ప్రతాని రామకృష్ణ, నారాయణమూర్తి
‘‘చిత్ర పరిశ్రమలో బ్రహ్మాస్త్రం లాంటి బంద్‌ను ఉపయోగించి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు ఏం సాధించారో అర్థం కావడం లేదు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు’’ అని మండిపడ్డారు ఆర్. నారాయణమూర్తి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చార్జీల విషయంలో చర్చలు విఫలమై ఈ నెల 2 నుంచి థియేటర్స్ బంద్ అయ్యాయి. చర్చలు తాత్కాలికంగా సఫలమై శుక్రవారం నుంచి థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. బంద్ ముగిసింది.
ఈ సందర్భంగా దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి్ మాట్లాడుతూ– ‘‘తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో ఇంకా బంద్ కొనసాగుతూనే ఉంది. ఐదేళ్ల తర్వాత ఫ్రీగా ఇస్తామంటూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చిన హమీలు అమలు కాకముందే హఠాత్తుగా బంద్ ఎందుకు విరమించుకున్నారు? ఈ బంద్ వల్ల సినీ కార్మికులు ఇబ్బందిపడ్డారు తప్ప ఒరిగింది ఏమీ లేదు. డిజిటల్ సర్వీస్ చార్జీలు తగ్గితే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో సంఘీభావం తెలిపాం.
కానీ కొందరి ప్రయోజనాలు, స్వార్థం కోసం బంద్‌ను ఆపేస్తారా? దీనికోసమైతే సురేశ్‌బాబు, జెమిని కిరణ్, అల్లు అరవింద్ లాంటి పెద్దలు బంద్ వరకు వెళ్లకుండా ముందే మాట్లాడి సెటిల్ చేస్తే సరిపోయేది కదా? గతంలో రామానాయుడుగారు, దాసరి నారాయణరావుగారు లాంటి పెద్దలు పదిమంది నిర్మాతల మంచి కోరేవారు. ఐక్యత లేకపోవడం వల్ల గతంలో మేం చేసిన పోరాటాలు, నిరహార దీక్షల వల్ల సక్సెస్ సాధించలేకపోయాం. ఇప్పుడూ సక్సెస్ కాలేకపోయాం. ఇందుకు కారణం మేజర్ సెక్టార్ సపోర్ట్ లేకపోవడమే.
తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కలగజేసుకుని చిన్న చిత్రాల నిర్మాతలకు న్యాయం చేయాలి. తక్కువ చార్జీలకే కొత్త కంపెనీలు వస్తు న్నా కొందరు రానివ్వడం లేదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జోక్యం చేసుకుని మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఉచితంగా ఇచ్చేంతవరకు బంద్ ఆపబోమని చెప్పి, రెండు వేల రూపాయలు తగ్గించగానే థియేటర్స్ బంద్ ఆపేశారు. ఇది కాదు మేం కోరుకున్నది’’ అన్నారు తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్.
Comments
Please login to add a commentAdd a comment