himanth bisva
-
ఆధార్‌కార్డుల జారీకి ‘ఎన్ఆర్సీ’ మెలిక
గువహటి: ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అస్సాంలో ఆధార్ కార్డు కావాలంటే జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి దరఖాస్తు చేసుకున్న నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. అస్సాంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత శర్మ అన్నారు. అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇందుకే ఎన్ఆర్సీ దరఖాస్తు రసీదు నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అస్సాంలో ఆధార్ కార్డుల జారీ ఇక ఎంతమాత్రం సులభం కాదని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలని కోరారు. బంగ్లాదేశ్ వంటి పొరుగుదేశాల నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. ఈ రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వ్యక్తులకు ఆధార్ కార్డు జారీపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే కేంద్రం వదిలేసిందని ఈ సందర్భంగా హిమంత గుర్తు చేశారు. ఇందుకే తాము కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. -
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం సంచలన ట్వీట్
న్యూఢిల్లీ: వీలు దొరికినపుడల్లా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై విరుచుకుపడే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తాజాగా మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని హిమంత ఈసారి ఏకంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌తో పోల్చారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ముంబై యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ బాబా సిద్ధికీ రాహుల్ గాంధీ టీమ్‌పై చేసిన బాడీ షేమింగ్ ఆరోపణలపై హిమంత స్పందించారు. నార్త్ కొరియా నియంత కిమ్ ఒక్కడే తనతో ఫొటో దిగే పార్టీ కార్యకర్తలు ఫొటోజెనిక్‌గా ఉండాలని కోరుకుంటారని హిమంత రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కలవాలని వెళ్లిన తనను 10 కేజీల వెయిట్ తగ్గి రావాల్సిందిగా రాహుల్ టీమ్ సభ్యులు సూచించారని బాబా సిద్ధిఖీ చేసిన ఆరోపణలు సంచనం రేపాయి. కాగా, గత నెలలో అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించిన సమయంలో హిమంత ప్రభుత్వం రాష్ట్రంలో యాత్రకు చాలా షరతులు విధించింది. గువహతిలోకి యాత్ర ప్రవేశించేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి రాహుల్‌గాంధీపై అస్సాం సీఐడీ కేసు కూడా పెట్టింది. త్వరలో ఈ కేసులో సీఐడీ రాహుల్‌కు సమన్లు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. The only other person, I can think of, who makes such ridiculous demands from his party workers – that they should look nice and photogenic – is a dynast who rules North Korea. https://t.co/sAlcMoOwPQ — Himanta Biswa Sarma (@himantabiswa) February 23, 2024 ఇదీ చదవండి.. రాహుల్‌ను కలవాలంటే 10 కేజీలు తగ్గమన్నారు -
రాహుల్‌కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్‌ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్‌గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్‌గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్‌హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
ప్లాస్మా దాతలకు అస్సాం శుభవార్త
గువాహటి : ఈశాన్య రాషష్ట్రం అస్సాంలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. ప్లాస్మాదాతలు కరువై చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్లాస్మా దానాన్ని ప్రోత్సహించే విధంగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ పథకాల్లో ప్లాస్మా దాతలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గౌహతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మమాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకే స్కోరు సాధిస్తే మొదటగా ప్లాస్మా దాతకే ప్రాధాన్యత ఇస్తామని, వారికి ఇంటర్వ్యూల్లో రెండు మార్కులు అదనంగా ఇస్తామని మంత్రి ప్రకటించారు. (ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రభుత్వం ఆఫర్) ప్రతీ ప్లాస్మా దాతకు ఓ సర్టిఫికేట్ అందిస్తామని.. తద్వారా భవిష్యత్తులో వారికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. ఇతర రాష్ర్టాలనుంచి కూడా రావచ్చని అస్సాం ప్రభుత్వం వారికి స్వాగతం పలుకుందని తెలిపారు. అంతేకాకుండా ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరించడంతో పాటు వారిని ప్రత్యేక అతిథిగా చూసుకుంటామని పేర్కొన్నారు. రాష్ర్టంలో అతి త్వరలోనే వర్చువల్ ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమవుతుందని సిల్చార్, దిఫు, దిబ్రుగ సహా 6 ప్రాంతాల్లో ప్లాస్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గువాహటిలో ఇప్పటికే ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఇటీవల గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రోగులకు ప్లాస్మా చికిత్సనందించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,754కు చేరుకోగా 12,888 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన) -
లాక్డౌన్ ప్రకటించిన అస్సాం ప్రభుత్వం
గువాహటి : గత వారం రోజులుగా అస్సాం రాష్ర్టంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట వ్యాప్తంగా అత్యధికంగా కరోనా తీవ్రత ఉన్న గువాహటిలోని కమ్రప్ మెట్రోపాలిటన్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం ప్రకటించారు. జూన్ 28 నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ ఉంటుందని తెలిపారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలతో సహా వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు తెరవడానికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా వారాంతాల్లో (శని, ఆదివారం) అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. నేటి అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. దీని ప్రకారం రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు 12 గంటల కర్ఫ్యూ ఉండనుంది. అయితే పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన గువాహటిలో పరిమిత సంఖ్యలో బ్యాంకులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతేకాకుండా అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని ఉత్తర్వులో పేర్కొంది. (సేనల సన్నద్ధతపై నివేదిక) రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజుల్లోనే 700కి పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లోనే రాష్ట్రంలో 276 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రాగా వీటిలో 133 కేసులు గువాహటిలో నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,300కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. (ప్లాస్మా థెరఫీకి గ్రీన్‌సిగ్నల్) -
ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే..
అసోం: అసోంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రాయడం, మాట్లాడడం కచ్చితంగా రావాల్సిందే. సర్బానంద సోనావాల్ ప్రభుత్వం తాజా నిబంధనలను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ..ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కేవలం అసోం భాషలో మాట్లాడడం సరిపోదని, రాయడం కూడా వచ్చి ఉండాలని తెలిపారు. అసోం భాషను కాపాడుకోవడంలో భాగంలోనే ఈ నిబంధనలను రూపొందించినట్లు పేర్కొన్నారు. తన కుమారుడు వేరే రాష్ట్రంలో చదువుతున్నాడని.. అతడు అసోం భాషలో మాట్లాడగలడని, కానీ రాయడం రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందలేడని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని అన్నారు. పదవ తరగతి వరకు అసోం భాషను బోధించాలనే నిబంధనను పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించి అసోంని రాష్ట్ర భాషగా ఎప్పటికి కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. -
చక్రం తిప్పిన ఢిల్లీ పెద్దలు!
గోవా, మణిపూర్లలో ఫలించిన బీజేపీ వ్యూహం ⇒ రెండో స్థానంలో ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం ⇒ గోవాలో గడ్కారీ, పరీకర్.. మణిపూర్‌లో రాం మాధవ్, హిమంత ⇒ బీజేపీ ధనబలాన్ని ప్రయోగించిందని విపక్షాల ధ్వజం సాక్షి నేషనల్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఒక్క పంజాబ్‌లో తప్ప మిగిలిన చోట్ల బొక్కబోర్లా పడింది. మణిపూర్, గోవాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటు వ్యూహంలో దారుణంగా విఫలమైంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన శక్తినుపయోగించి రాత్రికి రాత్రే చక్రం తిప్పేసింది. ఢిల్లీలోని పార్టీ పెద్దల సూచన ప్రకారం మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లతో పొత్తులు కుదుర్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారం చేసుకుంది. ఇందుకు గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్, ఆప్ విమర్శించినా.. పరిస్థితి అందిపుచ్చుకోవటంలో బీజేపీ పెద్దలు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది సుస్పష్టం. ఎన్నికల ఫలితాలు విడుదలవటమే ఆలస్యం.. ఢిల్లీ నుంచి కమలం పార్టీ పెద్దలు ఆయా రాష్ట్రాల్లో వాలిపోయి పరిస్థితులు ‘చేతి’కందకుండా పరిస్థితులు చక్కబెట్టారు. దీంతో నేడు గోవాలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. మణిపూర్‌లో బీజేపీ తన మద్దతుదారుల జాబితాను గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు సమర్పించింది. శనివారం రాత్రి ఏం జరిగింది? శనివారం వెల్లడైన ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నా.. బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మణిపూర్, గోవాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ఎలాగైనా ఈ రెండు రాష్ట్రాల్లో గెలుస్తామనే ధీమాతోనే ఫలితాలు రాగానే అమిత్ షా ‘గోవా, మణిపూర్‌లలోనూ మా ప్రభుత్వమే ఉంటుంది’ అని బహిరంగంగా ప్రకటించగలిగారు. గోవా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అమిత్‌షా రంగంలోకి దించారు. శనివారం రాత్రి గోవా చేరుకున్న నితిన్ గడ్కారీ.. వస్తూనే ‘మిషన్ గోవా సర్కారు’ను ప్రారంభించారు. పణజీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎన్సీపీ, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 1 గంటనుంచి 4 గంటలవరకు మూడు గంటలపాటు వీరితో చర్చించి ప్రభుత్వానికి మద్దతిచ్చేలా ఒప్పించారు. దీంతో 13 సీట్లున్న బీజేపీకి ఏడుగురు చేరటంతో బలం 20కి పెరిగింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఎమ్మెల్యే కావాలి. దీంతో గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్తో పణజీ సమీపంలోని ఓ రిసార్టులో చర్చలు ప్రారంభించారు. ముగ్గురు ఎమ్మెల్యేలున్న జీఎఫ్తో ఉదయం ఎనిమిది గంటలవరకు జరిగినా సానుకూలంగా జరగలేదు. దీంతో మధ్యాహ్నం మరోసారి ఓ దూతను విజయ్ దగ్గరకు పంపిన గడ్కారీ.. డీల్ ఓకే (ముగ్గురికీ మంత్రి పదవులిచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం) అయినట్లుగా జీఎఫ్తో మద్దతు పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. దీంతో బీజేపీ బలం 23కు చేరింది. ఈ చర్చలన్నీ పరీకర్, గడ్కారీ సమక్షంలో జరిగాయి. అయితే పరీకర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే విజయ్ సర్దేశాయ్.. సీఎంగా పరీకర్ ఉంటానంటేనే మద్దతిస్తాను అని ప్రకటించటం గమనార్హం. తెల్లారేసరికి మారిన ‘హంగ్’ మణిపూర్‌లోనూ అదే పరిస్థితి అధిష్టానం దూతలుగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన రామ్ మాధవ్, అస్సాం మంత్రి హిమంత్ బిస్వా శర్మలు శనివారం రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఎన్పీపీ, ఎల్జేపీలతోపాటు ఓ టీఎంసీ ఎమ్మెల్యే, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఒప్పించారు. హంగ్‌పై చర్చ జరుగుతుండగానే.. ఆదివారం తెల్లారేసరికి 32 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమని ప్రకటించటం ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా బీరేన్ సింగ్‌ను ఎన్నుకున్నారు. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికార దుర్వినియోగమే: విపక్షాలు మణిపూర్, గోవాల్లో తమ చేతుల్లోంచి బీజేపీ అధికారాన్ని లాగేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని విరుచుకుపడింది. ‘ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఎక్కడిది?’ అని మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. గోవాలో ప్రజాబలం కన్నా ధనబలమే విజయం సాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. గోవాలో ధన, మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటుకు గురైన ఆప్ కూడా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించింది. గోవాలో ఎమ్మెల్యేలను ఎన్నుకునే బదులు.. ఎన్నికల సంఘం ఆ సీట్లను వేలం వేస్తే పార్టీలు కొనుక్కునేవని ఎద్దేవా చేసింది. నిమ్మకు నీరెత్తని కాంగ్రెస్ గోవాలో గడ్కారీ, పరీకర్ తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే పనిలో పడింది. పార్టీ పరిశీలకుడిగా గోవాలో మకాం వేసిన దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే ఎమ్మెల్యేలు నేనంటే నేను సీఎం అని పోటీ పడ్డారు. మెజారిటీకి తగ్గిన 4 సీట్ల గురించి ఆలోచించకుండానే.. ఆదివారమంతా హోటల్లో తమ బలాబలాల ప్రదర్శనలో పడ్డారు. సీఎల్పీ పదవికోసం రహస్య ఓటింగ్ నిర్వహించారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్సీపీ అభ్యర్థి.. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేసినా అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చినా.. కాంగ్రెస్‌నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశంలో ఉండగానే.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌తో భేటీకి వెళ్తున్న సమాచారం అందింది.