గురువారం రాజ్యసభ కార్యకలాపాలు కొనసాగుతున్న దృశ్యం
న్యూఢిల్లీ: జాతి భద్రత దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలి్పంచే కీలకమైన టెలికమ్యూనికేషన్స్ బిల్లు–2023ను గురువారం పార్లమెంట్ ఆమోదించింది. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా గ్లోబల్ సర్విస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలున్నాయి.
టెలికమ్యూనికేషన్స్ బిల్లు– 2023ను లోక్‌సభ బుధవారమే ఆమోదించగా గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. బిల్లును టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు. టెలికం బిల్లు ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ తావిచ్చేలా ఉందంటూ పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలపై మంత్రి బదులిస్తూ.. వలస పాలన కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు.
‘టెలికం రంగంలో ఎంతో క్లిష్టమైన నిబంధనలతో కూడిన 100కు పైగా రకాల లైసెన్సులున్నాయి. ఈ బిల్లులో వీటన్నిటినీ తొలగించి, ఒకే ఒక అధికార వ్యవస్థ కిందికి తెచ్చాం. స్పెక్ట్రమ్ కేటాయింపులు పారదర్శకంగా ఉండేందుకు పలు చర్యలు ప్రతిపాదించాం. ఒకటో షెడ్యూల్‌లోని ఏవో కొన్ని ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే స్పెక్ట్రమ్ కేటాయింపులన్నీ ఇకపై వేలం ద్వారానే జరుగుతాయి’అని మంత్రి వివరించారు. ‘బిల్లులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి.
ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. జాతి భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం టెలికం సేవలను తాత్కాలికంగా అధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. తాజాగా దీనిని మరింత బలోపేతం చేశాం. కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధి దేశంలో టెలికం రంగ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది’అని మంత్రి వివరించారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపం దాల్చనుంది.
బిల్లు ముఖ్యాంశాలు..
► శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులున్నాయని భావించినప్పుడు టెలికం నెట్‌వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశా(మెసేజీ)లను రహస్యంగా వినొచ్చు, ప్రసారాలను నిలిపివేయవచ్చు.
► ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు దఖలు పడతాయి.
► పై పరిస్థితుల్లో కేంద్రం నేరుగా, లేదా కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రత్యేక అధికారికి టెలికం సర్వి సులను లేదా టెలికం నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకునే అధికారం సమకూరుతుంది.
► ఎవరైనా అనధికారి టెలికం నెట్‌వర్క్‌ను, పరికరాలను, రేడియోలను వినియోగిస్తున్నారని తేలితే ప్రభుత్వం ఏ భవనాన్ని లేదా విమానం, నౌక సహా ఎటువంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయొచ్చు, స్వా«దీనం చేసుకోవచ్చు.
► వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రమ్‌లను వేలం ద్వారానే కేటాయించాలన్న దేశీయ టెలికం సేవల సంస్థలు జియో, వొడాఫోన్ ఐడియా అభ్యర్థనలను తోసిపుచ్చుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రమ్‌లను కేటాయించేలా నిబంధనలను బిల్లులో పొందుపరిచారు.
► పాలనా అనుమతుల ప్రకారం..స్పెక్ట్రమ్ కేటాయింపులను దేశంలో, అంతర్జాతీయంగా సుదూర శాటిలైట్ సర్వి సెస్, విశాట్..విమానయానం, సముద్రయానంతో అనుసంధానమయ్యే నెట్‌వర్క్‌లు, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వంటి సంస్థలు పొందగలవు.
► ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు, కాల్స్ చేసుకోవడానికి వీలు కలి్పంచే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. వీటిని టెలికం చట్ట పరిధి నుంచి తొలగిస్తారు.
► ఓటీటీ(ఓవర్ ది టాప్) యాప్‌లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పరిధి నుంచి తొలగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు.
అనధికార ట్యాపింగ్‌లకు.. మూడేళ్ల జైలు, రూ.2 కోట్ల జరిమానా
అక్రమంగా, అనుమతుల్లేకుండా ఫోన్ సందేశాలను రహస్యంగా విన్నా, ట్యాపింగ్‌కు పాల్పడినా భారీ జరిమానాతోపాటు కఠిన శిక్ష విధించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలకు, మిత్రదేశాలతో సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరచడం నేరంగా పరిగణిస్తారు.
దోషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్ల వరకు జరిమానా, నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం ఉంది. నేరగాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెలికం సేవలను అందించే సంస్థలపైనా చర్యలుంటాయి. కాల్ డేటా, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడినా శిక్ష, జరిమానా తప్పదు. టెలికం నెట్‌వర్క్‌లకు, టెలీకం సదుపాయాలకు ఉద్దేశ పూర్వకంగా నష్టం కలిగించే వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాద నలున్నాయి.
తప్పుడు ధ్రువ పత్రాలతో సిమ్.. రూ. 50 లక్షల జరిమానా, జైలు
తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్ కార్డు పొందే వారికి రూ.50 లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్షకు ఈ బిల్లు వీలు కలి్పస్తోంది. ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులను వాడి ‘సిమ్‌బాక్స్’తో అక్రమాలకు పాల్పడే వారికి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇతరుల ఫోన్ నంబర్లను స్పూఫింగ్ చేస్తూ మోసాలకు పాల్పడే వారికి కూడా ఇవే శిక్షలుంటాయి. సిమ్ దురి్వనియోగాన్ని అడ్డుకట్ట వేయడంతోపాటు ఇతరులకు వివిధ మార్గాల్లో ఇబ్బంది కలిగించే కాలర్‌లపైనా చర్యలకు ఇందులో వీలుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ లో నమోదు చేసుకుని, పరిష్కారం పొందేందుకు సైతం బిల్లులో ఏర్పాట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment