న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్‌ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో రాహుల్‌గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు.
కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్‌గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు.
బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్‌హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment