prathani Ramakrishna Goud
-
టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదు
‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందలేదు. ఆ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నిర్వహించే నంది అవార్డు వేడుక ఆయన వ్యక్తిగతంతో పాటు ఓ ప్రైవేట్ వేడుక. ఈ నంది అవార్డు వేడుకకు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి)కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేడుకకి మేం భాగస్వామ్యం వహించం’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్. దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి, ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన సంస్థలు. 24–09–2023న దుబాయ్‌లో నిర్వహించనున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి మా రెండు ఛాంబర్లకు సంబంధం లేదు. ‘నంది’ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేటెంట్. నంది పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని ఖండిస్తున్నాం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద కూడా టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
నంది అవార్డు ప్రతి ఆర్టిస్ట్ కల
‘‘1964 నుండి నంది అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డు అందుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్ కల. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి థ్యాంక్స్. అలాగే సీనియర్ నటుల పేరుతో స్మారక అవార్డ్స్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్‌లో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్‌ను అలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నంది అవార్డ్స్ పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు. -
రాజశేఖర్ మేనల్లుడు హీరోగా ‘కంచుకోట’
ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కంచుకోట’. ‘రహస్యం’ అనేది ట్యాగ్‌లైన్. హీరో రాజశేఖర్ మేనల్లుడు మదన్ ఈ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయమవుతున్నారు. ఆశ, దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు (బుధవారం) ప్రతాని రామకృష్ణ గౌడ్ బర్త్ డే సందర్భంగా ‘కంచుకోట’ టైటిల్ లాంచ్ చేశారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక హిస్టారికల్ సినిమా. ఇందులో నేను గురూజీ పాత్ర చేశాను. మంగ్లీ పాడిన ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్ ఎత్తరి గురురాజ్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల, ‘టీఎఫ్‌సీసీ’ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి. సముద్ర పాల్గొన్నారు. -
సినీ నిర్మాతపై ఫిర్యాదు చేసిన మహిళ
జూబ్లీహిల్స్: లక్షలాది రూపాయల అద్దె కట్టకుండా ముఖం చాటేయడంతో పాటు దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారంటూ సినీ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌పై బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివాసం ఉంటున్న మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన మేరకు.. 2018లో మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా తమ భవనాన్ని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్(టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చామని నవ్వాడ శోభారాణి తెలిపారు. నెలకు నాలుగున్నర లక్షల అద్దెగా అంగీకరించారని రూ. 40 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పి రూ.30 లక్షలే ఇచ్చారని ఆరోపించారు. (ఏదీ శాశ్వతం కాదు) అప్పటి నుంచి అద్దె సరిగ్గా ఇవ్వకుండా వేదింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా పది రోజుల క్రితం తాను అద్దె చెల్లించలేనంటూ తాళాలు అప్పగించి వెళ్లిపోయిన ప్రతాని రామకృష్ణగౌడ్ తన కొడుకు సందీప్‌ను ఇంటి మీదికి పంపించి దౌర్జన్యానికి దిగాడన్నారు. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించడంతో పాటు తనకు ప్రభుత్వంలో పెద్ద వాళ్ళు పరిచయం ఉన్నారని తమ వద్దకు వస్తే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ట్రెండ్ మారింది
కల్యాణ్, రిహా జంటగా కృష్ణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’. కె. శ్రీకాంత్, కె. చంద్రమోహన్ నిర్మిస్తున్నారు. ఆదివారం పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను వి. సాగర్, మోషన్ పోస్టర్‌ను నటి కవిత విడుదల చేశారు. టైటిల్ సాంగ్‌ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ రిలీజ్ చేసి మాట్లాడుతూ– ‘‘పవన్‌కల్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని కథ తయారు చేసుకున్నారంటే ఈ సినిమా యూనిట్‌కు ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారింది. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు కవిత. ‘‘మా సినిమా రెండో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభిస్తాం’’ అన్నారు చంద్రమోహన్. కృష్ణతేజ, కల్యాణ్, సంగీత దర్శకుడు జయసూర్య పాల్గొన్నారు. సాయికుమార్, పోసాని కృష్ణమురళి, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మహి సరళ. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘సినిమా తీసే వరకే పెద్దది, చిన్నది అని నిర్మాత అనుకుంటాడు. హిట్ అయ్యాక ఏదైనా ఒకటే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఈ వేడుకకు వచ్చా’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఖయ్యూం, గౌరవ్ హీరోలుగా, మధులగ్నదాస్, అధియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. శేఖర్ చంద్ర దర్శకత్వంలో అవధూత లక్ష్మీ సమర్పణలో లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్‌పై అవధూత గోపాల్‌రావు నిర్మించారు. భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సి.కల్యాణ్ విడుదల చేసి, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్లకు అందించారు. ‘‘20 ఏళ్లుగా పలు సినిమాల్లో నటించిన అనుభవంతో ఈ సినిమా నిర్మించా. మా అబ్బాయి గౌరవ్ ఈ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఆగస్టులో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు గోపాల్‌రావు. -
చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఊరుకోం
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’లో తనకు సభ్యత్వం ఇవ్వలేదంటూ నటి శ్రీరెడ్డి ఫిల్మ్‌చాంబర్ ఎదుట శనివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ వివాదంపై ‘మా’ సభ్యులు ఫిల్మ్‌చాంబర్‌లో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎవరైనా తప్పుగా మాట్లిడితే ఊరుకునేది లేదు. శ్రీరెడ్డి మాటల్లో నిజం లేదు. చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఊరుకోం. ‘మా’ లోని 900మంది సభ్యుల్లో ఎవరూ తనతో నటించరు. ఎవరైనా నటిస్తే ‘మా’ నుంచి సస్పెండ్ చేస్తాం. ఆమెకు ‘మా’ లో సభ్యత్వం ఇవ్వం’’ అన్నారు. ‘‘మా’ 25 సంవత్సరాల జూబ్లీ ఇయర్లో ఇలాంటి సంఘటన సిగ్గు చేటు. ఇదంతా ఆ అమ్మాయి ఎందుకు చేస్తోంది? ఫ్రీ పబ్లిసిటీ కోసమా? సైకలాజికల్ ప్రాబ్లమా? అర్థం కావట్లేదు. పానకంలో పుడకలాగా సినీ పరిశ్రమను శ్రీరెడ్డి నాశనం చేస్తోంది’’ అన్నారు ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్. ‘‘శ్రీ రెడ్డి విషయంలో ‘మా’ కి సహకరిస్తాం. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో తనకు ఇచ్చిన సభ్యత్వం రద్దు చేసి, కార్డు వెనక్కి తీసేసుకుంటాం’’ అన్నారు టీఎఫ్‌సీసీ ౖచెర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. ‘‘ప్రతి విషయానికీ టీవీ, సోషల్మీడియాకి ఎక్కితే పోయేది మన పరువే. ఇలాంటివి చూసి కొత్త అమ్మాయిలు హీరోయిన్గా ఎలా రావాలనుకుంటారు?’’ అన్నారు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్. మా సభ్యులు బెనర్జీ, ఉత్తేజ్, సురేష్ కొండేటి, హేమ, వేణు మాధవ్, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది ముందే వచ్చినట్లుంది – శివాజీరాజా
రచన స్మిత్ ప్రధాన పాత్రలో ఆర్కే ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘మహిళ కబడ్డి’. రీసెంట్గా మూడో షెడ్యూల్ కంప్లీటైంది. ఈ చిత్రం కోసం ఉగాది పండగపై పాటను సంగీత దర్శకుడు బోలే షావళి çస్వరపరిచారు. ఈ పాటను ఉగాది పండగ సందర్భంగా ఆవిష్కరించారు. ‘‘ఆర్కే ఫిలింస్ నా సొంత బ్యానర్ లాంటింది. నా కెరీర్ ప్రారంభ దశలో ఈ బ్యానర్లోనే నటించాను. ఉగాది పండగపై చేసిన పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. బోలే షావళి అద్భుతంగా కంపోజ్ చేయగా, సింగర్ వరం బాగా పాడారు. ఈ పాటతో ఉగాది ముందే వచ్చినట్లు అనిపిస్తోంది’’ అన్నారు శివాజీరాజా. ‘‘మహిళలు ఎందులోనూ తక్కవ కాదనే కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. ఒక పల్లెటూరి అమ్మాయి భారతదేశం గర్వపడే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే కథ’ అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్. ముత్యాల రాందాస్, ఏడిద శ్రీరామ్, సింగర్ వరం, బోలే షావళి పాల్గొన్నారు. -
కొందరి ప్రయోజనాల కోసం బంద్ ఆపేస్తారా? – ఆర్. నారాయణమూర్తి
‘‘చిత్ర పరిశ్రమలో బ్రహ్మాస్త్రం లాంటి బంద్‌ను ఉపయోగించి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు ఏం సాధించారో అర్థం కావడం లేదు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు’’ అని మండిపడ్డారు ఆర్. నారాయణమూర్తి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చార్జీల విషయంలో చర్చలు విఫలమై ఈ నెల 2 నుంచి థియేటర్స్ బంద్ అయ్యాయి. చర్చలు తాత్కాలికంగా సఫలమై శుక్రవారం నుంచి థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. బంద్ ముగిసింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి్ మాట్లాడుతూ– ‘‘తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో ఇంకా బంద్ కొనసాగుతూనే ఉంది. ఐదేళ్ల తర్వాత ఫ్రీగా ఇస్తామంటూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చిన హమీలు అమలు కాకముందే హఠాత్తుగా బంద్ ఎందుకు విరమించుకున్నారు? ఈ బంద్ వల్ల సినీ కార్మికులు ఇబ్బందిపడ్డారు తప్ప ఒరిగింది ఏమీ లేదు. డిజిటల్ సర్వీస్ చార్జీలు తగ్గితే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో సంఘీభావం తెలిపాం. కానీ కొందరి ప్రయోజనాలు, స్వార్థం కోసం బంద్‌ను ఆపేస్తారా? దీనికోసమైతే సురేశ్‌బాబు, జెమిని కిరణ్, అల్లు అరవింద్ లాంటి పెద్దలు బంద్ వరకు వెళ్లకుండా ముందే మాట్లాడి సెటిల్ చేస్తే సరిపోయేది కదా? గతంలో రామానాయుడుగారు, దాసరి నారాయణరావుగారు లాంటి పెద్దలు పదిమంది నిర్మాతల మంచి కోరేవారు. ఐక్యత లేకపోవడం వల్ల గతంలో మేం చేసిన పోరాటాలు, నిరహార దీక్షల వల్ల సక్సెస్ సాధించలేకపోయాం. ఇప్పుడూ సక్సెస్ కాలేకపోయాం. ఇందుకు కారణం మేజర్ సెక్టార్ సపోర్ట్ లేకపోవడమే. తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కలగజేసుకుని చిన్న చిత్రాల నిర్మాతలకు న్యాయం చేయాలి. తక్కువ చార్జీలకే కొత్త కంపెనీలు వస్తు న్నా కొందరు రానివ్వడం లేదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జోక్యం చేసుకుని మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఉచితంగా ఇచ్చేంతవరకు బంద్ ఆపబోమని చెప్పి, రెండు వేల రూపాయలు తగ్గించగానే థియేటర్స్ బంద్ ఆపేశారు. ఇది కాదు మేం కోరుకున్నది’’ అన్నారు తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. -
కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి – ప్రతాని రామకృష్ణ గౌడ్
‘‘సౌత్ ఫిల్మ్ చాంబర్ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా 10 వేల థియేటర్స్‌ను బంద్ చేయటం రికార్డ్. ఈ బంద్‌కు సహకరించిన నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్ కార్మికులు.. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సిసి) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. డిజిటల్ సర్వీస్ (క్యూబ్, యూఎఫ్ఒ, పీఎక్స్‌డి) ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ దక్షిణ చలన చిత్రనిర్మాతలు థియేటర్ మూతకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ధియేటర్స్ క్లోజ్ అయ్యాయి. శనివారం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ‘‘డిజిటల్ వ్యవస్థపై పోరాటం చేస్తూ అన్ని రాష్ట్రాలు ఒకే తాటి మీదకు రావటం చాలా గ్రేట్. హిందీ సినిమాలకు ఇది వర్తించదు. బట్ వాళ్లు కూడా బంద్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వారు ఐదేళ్ల తర్వాత ఫ్రీ సర్వీస్ ఇస్తాం అని అగ్రిమెంట్ చేసి, ఇప్పుడు అధికంగా వసూలు చేస్తున్నారు. అగ్రిమెంట్‌కు కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి. మేం కొత్త సర్వీస్ ప్రొవైడర్స్‌ను తెచ్చుకుంటాం. ఇది తేలే వరకు బంద్ కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు. ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ 5 ఏళ్లే అగ్రిమెంట్ అని చెప్పి 13 సంవత్సరాలుగా నిర్మాతల రక్తాన్ని పీల్చుకుంటున్నారు. కోట్ల లాభాలు ఆర్జించారు. ఈ బంద్‌ను కంటిన్యూ చేయాలి. ఇది వారం రోజులైనా పది రోజులైనా ఒకే మాట మీద ఉందాం. చార్జీలు కొంత వరకు పెట్టినా ఓకే కానీ చిన్న సినిమాలకు జీరోగా నిర్ణయించాలి’’ అని టీఎఫ్íసీసీ సెక్రటరీ సాయి వెంకట్ అన్నారు. -
‘థియేటర్స్ బంద్‌కు అందరూ సహకరించాలి’
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ జాయింట్ యాక్షన్ కమిటీకి ధరల విషయంలో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి థియేటర్స్‌ను మూసివేయాలన్న నిర్మాతల నిర్ణయానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా శనివారం పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ– ‘‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి డిజిటల్ వ్యవస్థపై పోరాటం చేయడం శుభపరిణామం. శుక్రవారం బెంగళూరులో జరిగిన చర్చల్లో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థల వారు 9 శాతానికి మించి ధరలు తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. అసలు డిజిటల్ చార్జీలు 5 ఏళ్లకు మించి ఉండకూడదు. 13 ఏళ్లైనా అవే రేట్లు తీసుకుంటూ నిర్మాతలను ఇబ్బందిపెడుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా లేదు. క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్‌డి సంస్థలతో అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటే తక్కువ రేట్లకే డిజిటల్ సర్వీస్‌లు ప్రొవైడ్ చేస్తామని అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. కాబట్టి మార్చి 2 నుంచి ఈ థియేటర్స్ బంద్‌కు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. టీఎఫ్‌సీసీ సెక్రటరీ సాయి వెంకట్ కూడా పాల్గొన్నారు. -
ప్రేమలో చిక్కులు
జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా, నిక్కీ గల్రానీ, రక్షిత హీరోయిన్లుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘వీడి లవ్‌లో అన్నీ చిక్కులే’ అన్నది ఉపశీర్షిక. శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై వి.జయంత్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిన్నతనంలోనే నిర్మాతగా మారిన జయంత్ కుమార్‌ని అభినందిస్తూ, తనకు నిర్మాతగా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నిర్మాత వి.జయంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మా తాతగారి దగ్గర నుంచి మాకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్టైనర్ ఇది. హీరో జీవాగారు గెస్ట్ రోల్లో కనిపిస్తారు. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
సిన్సియర్ ప్రేమ
‘‘శీనుగాడి ప్రేమ’ సినిమా పాటలు, టీజర్ బాగున్నాయి. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఆర్.కేని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీనివాసరావు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘శీనుగాడి ప్రేమ’. ‘సిన్సియర్ రా మామా’ అన్నది ట్యాగ్ లైన్. ప్రణవి, కావేరి, చాందిని కథానాయికలు. రమణ సాకే స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను డైలాగ్స్ చెప్పే విధానం చూసిన డైరెక్టర్ హీరోగా నటించమన్నారు. కథ కూడా బాగుండటంతో నటించి, నేనే నిర్మించాను’’ అన్నారు. ‘‘శీను పేరున్న వారికి కనెక్టయ్యే కథాంశంతో ఈ సినిమా చేశాం. లవ్, కామెడీ, ఎమోషన్.. ఇలా ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి’’ అన్నారు ఆర్.కె. -
సస్పెన్స్ థ్రిల్లర్..
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి సరి కొత్త ఆలోచనలతో ఎందరో అడుగుపెడుతున్నారు. వైవిధ్యమైన సినిమాలు తీసి సక్సెస్ అవుతున్నారు. యంగ్ అండ్ డైనమిక్ టీం రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు సముద్ర అన్నారు. చెన్నకుని శెట్టి(కుమార్) దర్శకత్వంలో భరతవర్ష క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. వినోదంతో పాటు, విస్మయానికి గురి చేసే అంశాలున్నాయి’’ అన్నారు శెట్టి. ‘‘కొత్త ట్రెండ్ సృష్టించే అన్ని అంశాలు మా కథలో ఉన్నాయి’’ అన్నారు జి.వి.ఆర్.–4 మ్యూజిక్ అధినేత వి. గోపాలకృష్ణ. తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ , కార్యదర్శి సాయివెంకట్ పాల్గొన్నారు. -
అమ్మ ప్రేమ గొప్పది
‘‘తెలుగు గానా, తెలంగాణ అంటే ఇష్టం. హైదరాబాద్, అమరావతి కూడా చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం’’ అని కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల అన్నారు. కృష్ణుడు, సన ప్రధానపాత్రల్లో పి.ఉదయభాస్కర్ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మకు ప్రేమతో’. ఈ సినిమా పోస్టర్ని రాందాస్ అత్వాల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అమ్మకు ప్రేమతో’ మంచి టైటిల్. ఈ సినిమా సక్సెస్ కావాలి. తెలంగాణ ఉద్యమం సమయంలో నేను కేసీఆర్‌గారికి మద్దతు కూడా ప్రకటించాను’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో మంచి మనిషి, నిరంతరం ప్రజా సేవకై పాటుపడే వ్యక్తి రాందాస్ అత్వాలగారిని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్(టి.ఎఫ్.సి.సి) తరఫున సత్కరించడం గర్వంగా ఫీలవుతున్నాం. టి.ఎఫ్.సి.సి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మందికి హెల్త్ కార్డులు అందించాం. భవిష్యత్‌లో మరిన్ని పథకాలను రాందాస్ గారిద్వారా సాధిస్తాం’’ అన్నారు. -
అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల
సంచలన్ ఫిలింస్ పతాకం పై ప్రసాద్ లక్కన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల’. కథానాయికగా లీల నటించారు. ఈ సినిమా టీజర్‌ను ప్రతాని రామకృష్ణగౌడ్, పి. సత్యారెడ్డి, మోహన్ రెడ్డిలు ఆవిష్కరించారు. ప్రతాని మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ద్వారా ఆనందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు నిర్మాతకు నా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. దర్శక–నిర్మాత లక్కన ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘సినిమా చాలా పవర్ఫుల్ మీడియమ్. దీని ద్వారా ఆక్యూప్రెజర్ వైద్య విధానాన్ని చెప్పదలచుకున్నాం. వినోదంతో పాటు ఆరోగ్య సంబంధమెన ఆలోచనలు రేకెత్తించే సన్నివేశాలు ఉంటాయి’’ అని అన్నారు. శ్రీకర సంగమేశ్వరా, యార్లగడ్డ శైలజ, రమణ చాందిని తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: ఆనంద్, ఎడిటింగ్: వర్మ, కథ–మాటలు: విద్వాన్ ప్రసాద్. -
డిజిటల్ చార్జీలు తగ్గించాల్సిందే
డిజిటల్ రేట్స్ అండ్ థియేటర్స్ లీజ్ విధానంపై ఇండస్ట్రీకి అనుకూలంగా మార్చి 31లోపు సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసివేయడంతోపాటు, షూటింగ్‌లను బంద్ చేయాలనుకుంటున్నట్లు ఇటీవల తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, వైస్ ప్రెసిడెంట్ అలీఖాన్, నిర్మాత సాయివెంకట్ మద్దతు తెలిపారు. మంగళవారం పాత్రికేయుల సమావేశంలో ప్రతాని మాట్లాడుతూ– ‘‘తమిళనాడు, కర్ణాటక, ముంబైలలో డిజిటల్ చార్జీలు వారానికి 2500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో 13వేలు వసూలు చేస్తున్నారు. ఈ విధానంలో మార్పు రావాలి’’ అన్నారు. ‘‘ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’’ అన్నారు సాయి వెంకట్. -
జయహో రామానుజ
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఆధారంగా కొన్ని చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరో చిత్రం సిద్ధమవుతోంది. శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమల దేవస్థాన నిర్మాణం, వెంకటేశ్వర స్వామి మహిమలను కళ్లకు కట్టినట్లుగా చూపించనున్నారు దర్శక–నిర్మాత సాయివెంకట్. స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జయహో రామానుజ’. ఈ చిత్రం లోగోను హైదారాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా గాయకుడు జే.యల్. శ్రీనివాస్‌ను హాలీవుడ్లో బతుకమ్మ పాట పాడినందుకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలచారి, నటి కవిత, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు. -
ప్రేమ.. భయం
జితేందర్, రాకేష్, ‘వైరస్’ సినిమా ఫేమ్ గీతా షా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఐటమ్’. íసిరి సంపద సమర్పణలో నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సమర్పకులు రాఘవేంద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ ఇచ్చారు. నటి కవిత గౌరవ దర్శకత్వం వహించారు. నాగరాజు తలారి మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. హారర్ ఎలిమెంట్స్ జోడించాము. ఈ నెల 20న తొలి షెడ్యూల్ ప్రారంభించి జనవరి 15 వరకు చేస్తాం. మార్చి ఎండింగ్లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి బైపల్లి. -
ప్రేమ పందెంలో గెలుపు ఎవరిది?
‘‘చిన్న సినిమాలు చాలావరకు ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ షూటింగ్ దశలోనే ఆగిపోతున్నాయి. లక్ష్మీనారాయణగారికిది తొలి సినిమా అయినా షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదల చేస్తుండడం అభినందనీయం. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. శ్రవణ్, మీనాక్షి గోస్వామి జంటగా ఎం.ఎం. అర్జున్ దర్శకత్వంలో ఎం. లక్ష్మీనారాయణ నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చెప్పిన కథలో ఓ చిన్న పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. అదేంటో సినిమాలోనే చూడాలి. మా యూనిట్ సభ్యుల సహకారం వల్లే అను కున్నట్లు నిర్మించగలిగాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ప్రేమపందెం’ కేవలం యూత్ మూవీ కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు అర్జున్. తెంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి యన్. సాయివెంకట్, సంగీత దర్శకుడు వెంకట్ ఎస్.వి.హెచ్. పాల్గొన్నారు. ఈ సినిమాకి సహకారం: శరత్సాగర్, కో–ప్రొడ్యూసర్: ఓబయ్య సోమిరెడ్డిపల్లె. -
గులాబీ అంటే హిట్టే!
‘‘అల్లు వంశీ, అక్షర జంటగా బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో లెంకల అశోక్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘గులాబీ మేడ’. సాకేత్ నాయుడు స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ– ‘‘గులాబి’ టైటిల్‌తో వచ్చిన గత సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ‘గులాబీ మేడ’ కూడా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. దసరా నుంచి చిన్న సినిమాల కోసం 5వ ఆటకు అనుమతి ఇచ్చారు’’ అన్నారు. ‘‘అశోక్రెడ్డిగారు, నేను ఒక మంచి సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మంచి కథ కుదరడంతో ‘గులాబీ మేడ’ తీశాం. అశోక్రెడ్డిగారు ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు బొండా వెంకటస్వామినాయుడు. -
సినీ సమస్యల పరిష్కారానికి స్క్రీనింగ్ కమిటీ
‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఏర్పాటుకి రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. చిత్రసీమలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేశారు. సినీ కార్మికుల్లో సంతోషాన్ని నింపుతున్న కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు టీఎఫ్‌సీసీ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్. టీఎఫ్‌సీసీ ఏర్పాటై రెండేళ్లు పూరై్తన సందర్భంగా ఉపాధ్యక్షులు రంగా రవీంద్రగుప్తా, కార్యదర్శి ‘లయన్’ సాయివెంకట్లతో కలసి రామకృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘‘టీఎఫ్‌సీసీలో వెయ్యిమంది నిర్మాతలు, ఇతర శాఖలను కూడా కలుపుకుని సుమారు 3000 మంది సభ్యులున్నారు. వారందరికీ హెల్త్ కార్డులు, సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ ఇప్పించనున్నాం. చిన్న చిత్రాలకు ఐదవ ఆట, చిత్రపురి కాలనీలో ఇల్లు లేనివారికి 9 ఎకరాల కేటాయింపు, ప్రభుత్వం తరపున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు వంటివి సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో జీవో వస్తుంది’’ అని రామకృష్ణగౌడ్ తెలిపారు. -
లీజు విధానాన్ని ఎత్తివేయాలి!
‘‘చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోంది. తక్షణమే థియేటర్ల లీజు విధానాన్ని ఎత్తివేయాలి’’ అని తెలంగాణ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. శనివారం మొదలుపెట్టి గత మూడు రోజులుగా పలువురు చిన్న చిత్రాల నిర్మాతలతో కలిసి ఆయన దీక్ష చేస్తున్నారు. రామకృష్ణ గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఇతర నిర్మాతలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. థియేటర్ల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలనీ, గతంలో మాదిరిగా ప్రతి థియేటర్లోనూ మార్నింగ్ షోను చిన్న చిత్రాలకు కేటాయించాలనీ రామకృష్ణ కోరారు. ఇంకా చిన్న నిర్మాతలకు ఎదురవుతున్న పలు ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామనీ, సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు.