వారం వారం విడుదలయ్యే కొత్త చిత్రాల కోసం సినిమా లవర్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. అయితే మార్చి 2కి థియేటర్లలోకి కొత్త బొమ్మ వచ్చే అవకాశం కనిపించడంలేదు. థియేటర్లు మూతపడబోతున్నాయి. వినడానికి షాకింగ్‌గానే ఉంటుంది. ఎందుకీ పరిణామం అంటే.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్‌ఓ), నిర్మాతల మధ్య ధర విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాలేదు.
ధర ఎక్కువగా ఉందని భావించిన నాలుగు (తెలుగు, తమిళ, కన్నడ, కేరళ) రాష్ట్రాల నిర్మాతలు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు. శుక్రవారం బెంగళూరులో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ జాయింట్ యాక్షన్ కమిటీ (తెలుగు, తమిళ, కేరళ, కర్నాటక) వారు డిజిటల్ ప్రొవైడర్స్‌తో మరో సమావేశం నిర్వహించారు. ఇçప్పుడు వసూలు చేస్తున్న మొత్తంలో 20 శాతం తగ్గిస్తే చాలన్నది నిర్మాతల విన్నపం అని తెలిసింది.
గత సమావేశాల్లా ఈసారి కూడా చర్చలు విఫలం అయ్యాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు 9 శాతం మాత్రమే తగ్గించడానికి ముందుకు వచ్చారని సమాచారం. దాంతో మార్చి 2 నుంచి కొత్త చిత్రాల కంటెంట్ ఇవ్వకూడదనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారు. కంటెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా థియేటర్లు మూతపడతాయి. అది మాత్రమే కాదు.. అప్పటికే ఆడుతున్న సినిమాలను కూడా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఈ పరిస్థితి ఎందాకా వెళుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment