‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందలేదు. ఆ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నిర్వహించే నంది అవార్డు వేడుక ఆయన వ్యక్తిగతంతో పాటు ఓ ప్రైవేట్ వేడుక. ఈ నంది అవార్డు వేడుకకు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి)కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేడుకకి మేం భాగస్వామ్యం వహించం’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్. దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి, ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన సంస్థలు. 24–09–2023న దుబాయ్‌లో నిర్వహించనున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి మా రెండు ఛాంబర్‌లకు సంబంధం లేదు. ‘నంది’ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేటెంట్. నంది పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని ఖండిస్తున్నాం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల వద్ద కూడా టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment