
‘ట్యాపింగ్’ వివరాలు ఇవ్వండి
ముగ్గురు సర్వీసు ప్రొవైడర్లకు బెజవాడ కోర్టు ఆదేశం
* జూలై 1 వరకు గడువు
* ఆదేశాల ప్రతులను హైదరాబాద్‌లోని కంపెనీలకు ఇవ్వనున్న సీఐడీ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారానికి కౌంటర్‌గా సీఐడీ చేపట్టిన జెరూసలేం మత్తయ్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాలను బుధవారం లోపు ఇవ్వాల్సిందిగా విజయవాడలోని 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కె.జయకుమార్ ముగ్గురు సర్వీస్ ప్రొవైడర్లను శుక్రవారం ఆదేశించారు.
ఈ ఆదేశాలను సీఐడీ అధికారులు శనివారం హైదరాబాద్‌లోని ఆయా టెలికం సంస్థల ప్రధాన కార్యాలయాలకు అధికారికంగా అందజేయనున్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరుసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు న మోదైన కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీఐడీ చేపట్టిన విషయం విదితమే. సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదులో బెదిరింపులకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉన్నాయి.
ఆయన స్థానిక మున్సిఫ్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలంలో అవినీతి, లంచానికి సంబంధించిన అంశాలతో పాటు ట్యాపింగ్ వ్యవహారాన్నీ ప్రస్తావించారు. అయితే ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న 88 కేసుల్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) నేరుగా సర్వీసు ప్రొవైడర్లను కొన్ని వివరాలు అడిగి భంగపడింది. దీంతో వ్యూహాత్మకంగా పావులు కదిపిన సీఐడీ అధికారులు ‘ట్యాపింగ్’కు సంబంధించిన వివరాలు అందించేలా సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించాలని కోరుతూ న్యాయస్థానంలో గత వారం మెమో దాఖలు చేశారు.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు శుక్రవారం ఎయిర్‌టెల్, రిలయన్స్ సహా మరో సర్వీస్ ప్రొవైడర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మత్తయ్య, ఆయన సోదరుడు, బంధువులు వినియోగిస్తున్న 3 నంబర్లతో పాటు సెబాస్టియన్ (ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు) వినియోగిస్తున్న నంబర్‌ను నిర్ణీత కాలంలో ఎవరైనా ట్యాపింగ్ చేశారా? చేస్తే ఈ మేరకు సర్వీసు ప్రొవైడర్లకు అధికారిక లేఖ ఏ అధికారి నుంచి వచ్చింది? తదితర పూర్తి వివరాలను ఆధారాలతో సహా జూలై 1లోపు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. సీల్డ్ కవర్‌లో ఆయా కంపెనీల ప్రతినిధులే స్వయంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు అందించిన వివరాలను న్యాయస్థానం అనుమతితో తీసుకోవాలని సీఐడీ భావిస్తోంది. వాటిలోని అంశాల ఆధారంగా బాధ్యులకు నోటీసుల జారీ సహా ఇతర చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.