చక్రం తిప్పిన ఢిల్లీ పెద్దలు!
గోవా, మణిపూర్‌లలో ఫలించిన బీజేపీ వ్యూహం
⇒ రెండో స్థానంలో ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
⇒ గోవాలో గడ్కారీ, పరీకర్.. మణిపూర్‌లో రాం మాధవ్, హిమంత
⇒ బీజేపీ ధనబలాన్ని ప్రయోగించిందని విపక్షాల ధ్వజం
సాక్షి నేషనల్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఒక్క పంజాబ్‌లో తప్ప మిగిలిన చోట్ల బొక్కబోర్లా పడింది. మణిపూర్, గోవాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటు వ్యూహంలో దారుణంగా విఫలమైంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన శక్తినుపయోగించి రాత్రికి రాత్రే చక్రం తిప్పేసింది. ఢిల్లీలోని పార్టీ పెద్దల సూచన ప్రకారం మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లతో పొత్తులు కుదుర్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారం చేసుకుంది.
ఇందుకు గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్, ఆప్ విమర్శించినా.. పరిస్థితి అందిపుచ్చుకోవటంలో బీజేపీ పెద్దలు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది సుస్పష్టం. ఎన్నికల ఫలితాలు విడుదలవటమే ఆలస్యం.. ఢిల్లీ నుంచి కమలం పార్టీ పెద్దలు ఆయా రాష్ట్రాల్లో వాలిపోయి పరిస్థితులు ‘చేతి’కందకుండా పరిస్థితులు చక్కబెట్టారు. దీంతో నేడు గోవాలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. మణిపూర్‌లో బీజేపీ తన మద్దతుదారుల జాబితాను గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు సమర్పించింది.
శనివారం రాత్రి ఏం జరిగింది?
శనివారం వెల్లడైన ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నా.. బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మణిపూర్, గోవాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ఎలాగైనా ఈ రెండు రాష్ట్రాల్లో గెలుస్తామనే ధీమాతోనే ఫలితాలు రాగానే అమిత్ షా ‘గోవా, మణిపూర్‌లలోనూ మా ప్రభుత్వమే ఉంటుంది’ అని బహిరంగంగా ప్రకటించగలిగారు. గోవా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అమిత్‌షా రంగంలోకి దించారు. శనివారం రాత్రి గోవా చేరుకున్న నితిన్ గడ్కారీ.. వస్తూనే ‘మిషన్ గోవా సర్కారు’ను ప్రారంభించారు. పణజీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎన్సీపీ, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు.
ఆదివారం తెల్లవారుజామున 1 గంటనుంచి 4 గంటలవరకు మూడు గంటలపాటు వీరితో చర్చించి ప్రభుత్వానికి మద్దతిచ్చేలా ఒప్పించారు. దీంతో 13 సీట్లున్న బీజేపీకి ఏడుగురు చేరటంతో బలం 20కి పెరిగింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఎమ్మెల్యే కావాలి. దీంతో గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్‌తో పణజీ సమీపంలోని ఓ రిసార్టులో చర్చలు ప్రారంభించారు. ముగ్గురు ఎమ్మెల్యేలున్న జీఎఫ్‌తో ఉదయం ఎనిమిది గంటలవరకు జరిగినా సానుకూలంగా జరగలేదు. దీంతో మధ్యాహ్నం మరోసారి ఓ దూతను విజయ్ దగ్గరకు పంపిన గడ్కారీ.. డీల్ ఓకే (ముగ్గురికీ మంత్రి పదవులిచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం) అయినట్లుగా జీఎఫ్‌తో మద్దతు పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. దీంతో బీజేపీ బలం 23కు చేరింది. ఈ చర్చలన్నీ పరీకర్, గడ్కారీ సమక్షంలో జరిగాయి. అయితే పరీకర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే విజయ్ సర్దేశాయ్.. సీఎంగా పరీకర్ ఉంటానంటేనే మద్దతిస్తాను అని ప్రకటించటం గమనార్హం.
తెల్లారేసరికి మారిన ‘హంగ్’
మణిపూర్‌లోనూ అదే పరిస్థితి అధిష్టానం దూతలుగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన రామ్ మాధవ్, అస్సాం మంత్రి హిమంత్ బిస్వా శర్మలు శనివారం రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఎన్‌పీపీ, ఎల్‌జేపీలతోపాటు ఓ టీఎంసీ ఎమ్మెల్యే, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఒప్పించారు. హంగ్‌పై చర్చ జరుగుతుండగానే.. ఆదివారం తెల్లారేసరికి 32 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమని ప్రకటించటం ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా బీరేన్ సింగ్‌ను ఎన్నుకున్నారు. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అధికార దుర్వినియోగమే: విపక్షాలు
మణిపూర్, గోవాల్లో తమ చేతుల్లోంచి బీజేపీ అధికారాన్ని లాగేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని విరుచుకుపడింది. ‘ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఎక్కడిది?’ అని మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. గోవాలో ప్రజాబలం కన్నా ధనబలమే విజయం సాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. గోవాలో ధన, మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటుకు గురైన ఆప్ కూడా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించింది. గోవాలో ఎమ్మెల్యేలను ఎన్నుకునే బదులు.. ఎన్నికల సంఘం ఆ సీట్లను వేలం వేస్తే పార్టీలు కొనుక్కునేవని ఎద్దేవా చేసింది.
నిమ్మకు నీరెత్తని కాంగ్రెస్
గోవాలో గడ్కారీ, పరీకర్ తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే పనిలో పడింది. పార్టీ పరిశీలకుడిగా గోవాలో మకాం వేసిన దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే ఎమ్మెల్యేలు నేనంటే నేను సీఎం అని పోటీ పడ్డారు. మెజారిటీకి తగ్గిన 4 సీట్ల గురించి ఆలోచించకుండానే.. ఆదివారమంతా హోటల్లో తమ బలాబలాల ప్రదర్శనలో పడ్డారు. సీఎల్‌పీ పదవికోసం రహస్య ఓటింగ్ నిర్వహించారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్సీపీ అభ్యర్థి.. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేసినా అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చినా.. కాంగ్రెస్‌నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశంలో ఉండగానే.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌తో భేటీకి వెళ్తున్న సమాచారం అందింది.