సాక్షి, హైదరాబాద్: సినీపరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఆది శేషగిరిరావు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు.. ఇలా అన్ని రంగాల నుంచి ఆయా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై చర్చించనున్నాం. పరిశ్రమలోని అన్ని వ్యవస్థల సభ్యులను ఆహ్వానించాం. గత రెండేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నింటిపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గంటన్నర పాటు అన్ని విషయాలపై చర్చించుకోనున్నాం. ఇది చిత్ర పరిశ్రమ మంచి కోసం ఏర్పాటు చేసిన భేటీ' అని పేర్కొన్నారు.
ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. 'క్యూబ్, టికెట్ రేట్లు, చిత్ర పరిశ్రమ అంతర్గత విషయాలు చర్చకు వస్తాయి. ఏపీ ప్రభుత్వంతో జరిగిన మీటింగ్ విషయాలను సైతం చర్చిస్తాము. పూర్తి వివాదరహితంగా సమావేశం ఉంటుందని ఆశిస్తున్నాము' అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించనున్నాం. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా, ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగేదే ఇండస్ట్రీ సమావేశం' అని తెలిపారు.
ఎస్‌ఎస్ రాజమౌళి, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి, నవీన్, బివిఎస్ఎసన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్ , తమ్మారెడ్డి భరధ్వాజ, ముత్యాల రాందాస్ ,మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలను చర్చించిన విషయం తెలిసిందే! ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే టాలీవుడ్ ప్రతినిధులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment