Muthyala Ramadasu
-
టాలీవుడ్ మీటింగ్, హాజరైన రాజమౌళి!
సాక్షి, హైదరాబాద్: సినీపరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఆది శేషగిరిరావు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు.. ఇలా అన్ని రంగాల నుంచి ఆయా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై చర్చించనున్నాం. పరిశ్రమలోని అన్ని వ్యవస్థల సభ్యులను ఆహ్వానించాం. గత రెండేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నింటిపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గంటన్నర పాటు అన్ని విషయాలపై చర్చించుకోనున్నాం. ఇది చిత్ర పరిశ్రమ మంచి కోసం ఏర్పాటు చేసిన భేటీ' అని పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. 'క్యూబ్, టికెట్ రేట్లు, చిత్ర పరిశ్రమ అంతర్గత విషయాలు చర్చకు వస్తాయి. ఏపీ ప్రభుత్వంతో జరిగిన మీటింగ్ విషయాలను సైతం చర్చిస్తాము. పూర్తి వివాదరహితంగా సమావేశం ఉంటుందని ఆశిస్తున్నాము' అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించనున్నాం. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా, ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగేదే ఇండస్ట్రీ సమావేశం' అని తెలిపారు. ఎస్ఎస్ రాజమౌళి, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి, నవీన్, బివిఎస్ఎసన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్ , తమ్మారెడ్డి భరధ్వాజ, ముత్యాల రాందాస్ ,మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలను చర్చించిన విషయం తెలిసిందే! ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే టాలీవుడ్ ప్రతినిధులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అదృష్టం వచ్చేలోపే ఆపద
రమాకాంత్ హీరోగా మోనల్, సిమర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సముద్రుడు’. కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బాదావత్ కిషన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామోజీ జ్ఞానేశ్వర్, పి. రామారావు, సోములు సహ–నిర్మాతలు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు రమేష్ వర్మ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత ముత్యాల రామదాసు కెమెరా స్విచ్చాన్ చేశారు. మల్టీడైమెన్షన్ వాసు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు నగేష్ మాట్లాడుతూ– ‘‘ప్రాణాలతో నిత్యం చెలగాటాలాడుతూ కష్టాలు అనుభవిస్తున్న జాలర్లకు అదృష్టం రాబోయే సమయంలో ఓ ఆపద వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలతో సినిమా సాగుతుంది’’ అని అన్నారు. ‘‘అన్ని రకాల ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాం. స్క్రిప్ట్ కోసం నగేష్ ఆరునెలలు కష్టపడ్డారు’’ అన్నారు రమాకాంత్. ‘‘ఇదివరకు నగేష్‌తో ‘శ్రీసత్యన్నారాయణ వ్రతం’ అనే సినిమా చేశాను. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నా’’ అన్నారు సుమన్. ‘‘ఎన్ఆర్ఐ పాత్ర చేస్తున్నా’’ అన్నారు మోనల్. ‘‘టీచర్ రోల్లో కనిపిస్తా’’ అన్నారు సిమర్. -
అవయవాలతో వ్యాపారం
లక్ష్మీకాంత్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఆర్గాన్స్’. సందీప్తి, శ్రీలక్ష్మి, ప్రసాద్ రెడ్డి, మోహన్ ఇతర పాత్రల్లో నటించారు. రవికిరణ్ దర్శకత్వం వహించారు. రాజ్ కిరణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత ముత్యాల రామదాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆర్గాన్స్’ డిఫరెంట్ టైటిల్. అవయవ దానం చేయడం అనే మంచి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ అయి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఆర్గాన్స్’ నా మొదటి చిత్రం. మా సినిమా చూసిన వారు కంటతడి పెట్టుకుంటారు. ఇందులో అవయవదానంతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది’’ అన్నారు రవికిరణ్. ‘‘మనిషి జీవించడానికి అవయవాలు ఎంతో ప్రధానం. కొందరు వాటిని తమ స్వార్థానికి వ్యాపారంగా మార్చేశారు. అలాంటి వాళ్లను హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడన్నదే కథ. సెన్సార్ పూర్తయింది. త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు బత్తుల లక్ష్మీనారాయణ. ∙సందీప్తి, లక్ష్మీకాంత్ -
పల్లెటూరి అమ్మాయి.. దేశం గర్వపడేస్థాయి!
రచన స్మిత్ ప్రధాన పాత్రలో ఆర్కే ఫిలింస్ పతాకంపై రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మహిళా కబడ్డి’. రీసెంట్గా విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూడు పాటలకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఆడియో సక్సెస్‌మీట్‌లో నిర్మాత ముత్యాల రాందాస్ మాట్లాడుతూ –‘‘రామకృష్ణగౌడ్గారు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో చాలాకాలం తర్వాత నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. మహిళలు ఎందులో తక్కువకాదనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఒక పల్లెటూరి అమ్మాయి దేశం గర్వపడేస్థాయి కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగింది అన్నదే కథాంశం. మధుప్రియ, మంగ్లీ, గీతామాధురి పాడిన పాటలకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. మరో రెండు పాటలను మధుప్రియ, గీతా మాధురితో పాడించి త్వరలోనే విడుదల చేస్తాం. ఈ సినిమాతో రాజ్‌కిరణ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి బ్రేక్ వస్తుంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది’’ అన్నారు రామకృష్ణగౌడ్ . ఈ సినిమాకు కెమెరా: రాజు. -
రేపటి నుంచి సినిమాల ప్రదర్శన బంద్
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(క్యూబ్, యూఎఫ్ఓ) వసూలు చేస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) తగ్గించనందుకు నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)’ స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రాందాస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్లోకి మారుతూ వచ్చింది. వీపీఎఫ్ నామమాత్రమే చెల్లించండి.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పిన క్యూబ్, యూఎఫ్ఓ యాజమాన్యాలు ఇప్పుడు మాట మారుస్తున్నాయి. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్నూ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ చిత్రవర్గాలు నిర్మాత డి.సురేశ్‌బాబు చైర్మన్‌గా, నిర్మాత కిరణ్ కన్వీనర్‌గా ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ని 25శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఫీజును 10 శాతం తగ్గిస్తామని వారు అంటే ఒప్పుకోలేదు. ఫిబ్రవరి 23న బెంగళూరులో మరో సమావేశం నిర్వహించగా, 9శాతం మాత్రమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే ఓ వ్యక్తి ‘ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ’ అని వ్యంగ్యంగా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయాడు. మా డిమాండ్లకు ఒప్పుకోకుంటే మార్చి 2నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని వారికి స్పష్టం చేశాం. మా నిర్ణయానికి సౌత్ ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా క్యూబ్, యూఎఫ్ఓ కంపెనీలు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు మా డిమాండ్లు ఒప్పుకుంటే సినిమాల ప్రదర్శన ఉంటుంది. వారు ఒప్పుకున్నా కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వెనకడుగు వేయం’’ అన్నారు. -
ఆకాశంలో అగ్నిజ్వాలలు
మూడువందల మంది ప్రయాణీకులతో ఆ విమానం ఆకాశానికి ఎగిరింది. సురక్షితంగా గమ్యం చేరుకుంటుందనే సమయంలో ఓ ప్రమాదం జరుగుతుంది. దాంతో సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఏరోప్లేన్ వర్సెస్ వోల్కనోస్’. ఈ చిత్రాన్ని ‘అగ్ని జ్వాలలు’ పేరుతో శ్రీ వెంకటసాయి ఫిలింస్ అధినేత ముత్యాల రామదాసు తెలుగులోకి విడు దల చేస్తున్నారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ -‘‘మరణానికి చేరువ అవుతున్నామనే సమయంలో విమానంలోని ప్రయాణీకులను ఓ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఎలా కాపాడాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ఏప్రిల్ 4న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి జేమ్స్ కాన్‌డెలిక్, జాన్ కాన్‌డెలిక్ దర్శకులు.