KL Damodar Prasad
-
ఇట్స్ ఓకే గురు ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ఇట్స్ ఓకే గురు. సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణికంఠ దర్శకత్వంలో వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ గురువారం నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్స్, కొన్ని విజువల్స్ చూశాక.. ఇట్స్ ఓకె గురు కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అనిపిస్తోందన్నారు.దామోదర్ ప్రసాద్ గారు ఇచ్చిన కితాబు... తమ చిత్రంపై తమకు గల నమ్మకాన్ని రెట్టింపు చేసిందని నిర్మాత సురేష్ అనపురపు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో చరణ్ సాయి, హీరోయిన్ ఉష శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియాక్ పాల్గొన్నారు!! -
టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదు
‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందలేదు. ఆ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నిర్వహించే నంది అవార్డు వేడుక ఆయన వ్యక్తిగతంతో పాటు ఓ ప్రైవేట్ వేడుక. ఈ నంది అవార్డు వేడుకకు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి)కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేడుకకి మేం భాగస్వామ్యం వహించం’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్. దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి, ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన సంస్థలు. 24–09–2023న దుబాయ్‌లో నిర్వహించనున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి మా రెండు ఛాంబర్లకు సంబంధం లేదు. ‘నంది’ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేటెంట్. నంది పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని ఖండిస్తున్నాం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద కూడా టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
'మా ఊరి ప్రేమ కథ' వచ్చేది అప్పుడే
‘‘ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి. అన్ని ప్రేమకథలు ఒక్కటే.. కానీ కొత్తగా చూపిస్తే కచ్చితంగా హిట్ అవుతాయి. ‘మా ఊరి ప్రేమకథ’ ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత కేయల్ దామోదర ప్రసాద్ అన్నారు. మంజునాథ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. తనిష్క్ హీరోయిన్. శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్, ఆడియోను విడుదల చేశారు. మంజునాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. రియలిస్టిక్ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా విషయంలో నాకు సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవి గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. సహనిర్మాత మహేంద్రనాథ్, సంగీత దర్శకుడు జయసూర్య, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు రవితేజ, ‘కీ’ మ్యూజిక్ అధినేత రవి కనగాల, ‘తొలిముద్దు’ సినిమా నిర్మాత ఆర్కే రెడ్డి పాల్గొన్నారు. -
కన్ ఫ్యూజన్ .. ఫన్
‘‘కార్తీక్, ఉమ ప్రేమకథలో అనుకోకుండా చిట్టి అనే చిన్నపాప ప్రవేశిస్తే వచ్చే అపార్థాలు దేనికి దారి తీస్తాయి? ఆ పాప ఎవరు? మా ప్రేమకథని తను ఎలా గట్టెక్కించింది? అనే పాయింట్‌తో రూపొందిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే. ఇందులో పాత్రల మధ్య ఉండే కన్ ఫ్యూజన్ మంచి వినోదం అందిస్తుంది’’ అన్నారు రామ్ కార్తీక్. జగపతిబాబు ప్రధాన పాత్రలో విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్–చిట్టి–ఉమా–కార్తీక్)’. కేఎల్ దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ కార్తీక్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇందులో నా పాత్ర పక్కింటబ్బాయి తరహాలో ఉంటుంది. నటుడిగా నాలో నాకు తెలీని యాంగిల్‌ను ఈ సినిమాతో బయటకు తెచ్చారు విద్యాసాగర్‌గారు. ప్రివ్యూ చూసిన వారంతా నా నటనను మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం ఫన్ గానే కాకుండా ఎమోషనల్గానూ ఉంటుంది. అది ఆడియన్స్‌కు బాగా రీచ్ అవుతుంది’’ అన్నారు. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ సినిమా మీద ప్యాషన్‌తో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం చూసాను. ప్రశాంత్ బాగా నటించాడు. మరో మంచి నటుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలి’’ అని నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా పియల్‌కె రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఎన్‌యస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత కె.యల్.దామోదర ప్రసాద్ విడుదలచేశారు. పియల్‌కె రెడ్డి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సుబ్బారెడ్డిగారు అన్నివిధాలా సహకరించి సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ మంచి పాటలు ఇచ్చారు. యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌లో ప్రశాంత్ బాగా నటించాడు. మేము ఊహించిన దానికంటే అవంతిక బాగా చేశారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేసేలా ఉంటుంది’’ అని నల్లమోపు సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదు’’ అన్నారు ప్రశాంత్. ‘‘ప్రాణం ఖరీదు’ నా మూడో చిత్రం. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను’’ అని అవంతిక చెప్పారు. -
మళ్లీ మొదలైంది
కొత్త తరం చిత్రాలను ఆదరించే నిర్మాణ సంస్థగా శ్రీరంజిత్ మూవీస్‌కు మంచి పేరుంది. రంజిత్ మూవీస్ అనగానే ‘అలా మొదలైంది’, ‘అంతకుముందు– ఆ తరువాత’, ‘కళ్యాణ వైభోగమే’ చిత్రాలు గుర్తుకొస్తాయి. వైవిధ్యమైన కథలతో పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రాలతో సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ సినిమాలు నిర్మిస్తుంటారు. రెండేళ్ల విరామం తర్వాత నాలుగు నూతన చిత్రాలను నిర్మించటానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే నాలుగు కథలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయటం జరిగింది. వీటి నిర్మాణం సమాంతరంగా జరుగుతుంది. వీటిలో ఓ చిత్రాన్ని జనవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నాం. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు సాగర్‌ను పరిచయం చేస్తున్నాం. ప్రముఖ నటీనటులతో పాటు నూతన తారాగణం కూడా ఉంటుంది. మా గత చిత్రాల కోవలోనే ఈ నాలుగు చిత్రాలు ఉంటాయి. మిగతా చిత్రాల విశేషాలను త్వరలోనే తెలియచేస్తాను’’ అన్నారు. -
రేపటి నుంచి సినిమాల ప్రదర్శన బంద్
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(క్యూబ్, యూఎఫ్ఓ) వసూలు చేస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) తగ్గించనందుకు నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)’ స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రాందాస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్లోకి మారుతూ వచ్చింది. వీపీఎఫ్ నామమాత్రమే చెల్లించండి.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పిన క్యూబ్, యూఎఫ్ఓ యాజమాన్యాలు ఇప్పుడు మాట మారుస్తున్నాయి. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్నూ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ చిత్రవర్గాలు నిర్మాత డి.సురేశ్‌బాబు చైర్మన్‌గా, నిర్మాత కిరణ్ కన్వీనర్‌గా ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ని 25శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఫీజును 10 శాతం తగ్గిస్తామని వారు అంటే ఒప్పుకోలేదు. ఫిబ్రవరి 23న బెంగళూరులో మరో సమావేశం నిర్వహించగా, 9శాతం మాత్రమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే ఓ వ్యక్తి ‘ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ’ అని వ్యంగ్యంగా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయాడు. మా డిమాండ్లకు ఒప్పుకోకుంటే మార్చి 2నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని వారికి స్పష్టం చేశాం. మా నిర్ణయానికి సౌత్ ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా క్యూబ్, యూఎఫ్ఓ కంపెనీలు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు మా డిమాండ్లు ఒప్పుకుంటే సినిమాల ప్రదర్శన ఉంటుంది. వారు ఒప్పుకున్నా కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వెనకడుగు వేయం’’ అన్నారు. -
'ఎవరి సినిమాకు వారే విమర్శకులవ్వాలి'
‘‘ప్రేక్షకుడు చాలా తెలివైనవాడు. విశ్లేషణాత్మకమైన పరిశీలన కలవాడు. సినిమాను పద్ధతిగా తీస్తే తప్పకుండా ఆదరిస్తాడు’’ అంటున్నారు నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్. ‘అలామొదలైంది’, ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రాల ద్వారా అభిరుచి గల నిర్మాతగా గుర్తింపుతెచ్చుకున్న దాము గురువారం హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు. ‘‘ఇటీవలే ‘అంతకుముందు ఆ తర్వాత’ ప్రచార పర్వంలో భాగంగా నిజామాబాద్ వెళితే... ఓ నేల టిక్కెట్ ప్రేక్షకుడు ‘మీ సినిమాలో ఫొటోగ్రఫీ బాగుంది సార్’ అన్నాడు. అతనికి కెమెరా డిటైల్స్ తెలీక పోవచ్చు. కానీ కెమెరా పనితనానికి కనెక్ట్ అయ్యాడు. అలాగే ఈ సినిమాలోనే ఓ అయిదు సెకన్ల పాటు ఓ మొబైల్ నంబర్ కనిపిస్తుంది. అది మా సహ నిర్మాత నంబర్. అలా కనిపించి, ఇలా మాయమయ్యే ఆ నంబర్‌కి విపరీతమైన ఫోన్లు. అంటే ఒక సినిమాను ప్రేక్షకులు ఎంత పరిశీలనగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రేక్షకుని స్థాయికి తగ్గ సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు దాము. ఇంటిల్లిపాదీ మెచ్చే బాధ్యతాయుతమైన కథలతోనే ఇక నుంచి సినిమాలు తీస్తానని, ఎవరి సినిమాకు వారే విమర్శకులైనప్పుడు మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుందని దాము అభిప్రాయపడ్డారు. ఆరో వారంలో కూడా తమ సినిమాకు ప్రేక్షకాదరణ తగ్గలేదని, త్వరలోనే యాభైరోజుల వేడుకను కూడా ఘనంగా జరుపుతామని దాము తెలిపారు.