న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్, కాల్స్ నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టెలికం శాఖ (డాట్) ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాల్స్ నాణ్యతను మెరుగుపర్చేందుకు, కాల్ డ్రాప్స్‌ను కట్టడి చేసేందుకు సేవల నాణ్యత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సూచించింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో సేవల నాణ్యత (క్యూఓఎస్) చాలా ముఖ్యమని డాట్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
క్యూఓఎస్ విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలను పరిశీలించిన మీద ట ట్రాయ్ కొన్ని కీలక అంశాలను ట్రాయ్‌కు సిఫార్సు చేసిందని పేర్కొన్నాయి. కాల్ డ్రాప్, కాల్స్ నాణ్యత అంశాలపై ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించిన మీదట డాట్ ఈ మేరకు సూచనలు చేసింది. మరోవైపు, సర్వీసుల నాణ్యత, నిబంధనల సమీక్ష, 5జీ సేవల ప్రమాణాలు, అవాంఛిత వాణిజ్య సందేశాలు మొదలైన వాటికి సంబంధించి తీసుకోతగిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఫిబ్రవరి 17న టెల్కోలతో ట్రాయ్ సమావేశం కానుంది.
అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను టెల్కోలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 5జీ సేవలతో కాల్ నాణ్యత మెరుగుపడుతుందని ఆశించినప్పటికీ.. పరిస్థితి మరింతగా దిగజారిందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లోకల్‌సర్కిల్స్ సంస్థ జనవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం కాల్ నాణ్యత అస్సలు మెరుగుపడలేదని 42 శాతం మంది, మరింతగా దిగజారిందని 19 శాతం మంది 5జీ యూజర్లు వెల్లడించారు.
ఓటీటీల నియంత్రణకు టెల్కోల పట్టు..
కమ్యూనికేషన్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థల నియంత్రణకు గట్టి నిబంధనలు రూపొందించాలని ట్రాయ్‌ని టెల్కోలు మరోసారి కోరాయి. ఒకే రకం సేవలు అందించే సంస్థలకు ఒకే రకం నిబంధనలు ఉండాలని పేర్కొన్నాయి. తమలాంటి సేవలే అందిస్తున్న ఓటీటీలకు కూడా తమకు అమలు చేసే నిబంధనలను వర్తింపచేయాలని స్పష్టం చేశాయి. 2023 అజెండాపై కసరత్తుకు సంబంధించి ట్రాయ్‌తో బుధవారం జరిగిన భేటీలో టెల్కోలు ఈ మేరకు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా, ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్, వొడాఫోన్ ఐడియా కార్పొరేట్ వ్యవహారాల అధికారి పి. బాలాజీ ఈ భేటీలో పాల్గొన్నారు.
(ఇదీ చదవండి: జీఎస్‌టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..)
Comments
Please login to add a commentAdd a comment