
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయసభల పనితీరును వెల్లడించారు. లోక్‌సభ సమావేశాలు 116 శాతం(కేటాయించిన సమయం కంటే ఎక్కువ చర్చ), రాజ్యసభ సమావేశాలు 99 శాతం ఫలప్రదమయ్యాయని శుక్రవారం చెప్పారు. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులను ప్రవేశపెట్టామన్నారు. అందులో లోక్‌సభ 14 బిల్లులను, రాజ్యసభ 15 బిల్లులను ఆమోదించిందన్నారు.
సభా కార్యకలాపాలు తెలుగులో...
సభా కార్యకలాపాలను ఒక రోజు పాటు తన మాతృభాష తెలుగులో నిర్వహించాలనుకుంటున్నానని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘సభ్యులు తమ మాతృభాషల్లో మాట్లాడితే ప్రజలను ఈ దిశగా ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. నా మాతృభాష తెలుగులో ఒకరోజు సభా కార్యకలాపాలు నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు. గత సమావేశాలతో పాటు తాజాగా 250వ సెషన్ కూడా వంద శాతం ఫలప్రదమైందని పేర్కొన్నారు. ‘రోజుకు సగటున 9.5 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు వచ్చాయి. 49 ఏళ్లలో ఇదే అత్యుత్తమం’ అని పేర్కొన్నారు. ‘199 జీరో అవర్ అభ్యర్థనలు, 115 ప్రత్యేక ప్రస్తావనలు వచ్చాయి. ఇదీ రికార్డే’ అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022కి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అప్పటికి కొత్త పార్లమెంటు నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment