆయా కంపెనీల ప్రతినిధులే స్వయంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు అందించిన వివరాలను న్యాయస్థానం అనుమతితో తీసుకోవాలని సీఐడీ భావిస్తోంది. వాటిలోని అంశాల ఆధారంగా బాధ్యులకు నోటీసుల జారీ సహా ఇతర చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. -
సిట్ ఎదుట హాజరైంది ఒక్క ప్రొవైడరే..
విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీస్ ప్రొవైడర్ల విచారణ కొనసాగుతోంది. విజయవాడ భవనీపురం పోలీస్ స్టేషన్లో సోమవారం సిట్ బృందం ఎదుట ఒక సంస్థకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌పై నోటీసులు అందుకున్న ఎయిర్టెల్ ప్రతినిధులు మాత్రమే విచారణకు హాజరు కాగా, మిగిలిన 11మంది సర్వీస్ ప్రొవైడర్లు హాజరు కాలేదు. కాగా తెలంగాణలో తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని ఏపీ నేతలు ...ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పేరిట కౌంటర్ అటాక్‌కు దిగిన ఏపీ సర్కార్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే సంక్షోభాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ వాంగ్మూలం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు న్యాయపరిధి హైదరాబాద్‌లో ఉండగా, ట్యాపింగ్ కేసు విచారణ విజయవాడలో ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
సిట్ ముందుకు సర్వీస్ ప్రొవైడర్లు!
-
సర్వీస్ ప్రొవైడర్లను విచారించనున్న ఏపీ సీఐడీ
విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని 12మంది సెల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణలో తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంత్రి దేవినేని ఉమ ఇందుకు సంబంధించి భవనీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్వీస్ ప్రొవైడర్లను నోటీసులు జారీ చేశారు. 12మంది సర్వీస్ ప్రొవైడర్లను ఏపీ సీఐడీ విచారించనుంది.