data sharing
-
మస్కా మజాకా!
తన ‘తప్పట్టం’ సినిమా పోస్టర్‌ను ‘వరల్డ్–ఫేమస్’ చేసినందుకు ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు తమిళ చిత్ర నిర్మాత ఆదమ్ భవా. ‘హౌ ఇంటెలిజెన్స్ వర్క్స్’ కాప్షన్‌తో డిజైన్ చేసిన మీమ్ పోస్టర్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశాడు మస్క్. ఈ పోస్టర్లో ఇద్దరు నటులు కొబ్బరి నీటిని షేర్ చేసుకుంటూ కనిపిస్తారు. ఈ కొబ్బరినీటి షేరింగ్‌ను యాపిల్, ఓపెన్ ఏఐల మ«ధ్య డేటా షేరింగ్ డైనమిక్స్‌తో పోల్చుతుంది ఈ మీమ్. అంత పెద్ద ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో ‘తపట్టం’ సినిమా పోస్టర్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. లక్షల వ్యూస్‌తో దూసుకు పోతుంది. ఈ పోస్టర్ పుణ్యమాని యాపిల్–ఓపెన్ ఏఐ భాగస్వామ్యం గురించి చర్చ కూడా జరుగుతుంది. -
వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వీఐ మ్యాక్స్ ప్లాన్లలో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: టెలికం సేవల సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) కొత్తగా మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో రెండు కొత్త ఫీచర్లను జోడించింది. డేటా షేరింగ్, నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా వీటిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ పరిమితికి మించి 10 జీబీ నుంచి 25 జీబీ వరకు డేటాను అదనంగా పొందవచ్చు. దీన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక రాత్రి 12 గం. నుంచి ఉదయం 6 గం. వరకు ఉండే నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా ఫీచర్‌ని మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం మీద రూ. 601 మ్యాక్స్ ఫ్యామిలీ ప్లాన్‌లో 2 కనెక్షన్లతో 120 జీబీ డేటా పొందవచ్చు. అంతకు పైబడిన ప్లాన్లలో 325 జీబీ వరకు పొందవచ్చు. -
6 అంశాల్లో సహకారంపై WEF - రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం
-
ఆ ఆరోపణలు నిరాధారమైనవి: టిక్‌టాక్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధంగా యూజర్ల డేటాను సేకరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను షార్ట్–వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఖండించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొంది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ సంస్థలో భాగమైన టిక్‌టాక్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. యూజర్ల డేటా భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించింది. యూజర్ల డేటాను టిక్‌టాక్ చట్టవిరుద్ధంగా సేకరించి .. చైనాకు పంపుతోందని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యని లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆరోపించిన నేపథ్యంలో టిక్‌టాక్ తాజా వివరణనిచ్చింది. తమపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు చైనాలో లేవని, అక్కడి ప్రభుత్వానికి, చైనా టెలికం సంస్థకు గానీ టిక్‌టాక్ యూజర్ల డేటా లభించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారతీయ యూజర్ల డేటాను అమెరికా, సింగపూర్‌లోని ప్రముఖ థర్డ్ పార్టీ డేటా సెంటర్స్‌లో భద్రపరుస్తున్నట్లు టిక్‌టాక్ తెలిపింది. -
మరో వివాదంలో ఫేస్బుక్
‘నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. కాబట్టి నా వివరాలేవీ వాళ్లకు తెలియవు’ అన్న ధీమాలో మీరుంటే పొరపాటు పడ్డట్టే! మీకు ఫేస్బుక్ ఖాతా లేకపోయినా, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడే ఇతర యాప్‌ల ద్వారా మీ గుట్టంతా ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్‌కు వెళ్లిపోతోందట. బ్రిటన్‌కు చెందిన ప్రైవసీ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అనేక యాప్స్‌ను వాడుతుంటారు. వాళ్లు ఏ యాప్‌ను ఓపెన్ చేసినా వారి సమాచారం అంతా ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్‌కు చేరిపోతోందని ఈ అధ్యయనంలో తేలింది. ఫేస్బుక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్(ఎస్డీకే) ద్వారా ఈ యాప్ డెవలపర్లు యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నారు. గతేడాది ఆగస్టు–డిసెంబర్ నెలల మధ్య కోటి నుంచి 50 కోట్లమంది యూజర్లు వాడుతున్న 34 యాప్‌లను పరిశీలించిన అనంతరం ప్రైవసీ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ జాబితాలో డ్యుయోలింగో, ట్రిప్ అడ్వైజర్, ఇన్‌డీడ్, స్కైస్కానర్ వంటి యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌లు ప్రధానంగా ఎలాంటి సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు అందజేస్తున్నాయో కూడా ఈ సంస్థ విశ్లేషించింది. 61 శాతం యాప్స్‌ను యూజర్లు ఓపెన్‌చేయగానే వారి సమాచారం ఫేస్‌బుక్‌కు చేరిపోతుందని తెలిపింది. ఈ యాప్స్ పంపిన సమాచారాన్ని గూగుల్ అడ్వర్టైజింగ్ ఐడీ ద్వారా ఇతరులు పంచుకుంటున్నారని వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా ప్రకటనకర్తలు యూజర్ల ప్రొఫైల్స్‌ను రూపొందించి వారికి అనుకూలమైన, ఆసక్తి కలిగించే ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొంది. జర్మనీలోని లీపింగ్లో జరిగిన కాస్ కంప్యూటర్ కాంగ్రెస్‌లో ప్రైవసీ ఇంటర్నేషనల్ ఈ నివేదికను సమర్పించింది. ఇదంతా మామూలే: ఫేస్బుక్ ప్రైవసీ ఇంటర్నేషనల్ నివేదికపై ఫేస్బుక్ స్పందించింది. యూజర్ల సమాచారాన్ని కంపెనీలు పంచుకోవడమన్నది చాలా మామూలు విషయమని తెలిపింది. దీనివల్ల వినియోగదారులతో పాటు కంపెనీలకు కూడా లాభం చేకూరుతుందని వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా డెవలపర్లు తమ యాప్‌ను మరింత బాగా తయారుచేయగలరంది. -
ఆ కంపెనీలతో ఎఫ్బీ సీక్రెట్ డేటా షేరింగ్
న్యూయార్క్ : ఫేస్బుక్ యూజర్ల డేటాపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన పరిశోధానాత్మక నివేదిక మరింత గుబులు రేపుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి కంపెనీలు యూజర్ల సమాచారాన్ని వారి అనుమతి లేకుండా పొందే వెసులుబాటు కల్పిస్తూ ఆయా కంపెనీలతో ఫేస్బుక్ ప్రత్యేక డేటా షేరింగ్ ఒప్పందాలు చేసుకుందని ఈ నివేదిక పేర్కొంది. బడా టెక్ కంపెనీలు, ఈ రిటైల్ దిగ్గజాలు సహా 150కి పైగా కంపెనీలతో ఫేస్బుక్ డేటా షేరింగ్ ఒప్పందాలు చేసుకుందని వెల్లడించింది. యూజర్లందరి పేర్లను వారికి తెలియకుండానే చూసేందుకు మైక్రోసాఫ్టబింగ్ను ఫేస్బుక్ అనుమతిస్తోంది. యూజర్ల ప్రైవేట్ మెసేజ్‌లను చదవడం, రాయడం, డిలీట్ చేసేందుకూ స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్‌లను ఫేస్బుక్ అనుమతిస్తోంది. మరోవైపు యూజర్ డేటాను తమ ఫోన్ల ద్వారా సేకరించే క్రమంలో ఎవిడెన్స్‌ను దాచేందుకూ ఎఫ్బీ యాపిల్‌కు వెసులుబాటు కల్పిస్తోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెజాన్, యాహూ, మైక్రోసాఫ్ట్‌లతో ఈ తరహా ఒప్పందాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయని, మరికొన్ని కంపెనీలతో ఒప్పందాల కాలపరిమితి ఈ ఏడాదితో ముగుస్తుందని పేర్కొంది. ఈ కంపెనీలు వ్యూహాత్మకంగానే డేటా షేరింగ్ ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. ఫేస్బుక్ యూజర్ల డేటాను ఆయా కంపెనీలు సంగ్రహించడంతో పాటు ఆ కంపెనీలు సేకరించిన డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా ఈ ఒప్పందాలు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. -
ఫేస్‌బుక్‌కు షాక్ : యూకే భారీ జరిమానా
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌తో సతమతమవుతోంది. ఇప్పటికే ఈ స్కాండల్ విషయంలో అమెరికా చట్టసభ్యుల ముందు తలవంచిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్.. ఈసారి యూకేలో భారీ జరిమానాను ఎదుర్కోబోతున్నారు. తాజాగా బ్రిటన్ డేటా రెగ్యులేటరీ ఫేస్‌బుక్‌పై చర్యలు ప్రారంభించింది. యూజర్ల అనుమతి లేకుండా కేంబ్రిడ్జ్ అనలిటికాకు డేటా షేర్ చేసి.. తమ చట్టాలను బ్రేక్ చేసినందుకు గాను 6,62,900 డాలర్ల జరిమానా అంటే సుమారు నాలుగున్నర కోట్ల జరిమానాను విధించింది. యూకే డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌ను రెండు విధాలుగా బ్రేక్ చేసినందుకు తాము విధించిన ఈ గరిష్ట జరిమానాను చెల్లించాలని ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీసు(ఐసీఓ) ఆదేశించింది. ప్రజల సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో ఫేస్బుక్ విఫలమైందని ఐఓసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత డేటాను పొలిటికల్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా అక్రమంగా పొందిందని మార్చిలో బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ డేటా స్కాండల్‌తో, ఫేస్బుక్ డేటా సెక్యురిటీ విధానాలపై యూకే ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీసు కూడా విచారణ చేపట్టింది. ఫేస్బుక్లో యూజర్ల డేటాకు భద్రత ఉందా లేదా అన్న అంశంపై దర్యాప్తు చేపట్టింది. అదేవిధంగా సమాచారాన్ని దుర్వినియోగ పరుస్తూ బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఎవైనా ప్రచారాలు జరిగాయా? అనే విషయంపై కూడా విచారణ జరిపింది. అందులో ఫేస్బుక్ విఫలమవడంతో సంస్థపై జరిమానాను విధించేందుకు సిద్ధమైంది. డేటా ప్రొటెక్షన్ చట్టం కింద గరిష్ఠ జరిమానా విధించాలని తాము భావించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. అంతేకాక వందల కొద్దీ టెర్రాబైట్స్ డేటా కలిగి ఉన్న సర్వర్లను, ఇతర పరికరాలను సీజ్ చేశారు. దీనిపై రిపోర్టును కూడా ఐఓసీ విడుదల చేయనున్నట్టు తెలిసింది. తమ ప్రజాస్వామ్య విధానంలోని చిత్తశుద్ధిపై నమ్మకం, విశ్వాసం దెబ్బతిన్నాయని, ఎందుకంటే సగటు ఓటర్లు, వెనుకాల ఏం జరుగుతుందనే విషయంపై తక్కువ అవగాహన కలిగి ఉంటారని ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎలిజబెత్ డెన్హామ్ చెప్పారు. చెడు ఉద్దేశ్యం కోసం ఈ విధంగా వ్యవహరించిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, కానీ తమ ప్రజాస్వామ్య విధానంపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించడంతో పాటు 11 రాజకీయ పార్టీలకు హెచ్చరికల లేఖలు, ఆడిట్ నోటీసులను ఐఓసీ పంపింది. కాగ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ నుంచి కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఫేస్బుక్ చిక్కుల్లో పడింది. ఈ వ్యవహారంపై కంపెనీ స్పందించి.. పొరబాటు తమదేనని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. అయితే ఈ కుంభకోణం విషయంలో ఇప్పటికే పలుమార్లు ఫేస్బుక్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీస్ కూడా ఫేస్బుక్ కార్యకలాపాలపై దృష్టిపెట్టింది. యూరోపియన్ యూనియన్‌లో యూకే సభ్యత్వంపై 2016లో జరిగిన రెఫరెండం సమయంలో రాజకీయ ప్రచారాల్లో ఏమైనా వ్యక్తిగత డేటా దుర్వినియోగమైందా? అనే విషయంపై విచారణ జరిపింది. -
చైనా కంపెనీలకు ఫేస్బుక్ సమాచారం
వాషింగ్టన్: చైనాకు చెందిన కనీసం నాలుగు మొబైల్ కంపెనీలతో ఫేస్‌బుక్‌కు సమాచార మార్పిడి ఒప్పందం ఉందని అమెరికా మీడియాలో కథనం వెలువడింది. అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా నిఘా వర్గాలు పేర్కొన్న హువాయ్ కంపెనీ కూడా అందులో ఉన్నట్లు తెలిసింది. అమెరికా సంస్థ బ్లాక్‌బెర్రీతో సమాచారం పంచుకోవడానికి ఉన్న ఒప్పందం లాంటిదే చైనా కంపెనీలతోనూ కుదుర్చుకున్నామని ఫేస్బుక్ స్పష్టం చేసింది. చైనా కంపెనీలతో ఒప్పందాలు 2010లో కుదుర్చుకున్నామని, హువాయ్‌తో ఒప్పందం ఈ వారంతోనే ముగుస్తుందని వివరణ ఇచ్చింది. ఫేస్‌బుక్‌తో ఒప్పందం వల్ల హువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్ లాంటి చైనా కంపెనీలు కొందరు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పొందేందుకు వీలవుతుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. చైనా కంపెనీలతో ఫేస్బుక్ ఒప్పందాలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఫేస్బుక్ మరో ఘోర తప్పిదం
వాషింగ్టన్ : డేటా షేరింగ్ స్కాండల్ విషయంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ తన యూజర్ల డేటాను చెప్పా పెట్టకుండా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ తయారీదారులకు ఇచ్చినట్టు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. వాటిలో ఆపిల్, శాంసంగ్, అమెజాన్ వంటి 60 కంపెనీలున్నట్టు తెలిపింది. గత దశాబ్ద కాలంగా యూజర్ల డేటాను ఆ కంపెనీలకు ఫేస్బుక్ యాక్సస్ చేస్తున్నట్టు వెల్లడించింది. తాజాగా ఫేస్బుక్ చేసిన మరో ఘోర తప్పిదం వెలుగులోకి వచ్చింది. చైనీస్ డివైజ్ మేకర్లతో కూడా డేటా షేరింగ్ ఒప్పందాన్ని ఈ కంపెనీ కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీనే అంగీకరించింది. హువావే టెక్నాలజీస్ కో, లెనోవో, ఒప్పో, టీసీఎల్ వంటి చైనీస్ డివైజ్ తయారీదారులకు ఫేస్బుక్ తన డేటాను షేర్ చేసినట్టు వెల్లడించింది. ఇదీ కూడా యూజర్లకు తెలియకుండానే చేసినట్టు తెలిసింది. చైనీస్ డివైజ్ తయారీదారులతో ఫేస్బుక్ డేటా షేర్ కావడం ‘అత్యంత ప్రమాదకరం’ అని సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ టాప్ డెమొక్రాట్ మార్క్ వార్నర్ అన్నారు. అయితే తాము ఈ భాగస్వామ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని, ఫేస్బుక్ యాప్ కస్టమ్ వెర్షన్స్‌ను అభివృద్ధి చేయడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు తాము సహకరిస్తున్నామని ఈ కంపెనీ చెబుతోంది. మెంబర్ల సమాచారాన్ని వారు ఎలాంటి వాటికి ఉపయోగిస్తున్నారనే విషయంపై చాలా విశ్లేషణ చేశామని పేర్కొంటోంది. 2009 నుంచి చైనాలో ఫేస్బుక్ యాప్ బ్లాక్ అయి ఉంది. అయినప్పటికీ ఆ దేశ కంపెనీలకు మాత్రం ఈ కంపెనీ యూజర్ల డేటా ఇచ్చేసింది. ప్రస్తుతం ఫేస్బుక్ షేర్చేసిన చైనీస్ కంపెనీలు, ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ, వారి మిలటరీకి సంబంధించినివా తెలుపాలని ఆ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ కంపెనీతో యూజర్ల డేటాను పంచుకుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణలపై ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కాంగ్రెస్ సభ్యుల మందుకు వచ్చి కూడా క్షమాపణ చెప్పారు. తాజాగా న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసిన రిపోర్టులు, వెలుగులోకి వచ్చిన చైనీస్ కంపెనీలతో భాగస్వామ్యం అన్ని విషయాల్లోనూ ఫేస్బుక్ ఎంత ఘోర తప్పిందం చేసిందో వెల్లడవుతుందని టెక్ వర్గాలంటున్నాయి. -
యాపిల్, అమెజాన్ చేతిలో ‘ఫేస్బుక్’
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. తమ వినియోగదారుల భద్రతే ముఖ్యమని మాటలు చెబుతున్న ఫేస్బుక్.. చేతల్లో మాత్రం యూజర్ల డేటాను ఇతరులకు కట్టబెట్టే ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. తాజాగా ఫేస్బుక్ తమ వినియోగదారుల సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేలా 60 పరికరాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఇటీవల వరకు ఉక్కిరిబిక్కిరైన ఫేస్బుక్ సంస్థ తాజా ఉదంతంతో మరోసారి వార్తల్లోకెక్కింది. తాజా వివాదంలో ప్రముఖ పరికరాల తయారీ సంస్థలు యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, మైక్రోసాఫ్ట్, సామ్సంగ్లతోపాటు మరికొన్ని సంస్థలకు గత దశాబ్ద కాలంగా ఫేస్బుక్ తన యూజర్ల సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. యూజర్ల అనుమతి లేకుండా.. డివైజ్ తయారీదారులకు ఫేస్బుక్ తన యూజర్ల ప్రొఫెల్ వివరాలతోపాటు ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారి వ్యక్తిగత వివరాలను కూడా యాక్సెస్ చేసుకునేలా పర్మిషన్ ఇచ్చిందని పేర్కొంది. ఫేస్బుక్ తన వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకునేందుకు ఈ ఒప్పందాలు పనిచేస్తున్నాయని వెల్లడించింది. పరికర తయారీ సంస్థలు యూజర్ల డేటాను ఉపయోగించి మెసేజింగ్, లైక్ బటన్, అడ్రస్ బుక్ లాంటి ఫీచర్లను వారివారి పరికరాల్లో పొందుపరిచేవని పేర్కొంది. వీటిలో కొన్ని సంస్థలైతే యూజర్ల ఫ్రెండ్స్ లిస్ట్‌లోని వారి ఖాతాల నుంచి కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవని తెలిపింది. తాజా వివాదంతో మరోసారి ఫేస్బుక్ వ్యక్తిగత గోప్యత భద్రతా విధానాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రైవసీ రీసెర్చర్ సెర్గీ ఎగ్లిమన్ స్పందిస్తూ.. ‘పరికర తయారీ సంస్థలను విశ్వసనీయమైన సంస్థలుగా ఫేస్బుక్ భావిస్తుండొచ్చు. అయితే పరికర సంస్థల డివైజ్‌లలో ఉంచిన సమాచారాన్ని యూజర్లు వాడే ఇతర థర్డ్ పార్టీ యాప్స్ గనుక యాక్సెస్ చేయగలితే అది తీవ్రమైన గోప్యతా, భద్రతా పరమైన ప్రమాదంగా మారుతుంది’అని వివరించారు. ఆరోపణల్ని కొట్టిపారేసిన ఫేస్బుక్.. తాజాగా చెలరేగిన ఆరోపణలను ఫేస్బుక్ కొట్టిపారేసింది. ఫేస్బుక్ గోప్యతా విధానంలో ఉన్న ప్రకారమే సంస్థ నడుచుకుంటున్నట్లు వివరించింది. పరికర తయారీ సంస్థలతో చేసుకున్న ఈ ఒప్పందాలు యాప్ డెవలపర్లు తమ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే దానికి భిన్నంగానే ఉన్నాయని ఫేస్బుక్ సహాధ్యక్షుడు ఇమీ అర్షిబాంగ్ పేర్కొన్నారు. డెవలపర్లు గేమ్స్, ఇతర సర్వీసుల కోసం యూజర్ల డేటాను వాడుకుంటారని.. అయితే తయారీ సంస్థలు ఫేస్బుక్ వర్షన్లకు సంబంధించిన విషయాలకై మాత్రమే డేటాను ఉపయోగిస్తాయని తెలిపారు. -
వాట్సాప్ కు షాక్: 21కోట్ల జరిమానా
-
వాట్సాప్ కు షాక్: 21కోట్ల జరిమానా
లండన్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఇటలీ భారీ జరిమానా విధించింది. బలవంతంగా యూజర్ల వ్యక్తిగత డేటాను పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో షేరు చేపిస్తుందనే నెపంతో ఇటలీ 3.3 మిలియన్ డాలర్లకు పైగానే అంటే 21 కోట్లకు పైగా జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది. ఫేస్ బుక్ తో వాట్సాప్ డేటా షేరింగ్ పై అనుమానాలు ఉన్నాయని 28 దేశాల యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటక్షన్ అధికారులు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు. కానీ వాట్సాప్ మాత్రం యూజర్ల డేటాను ఫేస్ బుక్ షేర్ చేస్తోంది. ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమీక్షిస్తామని, అధికారులకు తమ స్పందన తెలియజేస్తామని వాట్సాప్ అధికార ప్రతినిధి చెప్పారు. 2014లో మెసేజింగ్ యాప్ లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకుంది. 2016 ఆగస్టు నుంచి వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ మార్చి, యూజర్ల డేటాను ఫేస్ బుక్ తో షేరు చేయడం ప్రారంభించింది. ఈ విషయంపై ఇప్పటికే చాలా దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే వాట్సాప్ మాత్రం ఈ ప్రక్రియను నిలిపివేయడం లేదు. భారత్ లో సైతం దీనిపై ఆందోళన రేకెత్తాయి. 2016 సెప్టెంబర్ లో వాట్సాప్ కొత్త పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. 2016 సెప్టెంబర్ 25కు ముందు సేకరించిన యూజర్ల డేటాను ఫేస్ బుక్ లేదా మరే ఇతర సంబంధిత కంపెనీలతో పంచుకోకూడదని ఢిల్లీ హైకోర్టు వాట్సాప్ ను ఆదేశించింది. వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆ కంపెనీ డేటా ప్రొటక్షన్ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఎఫ్‌బీపై ఏప్రిల్ నుంచి జర్మన్ అథారిటీలు నిషేధం విధించారు. -
ఫేస్బుక్, వాట్సాప్‌లపై సుప్రీం సీరియస్
పేరెంట్ కంపెనీ ఫేస్బుక్, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.. వాట్సాప్‌లో పంపే సందేశాలను ఫేస్బుక్ యాక్సస్ చేస్తుందని, ఎన్ని సెక్యురిటీ ఫీచర్స్ ఉన్నా దాన్ని ఫేస్బుక్ ఉల్లంఘిస్తోందని వెల్లువెత్తిన ఫిర్యాదులపై విచారించిన సుప్రీంకోర్టు, ఆ రెండు కంపెనీలకు అక్షింతలు వేసింది. వాట్సాప్ మెసేజ్ ఎన్‌క్రిప్ట్ అయినా బయటకు ఎలా పొక్కుతుందని ప్రశ్నించింది. ఇది వినియోగదారుల సమాచార గోప్యతకు భంగం వాటిల్లినట్టు కాదా? అని సీరియస్ అయింది.. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ రెండు కంపెనీలకు నోటీసులు జారీచేసింది. సోషల్ మీడియాపై మీ పాలసీ ఏమిటో తెలుపాలని కూడా ఆదేశించింది. దేశంలో సోషల్ మీడియాకు ఎలాంటి విధానం ఉండాలనుకుంటున్నారో తెలుపాలంటూ ఇటు టెలికాం రెగ్యులేటరి అథారిటీ(ట్రాయ్)కి, కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.. ఈ విషయంలో సమగ్రంగా పరిశోధన జరిపి, నివేదిక అందించాలని అటార్ని జనరల్ ముకల్ రోహత్గీకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. మార్కెటింగ్, కమర్షియల్ అడ్వర్టైజింగ్ కోసం తన పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ కొన్ని నెలల క్రితమే ఓ కొత్త పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ తీసుకొచ్చినప్పటి నుంచి వాట్సాప్‌కు చిక్కులెదురవుతున్నాయి. మనదేశంలోనే కాక, ఇతర దేశాల్లోనూ ఈ పాలసీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూజర్ల డేటాను షేర్ చేయడం వ్యక్తిగత ప్రైవసీకి భంగమని ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్‌ను ఫేస్బుక్ తప్పుదోవ పట్టిస్తుందంటూ గత నెల యూరోపియన్ కమిషన్ కూడా అభిప్రాయపడింది. యూరప్‌లో ఈ విషయంపై తీవ్ర ఎత్తున్న ఆందోళనలు వస్తుండటంతో, రెండు కంపెనీలు డేటా షేరింగ్‌ను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు ఫేస్బుక్ పేర్కొంది.