ముత్యాల రాందాస్, కేఎల్ దామోదర్ ప్రసాద్
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(క్యూబ్, యూఎఫ్‌ఓ) వసూలు చేస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) తగ్గించనందుకు నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)’ స్పష్టం చేసింది.
ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రాందాస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్‌లోకి మారుతూ వచ్చింది. వీపీఎఫ్ నామమాత్రమే చెల్లించండి.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పిన క్యూబ్, యూఎఫ్‌ఓ యాజమాన్యాలు ఇప్పుడు మాట మారుస్తున్నాయి.
ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్‌నూ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ చిత్రవర్గాలు నిర్మాత డి.సురేశ్‌బాబు చైర్మన్‌గా, నిర్మాత కిరణ్ కన్వీనర్‌గా ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేశాం.
ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ని 25శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఫీజును 10 శాతం తగ్గిస్తామని వారు అంటే ఒప్పుకోలేదు. ఫిబ్రవరి 23న బెంగళూరులో మరో సమావేశం నిర్వహించగా, 9శాతం మాత్రమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే ఓ వ్యక్తి ‘ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ’ అని వ్యంగ్యంగా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయాడు.
మా డిమాండ్లకు ఒప్పుకోకుంటే మార్చి 2నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని వారికి స్పష్టం చేశాం. మా నిర్ణయానికి సౌత్ ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా క్యూబ్, యూఎఫ్‌ఓ కంపెనీలు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు మా డిమాండ్లు ఒప్పుకుంటే సినిమాల ప్రదర్శన ఉంటుంది. వారు ఒప్పుకున్నా కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు వెనకడుగు వేయం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment