గ్రహాంతరవాసుల సీక్రెట్స్‌ రష్యాకు తెలుసా..? | Sakshi
Sakshi News home page

గ్రహాంతరవాసుల సీక్రెట్స్‌ రష్యా, యూఎస్‌ ఎందుకు దాస్తున్నాయి..?

Published Sat, Jun 15 2024 3:15 PM

Russia Hiding Aliens Secrets Is Still Mystery

గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అన్న అంశంపై దశాబ్ధాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యాలో ఎందరో పరిశోధకులు గ్రహాంతరవాసుల విషయంలో ఆసక్తికర పరిణామాలకు సాక్షులుగా ఉన్నారు. గ్రహాంతర వాసులు కొన్నేళ్ల క్రితం వరకు అయితే కేవలం ఊహాజనితమైన జీవులు. 

కానీ కొన్ని పరిశోధనల్లోనూ...కొందరి అనుభవాల్లోనూ చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారని తెలుస్తోంది. అగ్రరాజ్యాలు మాత్రం గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకో దాచి పెడుతున్నాయంటున్నారు పరిశోధకులు. ఈ విషయంలో అమెరికా, రష్యా రెండూ దొందూ దొందే అంటున్నారు వారు.

పదిహేనేళ్ల క్రితం నాటి  మాట..
రష్యాలో గ్రహాంతర వాసులను ప్రత్యక్షంగా చూసిన  నేవీ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇంత వరకు రష్యాలోని పుతిన్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. అయితే కొందరు అధికారుల ద్వారా అసలు విషయం లీక్ కావడంతో యుఎఫ్‌వో(అన్‌ ఐడెంటిఫైడ్‌ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్స్‌)లపై  పరిశోధనలు చేస్తున్నవారికి కావల్సినంత మేత దొరికినట్లయ్యింది.

అసలేం జరిగిదంటే..

2009 జులైలో రష్యా నావికాదళానికి చెందిన ఓ సబ్ మెరైన్   సాగర గర్భంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా  డిస్క్ ఆకారంలో ఉన్న  ఆరు వస్తువులు అత్యంత వేగంగా సబ్ మెరైన్ పక్కనుంచి వెళ్లడాన్ని దాని పైలట్‌ గమనించాడు. అవి నీటి గర్భంలో గంటకు 256 మైళ్ల వేగంతో దూసుకుపోవడాన్ని గమనించి సబ్ మెరైన్ పైలట్ ఆశ్చర్యపోయాడు.

సబ్ మెరైన్ లోని ఇతర సిబ్బందికి విషయం చెప్పాడు. ఆ ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎవరివి? శత్రుసేనలవా? అని వారు కంగారు పడ్డారు. ఆ ఆరు డిస్క్ లు విష్ణు చక్రాల్లా గిర గిరా తిరుగుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. అవి ఏవైనా వాహనాలా? కొత్త రకం సబ్ మెరైన్ లా? అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. 

అవి మరోసారి సబ్ మెరైన్ కు సమీపం నుంచి దూసుకుపోయాయి. పైలట్ లో భయం మొదలైంది. ఎందుకొచ్చిందని సబ్ మెరైన్ ను అమాంతం నీటి ఉపరితలానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత చూస్తే సాగర గర్భం నుంచి ఆ ఆరు వస్తువులు వేగంగా నీటి ఉపరి తలానికి దూసుకురావడమే కాకుండా గాల్లోకి ఎగిరి వేగంగా ఆకాశంవైపు వెళ్లిపోయాయి.

ఆ డిస్కులు కచ్చితంగా గ్రహాంతర వాసులు ప్రయాణించే అంతరిక్ష నౌకలే కావచ్చునని  నేవీ అధికారులు భావించారు.అంతరిక్షంలో ఎగరడమే కాదు నీటి గర్భంలోకి దూసుకుపోవడం అంటే  గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానం  ఎంత అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

తాము చూసిన దాన్ని సబ్‌మెరైన్‌ సిబ్బంది నేవీలోని  ఇతర సహచరులకు చెప్పారు. చాలా మంది నమ్మలేదు. కానీ తర్వాత వారు దానిపై ఓ నివేదిక రూపొందించి ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ నివేదికను రష్యా ప్రభుత్వం చాలా సీక్రెట్‌గా  దాచి పెట్టింది.అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ పరిశోధకులకు అర్ధం కావడంలేదు. 

27 ఏళ్ల కిందట బైకాల్‌ సరస్సులో వింత ఆకారాలు

ఈ ఘటనకు 27 సంవత్సరాల క్రితం 1982లో సైబీరియా ప్రాంతంలో  మరో  సంచలన ఘటన. బైకాల్ సరస్సులోకి ఏడుగురు డైవర్లు దూకి నీటి అడుక్కి వెళ్లారు. వారు 50 మీటర్ల దూరం వెళ్లే సరికి తమని ఎవరో గమనిస్తున్నారన్న అనుమానం వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన డైవర్లు ఆశ్చర్యం..భయంతో  ఉండిపోయారు. 

వారిని భారీ పరిమాణంలో ఉన్న  ఓ వింత ఆకారం చూస్తోంది. ఆ ఆకారం మనిషి పోలికలతో ఉంది. కాకపోతే హెల్మెట్  వంటి పరికరాన్ని ధరించినట్లు  ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి  వింత మానవ ఆకారాలు కనిపించాయి. మనుషుల్లాగే కాళ్లూ చేతులతో ఉన్న ఆ జీవులు 9 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఆ  జీవులను చూసి  విస్తుపోయిన డైవర్లు ధైర్యం చేసి ఓ  ఆకారాన్ని పట్టుకోడానికి ప్రయత్నించారు.

ఊహించని విధంగా పెద్ద శక్తి  ఆ డైవర్లను అమాంతం నీటి ఉపరితలం వైపుకు చాలా బలంగా నెట్టేసింది. అంతటి శక్తి ఆ ఆకారాలకు ఎలా సాధ్యమైందో డైవర్లకు అర్ధం కాలేదు. ఆ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు నీటి కింద ఆక్సిజన్ సిలెండర్ల అవసరం లేకుండా  ఆ జీవులు ఎలా ఉండగలుగుతున్నాయో  అర్ధం కాలేదు.

గడ్డ కట్టుకుపోయే నీటిలోనూ ఆ జీవిలు మనుగడ సాగించగలగడం ఎలా సాధ్యమో  తెలియలేదు. అవి కచ్చితంగా ఏదో ఓ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులేనని  డైవర్లు భావిస్తున్నారు. వారు తాము చూసింది చూసినట్లు పూసగుచ్చి  అధికారులకు వివరించారు. దాన్ని ఓ నివేదిక గా రూపొందించారు. ఈ నివేదిక కూడా రష్యాప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నాలుగు దశాబ్దాలు దాటినా ఈ నివేదికను గుట్టుగా ఉంచడం వెనుక కారణాలేంటో  అర్ధం కావడం లేదంటున్నారు పరిశోధకులు.

ఈ గ్రహాంతర వాసులేంటో..వారి శక్తి సామర్ధ్యాలేంటో.. వారి స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రత్యేకతలేంటో అంటూ సైంటిస్టులు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు.  మనం చూడలేదు కాబట్టి గ్రహాంతర వాసులు లేరని ఎలా అనేయగలం? అంటున్నారు  గ్రహాంతర వాసులపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న వారు. ఇటువంటి ఘటనలు రష్యాలో చాలానే చోటు చేసుకున్నాయని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం  ఓ సీక్రెట్  రీజన్ తోనే వాటిని దాచి పెడుతోందని వారు అభిప్రాయ పడుతున్నారు.

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement