ఫేస్బుక్, వాట్సాప్లపై సుప్రీం సీరియస్
ఫేస్బుక్, వాట్సాప్లపై సుప్రీం సీరియస్
Published Mon, Jan 16 2017 4:39 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
పేరెంట్ కంపెనీ ఫేస్బుక్, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.. వాట్సాప్లో పంపే సందేశాలను ఫేస్బుక్ యాక్సస్ చేస్తుందని, ఎన్ని సెక్యురిటీ ఫీచర్స్ ఉన్నా దాన్ని ఫేస్బుక్ ఉల్లంఘిస్తోందని వెల్లువెత్తిన ఫిర్యాదులపై విచారించిన సుప్రీంకోర్టు, ఆ రెండు కంపెనీలకు అక్షింతలు వేసింది. వాట్సాప్ మెసేజ్ ఎన్క్రిప్ట్ అయినా బయటకు ఎలా పొక్కుతుందని ప్రశ్నించింది. ఇది వినియోగదారుల సమాచార గోప్యతకు భంగం వాటిల్లినట్టు కాదా? అని సీరియస్ అయింది.. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ రెండు కంపెనీలకు నోటీసులు జారీచేసింది. సోషల్ మీడియాపై మీ పాలసీ ఏమిటో తెలుపాలని కూడా ఆదేశించింది. దేశంలో సోషల్ మీడియాకు ఎలాంటి విధానం ఉండాలనుకుంటున్నారో తెలుపాలంటూ ఇటు టెలికాం రెగ్యులేటరి అథారిటీ(ట్రాయ్)కి, కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది..
ఈ విషయంలో సమగ్రంగా పరిశోధన జరిపి, నివేదిక అందించాలని అటార్ని జనరల్ ముకల్ రోహత్గీకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. మార్కెటింగ్, కమర్షియల్ అడ్వర్టైజింగ్ కోసం తన పేరెంట్ కంపెనీ ఫేస్బుక్తో యూజర్ల డేటాను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ కొన్ని నెలల క్రితమే ఓ కొత్త పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ తీసుకొచ్చినప్పటి నుంచి వాట్సాప్కు చిక్కులెదురవుతున్నాయి. మనదేశంలోనే కాక, ఇతర దేశాల్లోనూ ఈ పాలసీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూజర్ల డేటాను షేర్ చేయడం వ్యక్తిగత ప్రైవసీకి భంగమని ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్ను ఫేస్బుక్ తప్పుదోవ పట్టిస్తుందంటూ గత నెల యూరోపియన్ కమిషన్ కూడా అభిప్రాయపడింది. యూరప్లో ఈ విషయంపై తీవ్ర ఎత్తున్న ఆందోళనలు వస్తుండటంతో, రెండు కంపెనీలు డేటా షేరింగ్ను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు ఫేస్బుక్ పేర్కొంది.
Advertisement
Advertisement