ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్ చాంబర్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో ఏ ప్యానల్ గెలిచినా 80శాతం నిర్మాతలకు ఉన్న కష్టాలను తీర్చాలి. సినిమాలు నిర్మించి చాలా మంది లాస్ అవుతున్నారు. క్యూబ్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించాలి. పండగ సెలవుల్లో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చిన్న సినిమాలకు అవకాశాలు రావడం లేదు. సగటు సినిమాలకు కూడా అవకాశం కల్పించాలి. థియేటర్స్‌కి మార్నింగ్ షో సమస్యలు తీర్చాలి. ప్రస్తుతం కొద్ది మంది చేతుల్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. చిన్న నిర్మాతలను ఆదుకోండి’ అని నారాయణ మూర్తి అన్నారు.
టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మరికాసేపట్లో ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment