privacy issues
-
సైలెంట్‌గా సైడ్ అయిపోవచ్చు, వాట్సాప్ యూజర్లకు శుభవార్త!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మూడు ఫీచర్లను యాడ్ చేస్తున్నట్లు వాట్సాప్ మాతృసంస్థ, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఏదైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఇతర సభ్యులకు ఎవరికీ తెలియదు. ఎగ్జిట్ అయిన విషయం అడ్మిన్స్‌కు మాత్రమే తెలుస్తుంది. అలాగే వాట్సాప్‌ను ప్రైవేట్‌గా చూసుకునే వెసులుబాటు రానుంది. అంటే ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదో నిర్ణయించుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు ఆగస్ట్‌లోనే జతకూడనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. యూజర్ మరో యూజర్‌కు వ్యూ వన్స్ ఫీచర్‌ను ఉపయోగించి ఫోటో, వీడియో పంపినప్పుడు ఒకసారి మాత్రమే చూసుకునే వీలుంది. అయితే వ్యూ వన్స్ ద్వారా వచ్చిన ఫొటోను, వీడియోను స్క్రీన్‌షాట్ తీసుకునే వీలు లేకుండా కొత్త ఫీచర్ కొద్ది రోజుల్లో రానుంది. చదవండి👉ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి! -
జూమ్ ఇతరులతో మీ డేటాను పంచుకుంటుందా..! ఎంతవరకు నిజం..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకతో వీడియో సమావేశాల యాప్ జూమ్ గణనీయంగా అభివృద్ధి చెందింది. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిర్వహించడంలో, ఉద్యోగులకు ఆఫీసు కార్యకలాపాలకు జూమ్ యాప్ ఎంతగానో ఉపయోగపడింది. జూమ్ యాప్‌కు పోటిగా పలు దిగ్గజ కంపెనీలు సైతం సమావేశాల కోసం సపరేటుగా యూజర్లకోసం యాప్‌లను తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జూమ్ యాప్‌ను ఎన్నో కోట్ల మంది వాడుతున్నారు. అయితే జూమ్ తన యూజర్ల డేటాను ఇతర థర్డ్ యాప్స్‌తో పంచుకుంటోందని యూఎస్ సంస్థలు నిగ్గుతేల్చాయి. జూమ్ తన యూజర్ల డేటాను ప్రముఖ దిగ్గజ సంస్థలు ఫేస్బుక్, గూగుల్, లింక్డిన్తో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. జూమ్ యూజర్ల ప్రైవసీని దెబ్బతీసింనందుకు గాను యూఎస్ న్యాయస్థానం సుమారు 85 మిలియన్ డాలర్ల(రూ. 630 కోట్లు)ను జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించడానికి జూమ్ యాజమాన్యం ఒప్పకున్నట్లు తెలుస్తోంది. జూమ్ సరైన భద్రతా పద్ధతులను పాటించక పోవడంతో హ్యాకర్లు జూమ్ సమావేశాలను హ్యక్ చేయడం సింపుల్ అవుతోంది. దీనినే జూమ్‌బాంబింగ్ అని అంటారు. జూమ్ బాంబింగ్ అనేది బయటి వ్యక్తులు జూమ్ సమావేశాలను హైజాక్ చేసి, అశ్లీలత ప్రదర్శించడం, జాత్యహంకార భాషను ఉపయోగించడం లేదా ఇతర కలవరపెట్టే కంటెంట్‌ను పోస్ట్ చేయడం. కాగా , యూఎస్‌లో కాలిఫోర్నియా శాన్‌జోస్‌లోని యూఎస్ డిస్ట్రిక్ న్యాయమూర్తి లూసీ కో ప్రిలిమినరీ సెటిల్మెంట్ ఫైల్‌పై ఆమోదం తెలపాల్సి ఉంది. మీటింగ్ హోస్ట్‌లు లేదా ఇతర పార్టిసిపెంట్లు మీటింగ్‌లలో థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించినప్పుడు యూజర్లను హెచ్చరించడం, ప్రైవసీ, డేటా హ్యాండ్లింగ్‌పై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణను అందించడం వంటి భద్రతా చర్యలకు జూమ్ అంగీకరించింది. శాన్ జోస్ ఆధారిత కంపెనీ ప్రిలిమినరీ సెటిల్మెంట్ ఫైల్‌ను పరిష్కరించడానికి అంగీకరించడంలో తన తప్పును ఖండించింది. జూమ్ ఆదివారం చేసిన ఒక ప్రకటనలో.. గోప్యత, సెక్యూరిటీ విషయంలో యూజర్లు మాపై ఉంచే విశ్వాసాన్ని తీవ్రంగా పరిణిస్తామని జూమ్ పేర్కొంది. కోవిడ్-19 మహామ్మారి సమయంలో యూజర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. -
గోప్యతపై లడాయి
కేంద్ర ప్రభుత్వానికీ, వాట్సాప్ సంస్థకూ మధ్య ఇప్పుడు నడుస్తున్న యుద్ధం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇందులో పౌరుల ప్రాథమిక హక్కుల సమస్య ఇమిడివుంది గనుక ఏది సరైంది... ఏది కాదు అనే అంశాల్లో చాలా చర్చ నడుస్తోంది. సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ వాట్సాప్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తాజా వివాదానికి మూలం. వాట్సాప్‌లో పంపే సందేశాలు, దానిద్వారా ఎవరితోనైనా జరిపే సంభా షణలు బయటివారికి తెలిసే అవకాశం లేదని, ఇది తమ యాప్ ప్రత్యేకతని వాట్సాప్ చెప్పుకుం టోంది. అయితే దురుద్దేశపూర్వకంగా, ద్రోహచింతనతో ఎవరైనా ప్రవర్తించినప్పుడు వారి వివరాలు ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది వాట్సాప్ ప్రత్యేకతను దెబ్బతీస్తుంది గనుక ఆ సంస్థ కోర్టుకెక్కింది. ఈ ఏడాది మొదట్లో ఇదే సంస్థ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరత్రా వినియోగించుకోవడానికి అనుమతించాలంటూ వినియోగదారులపై విధించిన ఆంక్షలను కేంద్రం తప్పుబట్టింది. అప్పట్లో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన వాట్సాప్ త్వరలోనే అమలు చేయబోతున్నట్టు ఈమధ్యే ప్రకటించింది. పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఈ నిర్ణ యాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రం గత వారం వాట్సాప్ సంస్థకు నోటీసు జారీచేయటంతో ఇది స్వచ్ఛందమేనని, తప్పనిసరి కాదని ఆ సంస్థ గొంతు సవరించుకుంది. ఇలా సందర్భాలు వేరు కావొచ్చుగానీ... ఇద్దరూ వినియోగదారుల ప్రయోజనాలనూ, వారి గోప్యతనూ కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల తీరు వినియోగదారులకు సమస్యలు సృష్టిస్తున్న సంగతి కాదనలేనిది. వాట్సాప్‌కు మాతృ సంస్థ అయిన ఫేస్బుక్ కొన్నాళ్లక్రితం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. దాదాపు 50 కోట్లమంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా పరులపాలైందని వెల్లడైనప్పుడు అది నిజమో, కాదో వివరణనిచ్చేందుకు కూడా ఫేస్బుక్ చాన్నాళ్లు సిద్ధపడలేదు. సామాజిక మాధ్య మాలు వినియోగించే యాప్‌లు ఎంత భద్రమైనవో, అవి తమ డేటాను పరిరక్షించగలవో లేదో వినియోగదారులకు తెలిసేందుకు అనువైన పారదర్శకతను ఆ సంస్థలు పాటించడం లేదు. అసలు ఈ సంస్థలే పౌరుల డేటాను విక్రయిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కేంద్రం మార్గదర్శకాలు తమ వినియోగదారుల భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తుందని అభ్యంతర పెడుతున్న వాట్సాప్ సంస్థ... వినియోగదారుల డేటాతో తాను ఏం చేయదల్చుకున్నదో వెల్లడించడానికి మాత్రం సిద్ధపడటం లేదు. వాట్సాప్ అయినా, మరొకటైనా ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా పౌరులకు అందుబాటులో వున్నాయి. కానీ పాటించే నిబంధనలు మాత్రం అన్నిచోట్లా ఒకేలా లేవు. భారత వినియోగదారుల డేటాను ఇష్టానుసారం ఉపయోగించినట్టు బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో చేయడం సాధ్యం కాదు. వేరే దేశాల్లో కూడా ఆ నిబంధనలే వర్తింపజేయటానికి ఆ సామాజిక సంస్థలకుండే అభ్యంతరా లేమిటి? కనీసం ఆ విషయంలోనైనా అవి పారదర్శకంగా వుండటం లేదు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న సంస్థలు తాము నిర్దేశించుకున్న నిబంధనలేమిటో, సంస్థ ఉద్యోగులు వాటిని ఉల్లంఘిం చినపక్షంలో తీసుకునే చర్యలేమిటో మాత్రం చెప్పవు. వ్యక్తిగత గోప్యత హక్కు రెండు అంచులా పదునున్న కత్తిలాంటిది. చాలాచోట్ల గో సంరక్ష కులుగా అవతారమెత్తినవారు వాట్సాప్‌లో గ్రూపులుగా ఏర్పడి గోవధ అడ్డుకునే పేరిట ఎంత అరా చకంగా ప్రవర్తించారో తెలియనిది కాదు. పర్యవసానంగా సందేశాలు పంపటంలో వాట్సాప్ పరిమి తులు విధించింది. బాధ్యులు తెలియడం లేదంటూ నిందితులపై ప్రభుత్వాలు నామమాత్రం కేసులతో సరిపెట్టిన సందర్భాలు ఎన్నో వున్నాయి. సాక్షాత్తూ కేంద్రమంత్రులు అలాంటివారిని వెనకే సుకొచ్చిన ఉదంతాలున్నాయి. కేంద్ర మార్గదర్శకాలు ఈ మాదిరి అరాచకాన్ని నిలుపు చేస్తాయన్న నమ్మకం ఎవరికీ లేదు. పైగా సరైన చర్చ జరగకుండా, ఎవరినీ సంప్రదించకుండా ఆదరాబాదరాగా జారీ అయిన మార్గదర్శకాలపై సందేహాలు తలెత్తడాన్ని తప్పు బట్టనవసరం లేదు. ఎన్నడో 2018లో జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిటీ డేటా పరిరక్షణపై ముసాయిదా బిల్లు రూపొందించింది. అది కేంద్ర కేబినెట్‌కు కూడా వెళ్లింది. ఆ తర్వాత దాని అతీగతీ లేదు. నిజానికి అలాంటి చట్టం లేకపోవటంవల్లే వాట్సాప్ సంస్థ కోర్టుకెక్కింది. యూరోపియన్ యూనియన్ డేటా పరిక్షణ చట్టం ముసాయిదాపై రెండేళ్లపాటు సభ్య దేశాల పార్లమెంట్లలో చర్చ జరిగింది. నిపుణులు, సాధారణ పౌరులు కూడా ఎన్నో అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ తర్వాతే చట్టం వచ్చింది. పర్యవసానంగా వాట్సాప్‌తోసహా అన్ని సంస్థలూ దానికి కట్టుబడాల్సి వచ్చింది. ఇక్కడ కూడా జస్టిస్ శ్రీకృష్ణ ముసాయిదా బిల్లుపై విస్తృత చర్చకు వీలు కల్పించి చట్టం తీసుకొస్తే బాగుండేది. అందుకు బదులుగా మార్గదర్శకాల పేరిట ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేవిధంగా నిబంధనలు అమల్లోకి తీసుకురావటం సరి కాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, సమాజంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని నియంత్రించాల్సిందే. కానీ ఆ పేరిట సహేతుక నిరసనను నేరపూరితం చేసే ప్రభుత్వాల వైఖరి కూడా ప్రమాదకరం. అందుకే ఈ విషయంలో విస్తృతంగా చర్చించి తగిన చట్టాన్ని తీసుకు రావాలి. అందరిలోనూ విశ్వాసం ఏర్పడేలా ఒక తటస్థ వ్యవస్థ రూపొందితే... అది పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తే అంతిమంగా అది ప్రజాస్వామ్య పటిష్టతకు దోహదపడుతుంది. -
గూగుల్‌లో కొత్త ఫీచర్స్..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ప్రైవసీ సెట్టింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌తో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం బీటా వెర్షన్‌ను ఆవిష్కరించింది. అమెరికాలోని మౌంటెయిన్ వ్యూ క్యాంపస్‌లో వర్చువల్‌గా నిర్వహించిన గూగుల్ ఐ/ఓ 2021 కార్యక్రమంలో వీటిని పరిచయం చేసింది. వీటిని ఈ ఏడాది ప్రవేశపెట్టే ఉత్పత్తుల్లో పొందుపర్చనుంది. ‘‘కోవిడ్–19తో నా మాతృదేశమైన భారత్‌తో పాటు బ్రెజిల్ తదితర దేశాలు ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బోధన, చిన్న వ్యాపార సంస్థల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, అవసరమైన వారికి టీకాలు మొదలైన అత్యవసరాలు సత్వరం అందేందుకు గూగుల్ పలు ఉత్పత్తులు ప్రవేశపెట్టింది. చర్యలు తీసుకుంది’’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సెర్చి, లెన్స్, ఫొటోస్, మ్యాప్స్, షాపింగ్ మొదలైన ఉత్పత్తుల్లో ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే కొత్త ఫీచర్లను ఈ సందర్భంగా ఆయన వివరించారు. మరిన్ని విశేషాలు.. ►గోప్యతను మరింత మెరుగుపర్చేందుకు ‘‘క్విక్ డిలీట్’’ ఆప్షన్. దీనితో గూగుల్ అకౌంట్ మెనూ ద్వారా ఒక్కసారి ట్యాప్ చేసి 15 నిమిషాల సెర్చి హిస్టరీని డిలీట్ చేసేయొచ్చు. ►మ్యాప్స్ టైమ్‌లైన్‌లో లొకేషన్ హిస్టరీ ఫీచర్. ►గూగుల్ ఫొటోస్‌లో పాస్వర్డ్ రక్షణతో ‘‘లాక్డ్ ఫోల్డర్’’ ఫీచరు. యూజరు ఎంపిక చేసుకున్న ఫొటోలను విడిగా భద్రపర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇవి గ్రిడ్ లేదా షేర్డ్ ఆల్బమ్స్‌లో కనిపించవు. దీన్ని ముందుగా గూగుల్ పిక్సెల్ ఫోన్లలో ఆ తర్వాత మిగతా ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులోకి తెస్తారు. ►2014 తర్వాత డిజైన్పరంగా గణనీయమైన మార్పులు, చేర్పులతో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ బీటా వెర్షన్. ఇందులో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు. యూజర్ డేటాను ఏయే యాప్స్ తీసుకుంటున్నాయన్న వివరాలను అందించడంతో పాటు యూజర్లకు డివైజ్‌పై మరింతగా నియంత్రణ ఉండేలా ఆండ్రాయిడ్ 12 రూపకల్పన. -
వాట్సాప్‌తో బతుకు బహిరంగమేనా..?
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్.. తన వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే నిర్ణయం తీసుకుంది. వినియోగదారులంతా తమ వివరాలు ఇస్తేనే యాప్‌లో కొనసాగాలని.. లేకుంటే నిరభ్యంతరంగా బయటకు వెళ్లిపోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు నవీకరించిన నిబంధనలు, గోప్యత విధానానికి వచ్చేనెల 8వ తేదీలోగా అంగీకారం తెలపాలని షరతు విధించింది. ఈ మేరకు తమ కొత్త ప్రైవసీ పాలసీకి సమ్మతి తెలపాలని కోరుతూ పాప్–అప్ మెసేజ్‌లు పంపిస్తోంది. దీనికి అంగీకరిస్తేనే ఫిబ్రవరి 8 తర్వాత వాట్సాప్ ఖాతా పనిచేస్తుంది. బతుకు బహిరంగమేనా..? వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామి అయిపోయింది. వ్యక్తిగత చాట్స్‌తో పాటు ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు, ఫైల్స్, షేర్ లొకేషన్ మెసేజ్‌లను పంపడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మందికి పైగా దీనిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వాట్సాప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీతో వాట్సాప్ సేవలతో పాటు వినియోగదారుల డేటా ప్రాసెసింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ పాలసీకి ఆమోదం తెలిపిన తర్వాత వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్, ఇతర అనుబంధ కంపెనీల వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకుంటుంది. ఈ–కామర్స్ సంస్థలకు వినియోగదారుల డేటాను అమ్ముకుంటుంది. తొలుత ఈ విధానాన్ని బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబోతోంది. గోప్యతకు ప్రమాదం లేదంటూనే... వాట్సాప్‌లో సందేశాలన్నీ సంకేతభాష (ఎన్క్రిప్టెడ్)లోకి తర్జుమా అవుతాయని, ఆ డేటాను తాము కూడా చూడలేమని సంస్థ అంటోంది. సందేశాలు డెలివరీ అయ్యాక, తమ సర్వర్ నుంచి డిలీట్ అయిపోతాయని పేర్కొంటోంది. ఏదైనా పాపులర్ ఫోటో, వీడియోను ఎక్కువ మంది షేర్ చేస్తే దాన్ని మాత్రమే సర్వర్‌లో దీర్ఘకాలం స్టోర్ చేస్తామని అంటోంది. తాము కానీ, థర్డ్ పార్టీలు కానీ వినియోగదారుల సమాచారాన్ని చదవలేరని స్పష్టంచేస్తోంది. తమ వినియోగదారులు, వ్యాపార సంస్థలు వాట్సాప్‌ను వినియోగించుకుని మెరుగైన పద్ధతిలో కమ్యూనికేట్ కావడానికి మాత్రమే కొత్త దారులు వెతుకుతున్నామని, ఈ క్రమంలోనే కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చామని చెబుతోంది. వినియోగదారుల మొబైల్ ఫోన్ నంబర్, ఫోన్ కాంటాక్స్, ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ మెసేజ్ వంటి సమాచారాన్ని వారి సమ్మతి ద్వారా తీసుకుంటామని అంటోంది. ఫేస్‌బుక్‌కు ఏమేం ఇస్తుంది? వాట్సాప్ వినియోగదారుల అకౌంట్ రిజిస్ట్రేషన్ సమాచారం(ఫోన్ నంబర్), వాట్సాప్‌తో జరిపే ఆర్థిక లావాదేవీలు, సేవల సంబంధిత సమాచారం, ఇతరులతో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? మీ మొబైల్‌ఫోన్ హార్డ్‌వేర్ సమాచారం, ఐపీ అడ్రస్, లొకేషన్, మీరు సందర్శించిన వెబ్సైట్లు వంటి వివరాల ను ఫేస్బుక్, ఇతర అనుబంధ కంపెనీలకు ఇవ్వనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాట్సాప్ తాజా నిర్ణయం నేపథ్యంలో టెలిగ్రాం, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లు వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. -
గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు!
న్యూఢిల్లీ : వాట్సాప్ పలు ఆకర్షణీయ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్నా ఇప్పుడు అవే ఫీచర్లలో ఉన్న బగ్ యూజర్ల గోప్యతను ప్రమాదంలో పడవేస్తోంది. ఈ బగ్ గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వాట్సాప్ యూజర్ ఫోన్ నంబర్ కనిపించేలా చేస్తోంది. వాట్సాప్ క్లిక్ టు చాట్ ఫీచర్‌లోని బగ్ సోషల్ మెసేజింగ్ సైట్ యొక్క వినియోగదారుల ఫోన్ నంబర్లను గూగుల్ సెర్చ్ ఇండెక్స్‌కు అనుమతించడంతో గోప్యతకు పెనుముప్పు ఎదురవుతోందని బగ్-బౌంటీ హంటర్ అతుల్ జయరామ్ వెల్లడించారు. ఇది వెబ్‌లో వినియోగదారుల ఫోన్ నంబర్ల కోసం వెతికేందుకు ఎవరినైనా అనుమతించడంతో వాట్సాప్ యూజర్ల భద్రత ప్రమాదంలో పడుతుంది. దీంతో క్లిక్ టూ చాట్‌తో యూజర్ మరో వాట్సాప్ యూజర్‌తో వారి ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ చాట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇక వెబ్సైట్లు తమ విజిటర్లతో నేరుగా ఫోన్ నెంబర్లను సంప్రదించకుండానే వారితో సంప్రదింపులు జరిపే వెసులుబాటు లభిస్తుంది. ఈ వెసులుబాటుతో స్కామర్ల చేతికి వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్ల జాబితాలు చిక్కుతాయని బగ్-బౌంటీ హంటర్ జయరామ్ పేర్కొన్నారు. చదవండి : వాట్సాప్‌లో పెళ్లి ఫోటోలు.. మనస్తాపంతో.. వ్యక్తిగత ఫోన్ నెంబర్లు లీకైతే ఎటాకర్లు వాటికి మెసేజ్ చేయడం, క్సాల్ చేయడంతో పాటు ఆయా ఫోన్ నెంబర్లను వారు మార్కెటర్లకు, స్పామర్లు, స్కామర్లకు విక్రయించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫోన్‌నెంబర్లతో ఎటాకర్లు యూజర్ల ప్రొఫైల్స్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. వాట్సాప్ ప్రొఫైల్‌లో యూజర్ ఫోటోను చూసే ఎటాకర్లు వారి ఇతర సోషల్ మీడియా ఖాతాలను సెర్చి చేయడం ద్వారా ఆయా వ్యక్తులను టార్గెట్ చేస్తారని అన్నారు. కాగా మే 23న పరిశోధకుడు బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా ఫేస్‌బుక్‌ను సంప్రదించగా కంపెనీ డేటా అబ్యూజ్ ప్రోగ్రాం కింద వాట్సాప్ కవర్ కాదని కంపెనీ బదులిచ్చింది. ఇక వాట్సాప్ యూజర్లు అవాంఛిత మెసేజ్‌లను ఒ బటన్ ద్వారా బ్లాక్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. -
జూమ్ యాప్‌పై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ : భారత్‌లో ‘జూమ్ యాప్’ను నిషేధించాలని సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు అయింది. హర్ష్ చుగ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. జూమ్ యాప్ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. తగిన చట్టాలు రూపొందించేవరకు జూమ్ వీడియో కాలింగ్ యాప్‌పై నిషేధం కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ యాప్ సురక్షింతం కాదని.. ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదని తెలిపారు. (చదవండి : ‘జూమ్’ సేఫ్ కాదు) ఈ యాప్ వినియోగిస్తున్నవారి వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఇన్మరేషన్ టెక్నాలజీ రూల్స్ 2009 నిబంధనలను ఈ యాప్ ఉల్లంఘింస్తుందని పేర్కొన్నారు. ఈ యాప్ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కాగా, జూమ్ వీడియో కాలింగ్ యాప్‌కు సంబంధించిన లోటుపాట్లపై ఆ సంస్థ సీఈఓ ఇప్పటికే వినియోగదారులను క్షమాపణ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు జూమ్ యాప్ అంత సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు జూమ్ యాప్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. (చదవండి : పాతాళానికి టిక్ టాక్ రేటింగ్స్) -
డీప్‌ఫేక్ వీడియోలతో పోర్న్ క్లిప్‌లు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడవారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వీడియో అమెరికాలో కలకలం రేపింది. తరువాత అది నకిలీదని తేలింది. ఓ హాలీవుడ్ హీరోయిన్ పోర్న్ క్లిప్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. అందులో ఉన్నది తాను కాదన్నా ఎవరూ నమ్మలేదు. కానీ, ఆమె చెప్పేది నిజమే. మనకు నచ్చిన సెలబ్రిటీల శరీరానికి సామాన్యుల ముఖాలను అంటించి మురిసిపోయే వీలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ‘డీప్‌ఫేక్’సాఫ్ట్వేర్ సృష్టిస్తోన్న మాయాజాలమిది.(ముసలి మొహం ప్రైవసీ మాయం!) ఈ యాప్ వచ్చిన కొత్తలో తమకు ఇష్టమైన హీరో, గాయకులు, రాజకీయ నాయకులను అనుకరిస్తూ.. పలు ఫొటోలు, వీడియోలు సృష్టించి, వాటిని సోషల్ మీడియా వేదికలపై పంచుకునేవారు. వాటికి వచ్చే లైకులు చూసి సంబరపడిపోయే వారు. అక్కడి వరకే పరిమితమైతే సరిపోయేది. కానీ, కొందరు మరో అడుగు ముందుకేసి.. సంచలనం సృష్టించాలని, తమ టీవీ చానళ్లకు రేటింగులను పెంచాలనే దురుద్దేశంతో డీప్‌ఫేక్‌ను వాడుకుని సెలబ్రిటీల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సందేశాలు, అసభ్య వీడియోలు సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. అవి నకిలీవని నిరూపించుకునేందుకు బాధితులు నానా తంటాలు పడుతున్నారు. పలు దేశాల్లో నిషేధం.. టిక్‌టాక్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో డ్యాన్సులు, డబ్‌స్మాష్‌తో భారీ డైలాగులు చెబుతూ చాలామంది సంబరపడిపోతారు కదా! ఈ యాప్ కూడా దాదాపు అలాంటిదే. కాకపోతే.. అడ్వాన్స్డ్ వర్షన్. ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ, అనుసరించాలనుకున్న ముఖం కవళికలను ఈ సాఫ్ట్వేర్ ముందే పసిగడుతుంది. మీ బాడీకి ఏ సెలబ్రిటీ శరీరమైతే సరిగ్గా సరిపోతుందో సూచిస్తుంది. దాని ప్రకారం.. మీరు ఏదో వీడియోను చేసి, అందులో మీకు నచ్చిన సందేశం ఇచ్చేయాలి. తరువాత మీ ముఖంపై ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది. (టిక్‌టాక్‌లో మరో డేంజర్ చాలెంజ్) అలా.. మీకు నచ్చిన ప్రముఖుల ముఖంలో మీ ముఖం ఇమడ్చడం, లేదా మీ ముఖంలో ప్రముఖుల ముఖం అమర్చే ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇది. ముఖ కవళికలను ఎవరూ గుర్తుపట్టనంత స్పష్టంగా, నాణ్యంగా ఫొటోలు, వీడియోలు సృష్టించడం దీని ప్రత్యేకత. ఇంకో విషయమేమిటంటే.. ఇందులో సెలబ్రిటీల గొంతుతోనే వీడియో వస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలోని ప్లేస్టోర్లలో ఈ సాఫ్ట్వేర్లను అందించే యాప్‌లు అనేకం ఉన్నాయి. వీటిలో చాలా యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిషేధించాయి. ఉగ్రవాదులు, సైబర్ నేరగాళ్లు ఈ యాప్‌ల సాయంతో మోసాలు, దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని, వీటిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. (సిమ్ కావాలంటే ముఖం స్కాన్ చేయాల్సిందే) -
ముసలి మొహం ప్రైవసీ మాయం!
మీ ఫొటోను ఇష్టమొచ్చినట్టు వాడేసుకుంటామని మీతో ఎవరైనా అంటే ఏం చేస్తారు? ఠాట్.. అస్సలు కుదరదు అంటారు. అయినా అవతలి వాళ్లు ఇవన్నీ లెక్కచేయకపోతే? ఏముంది.. ఫేస్‌యాప్ తరహా వివాదం ఏర్పడుతుంది! ఫేస్‌యాప్.. గత వారం రోజులుగా ప్రపంచమంతా మార్మోగుతున్న స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ పేరు ఇది. మీరో సెల్ఫీ దిగి ఈ యాప్‌లో పెడితే అది మీ ఫొటోను ఎడిట్ చేసి మీరు ముసలివాళ్లయ్యాక ఎలా ఉంటారో చూపిస్తుంది. అంతేదా.. సరదాగా ఉంటుంది. ఓసారి ప్రయత్నించి చూద్దాం అని మీరు అనుకుంటే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఫేస్‌యాప్ ప్రైవసీ అంశాల నిబంధనలే ఇందుకు కారణమని చెబుతున్నారు. రష్యాకు చెందిన వైర్లెస్ ల్యాబ్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఫేస్‌యాప్‌ను మనం వాడటం అంటే.. మన ఫొటోలతోపాటు ఇతర సమాచారం మొత్తం ఆ కంపెనీ చేతుల్లో పెట్టడమే. ఆ కంపెనీ మీ సమాచారాన్ని ఎలాగైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా పంచుకునేందుకు మీరు అంగీకరించడమే. ఇలాంటి ప్రైవసీ నిబంధనలు ఇతర యాప్‌లలోనూ ఉన్నప్పటికీ మనకు ఇష్టం లేకపోతే ఆ సమాచారాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఫేస్‌యాప్‌తో మాత్రం ఇలా కుదరదు. ఒక్కసారి వాడామా.. ఇక జీవితకాలం ఆ సమాచారం ఆ కంపెనీ సొత్తు! వాస్తవానికి ఫేస్‌యాప్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. మనం వృద్ధులుగా మారితే ఎలా ఉంటుందో చూపే ఫీచర్ అప్పటి నుంచే ఉంది కూడా. న్యూరల్ నెట్వర్క్స్ అనే ఆధునిక టెక్నాలజీ సాయంతో జరిగే ఈ ప్రక్రియ మాటెలా ఉన్నా గత వారం రోజుల్లోనే దీనికి విపరీతమైన ప్రాచుర్యం లభించేందుకు మాత్రం చక్ షూమర్ అనే అమెరికా సెనెటర్ కారణమయ్యారు. ఫేస్యాప్లోని ప్రైవసీ నిబంధనలపై అందరూ జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. వైర్లెస్ ల్యాబ్ రష్యాకు చెందింది కావడం.. అమెరికన్ల సమాచారాన్ని (ఫొటో, లొకేషన్ వంటివి) సేకరిస్తుండటం వల్ల భవిష్యత్తులో ఈ సమాచారం ప్రత్యర్థి దేశాలకు చేరితే ప్రమాదమని షూమర్ అంటున్నారు. అమెరికన్ ఎన్నికలను ప్రభావితం చేసేలా పనిచేసిందన్న కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ సంస్థపై చెలరేగిన దుమారం సద్దుమణగక ముందే సోషల్ మీడియాపై ఇలాంటి మరో ఆరోపణ రావడం గమనార్హం. కంపెనీ ఏమంటోంది? వినియోగదారులు ఎంపిక చేసిన ఫొటోలనే తాము న్యూరల్ నెట్వర్క్స్ సాయంతో ఎడిట్ చేసి పంపుతున్నామని, ఈ వ్యవహారం మొత్తం క్లౌడ్ కంప్యూటర్లలో జరుగుతున్న కారణంగా ఫొటోలు కొద్దికాలం అక్కడ నిల్వ ఉండొచ్చని వైర్లెస్ ల్యాబ్ అంటోంది. టెక్ క్రంచ్ అనే వెబ్‌సైట్‌తో సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ప్రతి 48 గంటలకు తాము సర్వర్ల నుంచి ఫొటోలను తొలగిస్తుంటామని స్పష్టం చేసింది. పైగా అందరూ అనుకుంటున్నట్లు తాము రష్యాకు చెందిన క్లౌడ్ సర్వర్లను వాడటం లేదని.. బదులుగా అమెరికా సర్వర్లనే వాడుతున్నామన్నారు. ఈ రకమైన ప్రైవసీ నిబంధనలు మనం ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్న అనేక ఇతర యాప్‌ల లోనూ ఉండటం కొసమెరుపు! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఫేస్బుక్ యూజర్లకు మరోసారి షాక్
-
మరో ప్రమాదంలో ఫేస్బుక్ యూజర్లు
వాషింగ్టన్ : డేటా స్కాండల్ విషయంలో ఫేస్బుక్ యూజర్లు ఇప్పటికే తమ అకౌంట్ సురక్షితమా? కాదా? అని సతమతమవుతుంటే, తాజాగా మరో ప్రమాదం పొంచుకొచ్చింది. తమ సాఫ్ట్‌వేర్‌లో బగ్‌ను గుర్తించామని, అది యూజర్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చేసిందని సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. ఈ బగ్‌కు మే నెలలో 1.4 కోట్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. దీంతో మరోసారి ఫేస్బుక్ ప్రైవసీపై తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. ఫేస్బుక్ తన సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన బగ్ వల్ల.. కేవలం స్నేహితులకు లేదా మీకు మాత్రమే షేర్ చేసుకున్న అంతకముందు పోస్టులు.. పబ్లిక్‌గా వెళ్లిపోయాయి. ఒకవేళ యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్ మారుతున్నట్టు గుర్తించలేకపోతే, వారు ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా.. ప్రమాద పరిస్థితుల్లో వారి పోస్టులు పబ్లిక్‌గా వెళ్లిపోతాయి. అయితే ఈ బగ్ అంతకముందు పోస్టులపై ప్రభావితం చూపలేదని ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఈగన్ చెప్పారు. బగ్ యాక్టివ్‌లో ఉన్న సమయంలో షేర్ చేసుకున్న పోస్టులకు మాత్రమే ఇది ప్రభావితమైందని తెలిపారు. ఒక్కసారి యూజర్లు తమ పోస్టులను సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఫేస్బుక్ మరింత డేటా స్కాండల్ వివాదంలో కూరుకుపోతోంది. ఆపిల్, శాంసంగ్ వంటి 60కి పైగా కంపెనీలతో ఫేస్బుక్ తన యూజర్ల డేటా షేర్ చేసిందని న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. కేవలం ఆ కంపెనీలు మాత్రమే కాక, నాలుగు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కూడా యూజర్ల డేటాను షేర్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ విషయంలో ఈ కంపెనీ తీవ్ర ఇరకాటంలో పడగా.. తాజా డేటా షేరింగ్ స్కాండల్స్ కూడా ఫేస్‌బుక్‌ను దెబ్బకొడుతున్నాయి. తాజాగా కంపెనీ గుర్తించిన బగ్ మే 18 నుంచి మే 27 వరకు యాక్టివ్‌లో ఉన్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఆ సమయంలో ప్రభావితమైన పోస్టులను ఒరిజినల్ ప్రైవసీ పారామీటర్స్‌కు మళ్లీ మార్చలేమని తెలిపింది. యూజర్లు ‘ఫీచర్ ఐటమ్స్’ను తమ ప్రొఫైల్స్‌లోకి షేర్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ తప్పిదం జరిగిందని, దీంతో ఆటోమేటిక్‌గా పోస్టులు, ఫోటో ఆల్బమ్స్ పబ్లిక్కు వెళ్లిపోయాయని పేర్కొంది. -
అకౌంట్ లేకపోయినా.. మీ గుట్టు రట్టు!
వినియోగదారుల డేటా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న ఆరోపణలను ఎట్టకేలకు ఫేస్బుక్ యాజమాన్యం అంగీకరించింది. అయితే తమ సోషల్ నెట్వర్క్ ఖాతాదారుల డేటా ఏ విధంగా సేకరిస్తాయో తెలియజేస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మా సేవలను వినియోగించుకుంటున్న సైట్లనుగానీ, యాప్‌లను గానీ ఎవరైనా ఓపెన్ చేస్తే చాలూ వారి వ్యక్తిగత సమాచారం మాకు చేరిపోతుంది. ఫేస్ బుక్ లాగ్డ్ అవుట్ అయినా.. అసలు అకౌంటే లేకపోయినా అది సాధ్యమవుతుంది. ఇందుకోసం మూడు పద్ధతులు ఉంటాయి. 1. ఆయా సైట్లకు, యాప్‌లకు ఫేస్ బుక్ సేవలు అందించటం. 2. ఫేస్బుక్లో భద్రతా చర్యలను పటిష్టపరిచటం. 3. మా సొంత ఉత్పాదకాలను విస్తృతపరిచే క్రమం.. ఈ మూడు సందర్భాల్లో వినియోగదారుడి సమాచారం ఆటోమేటిక్‌గా మాకు చేరుతుంది ’ అని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డేవిడ్ బసర్ ఓ పోస్ట్‌లో తెలియజేశారు. తద్వారా మిగతా యాప్‌లు, సైట్లు.. ఫేస్‌బుక్‌ను ఎవరెవరు వాడుతున్నారన్న విషయాన్ని కనిపెట్టలేకపోతున్నాయని ఆయన అన్నారు. అయితే యాడ్ల కోసం కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ పద్ధతిని పాటిస్తున్నాయన్న ఆయన.. గూగుల్.. ట్వీటర్ లాంటి దిగ్గజాలు కూడా ఈ విధానాన్నే అవలంభిస్తాయని చెబుతున్నారు. మరోపక్క వినియోగదారుల డేటాను ఫేస్బుక్ దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలను మాత్రం డేవిడ్ బసర్ ఖండించారు. -
గంతలు కడతారు జాగ్రత్త!
ఈ కూపీ వాళ్లకి ఎందుకు? ఇండియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమ సామ్రాజ్య ప్రయోజనాలకు, యుద్ధ ప్రయోజనాలకు, చేసే యుద్ధాలకు ‘సై’ అనిపించడానికి ఇది అవసరం. అమెరికాతో నీవు చేతులు కలపకపోతే నిన్నే తన శత్రువుగా ప్రకటించడానికి సామ్రాజ్య పాలకులు సంకోచించరని గుర్తించాలి. ఆ వైపుగానే ఇపుడు ఆంగ్లో–అమెరికన్ ప్రభుత్వాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానాలను మలచడానికి శక్తిమంతంగా ప్రయత్నిస్తున్నాయి. ‘నా గురించి డేటా కావాలా మీకు? తీసుకోండి బాబూ! కానీ అందుకు ముదరాగా మీరు ప్రతి ఆరునెలలకు నాకు విసుగు పుట్టించే కొత్త పనులు మాత్రం పురమాయించకండి! ఈ డేటా లీకులూ, గోప్యత పైన, ఫేస్బుక్, వ్యక్తుల భోగట్టా గురించి కేంబ్రిడ్జ్ ఎనలిటికా, నరేంద్ర మోదీ (నామో) యాప్, ఆధార్ వంటి కూపీ వ్యవస్థలు– టెక్నాలజీ ఆధారంగా మనం సమకూర్చుకున్న మన డేటాను కాస్తా ఎలా దొంగిలిస్తున్నామో తెలుసు. అయినా ఈ గందర గోళంలో తలదూర్చి ఈత కొట్టదలచలేదు. ఇప్పటికే యావత్తు ప్రపంచానికి తెలిసిపోయింది– తమ నోరు మెదపలేక అలా పడివున్న భారత ప్రజా బాహు ళ్యం ఆ మూగ వేదనలో కొద్ది కిలోల బియ్యం కోసం తమ గోప్యతను కాస్తా సంతోషంతో ఎలా మారకం చేసుకుంటున్నారో తెలిసిపోయింది. బహుశా ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి–ప్రభుత్వమూ, రెండు– కార్పొరేట్ శక్తి. ఇక్కడ ఈ క్షణాన ‘ఆధార్’ సాధికార శక్తిలో దాగి ఉంది. ఇక నుంచి ఈ శక్తి ‘దాయి’ (ఆయా)గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ రెండు శక్తులూ పరస్పరం చేతులు కలిపి ఆధార్‌లో నిక్షిప్తం చేసిన వ్యక్తిగత సమాచారం (డేటా) అంతా భద్రంగానే ఉందని మనకు వందలసార్లు భరోసా ఇచ్చారు. అంటే మీ డేటా అంతా భద్రంగానే ఉంది కనుక ఇక నుంచి దాన్ని గురించి నోరెత్తి చర్చించకండి అని శాసిస్తున్నారు. అలాగే ‘ఫేస్బుక్’ సృష్టించిన జుకర్‌బర్గ్ కూడా తాను ‘మంచి బాలుడనే’నని వెయ్యిన్నొక్కసార్లు ప్రకటించాడు. చివరికి ఇతడిని ప్రధాని మోదీ అక్కున చేర్చుకుని హత్తుకున్నాడు. ఇలా మోదీ హత్తుకున్న వాళ్లంతా ఎంతో కొంత హాని కలిగిస్తారని చెడు తలపెడతారని నేను నమ్మలేను.’ – జి. సంపత్ (ది హిందు సామాజిక వ్యవహారాల విశ్లేషక సంపాదకుడి వ్యంగ్య రచన) ‘నేడు ఇండియాలో ముమ్మరిస్తున్న పరిణామాలు దేశంలో ప్రవేశించిన ఆధునిక వలస విధానంగా తోస్తోంది’ – క్రిస్టోఫర్ వీలీ (భారత్‌లో సమాచార కూపీ, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి అంశాల గురించి ట్విటర్లో బట్టబయలు చేసిన వేగు) క్రిస్టోఫర్ వీలీ తన డాక్యుమెంట్లలో బంధించిన సమాచారాన్నంతా బ్రిటన్ కామన్స్ సభ ‘కల్చర్, మీడియా స్పోర్ట్స్ కమిటీ’ ముందు వెల్లడించాడు. ఈ విషయాలను పరిశీలిస్తే వలస సామ్రాజ్య పాలనావశేషాల నుంచి స్వతంత్ర భారత్ సంపూర్ణ విముక్తిని పొందిన దేశమేనా అని మనకు మనం ప్రశ్నించుకో వలసిన స్థితిలో ఉన్నామని అనిపిస్తుంది. అదే సమయంలో ‘ఆధునిక వలస విధానం ఇలా ఉంటుందన్న భావన’ కలుగుతోందన్నాడు (దిసీజ్ వాట్ మోడ రన్ కలోనియలిజం లుక్స్లైక్) క్రి స్టొఫర్ వీలీ. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశా బ్దాలు గడిచిపోతున్నది. అయినా భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక నైతిక వ్యవస్థలపై పాత, కొత్త వలస పాలకుల కనుసన్నలలోనే ఆంగ్లో–అమెరికన్ బహుళజాతి గుత్త సంస్థలు జోక్యం చేసుకోవడం సహించరాని పరిణామం. అంటే రక్షణ రంగం సహా దాదాపు కీలక రంగాలన్నీ కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ పాలనా వ్యవస్థల కింద విదేశీ, స్వదేశీ గుత్త సంస్థల అదుపాజ్ఞలలోకి వెళ్లి ప్రజా బాహుళ్యం మూల్గులను పీల్చేస్తున్నాయని స్పష్టమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం కాస్తా విదేశీ వాస్కోడిగామాల అడ్డాగా మార్చుతున్నారు. సాంకేతికత వెనుక సంక్షోభం భారత ఎన్నికల వ్యవస్థలోకి చొరబడిన కేంబ్రిడ్జ్ ఎనలిటికా, క్రిస్టోఫర్ వీలీ సమాచారం వికేంద్రీకరణ పేరిట, ఆధునిక టెక్నాలజీ ముసుగులో ప్రవేశిం చిన ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ట్వీటర్ వగైనా సోషల్ మీడియాను ప్రయోజనకర కార్యకలాపాలకు వినియోగించడం లేదు. దోపిడీ వ్యవస్థల రక్షణ కోసం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే రాజకీయ పక్షాలకు వాటి నాయకత్వాలకు ఎన్నికలలో ఉపయోగపడేటట్టూ చేస్తున్నారు. ఎన్నికలలో ఫలితాలను తమకు సానుకూలంగా మార్చుకు నేందుకు అనుకూల ఏజెన్సీల ద్వారా సోషల్ మీడియాలో ద్వారా ప్రచార ‘ఊదర’ కొట్టుకుని, ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడానికి ఈ సంస్థలు పనిచేయడం– బీజేపీ 2012 నుంచి ప్రవేశపెట్టిన ఫలితమే. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఇందుకు తెర తీసిన పెద్దమనిషి అరవింద్ గుప్తా. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పదిని వందగా చూపే సంఖ్యల తారుమారు విద్యలో డిజిటల్ మీడియా మ్యానిప్యులేటర్‌గా అతడే పనిచేశాడు. సంఖ్యా శాస్త్రాన్ని డిజిటల్ మీడియా ద్వారా ఎలా దుర్వినియోగం చేయవచ్చునో నిపుణులు నాకు చెప్పారు. ఇంతకు ముందు కృత్రిమ విద్య ద్వారా మనం స్నేహితులను జయించడం ఎలాగో కొందరు పుస్తకాలు రాశారు. అలాగే ఎన్నికలలో ఓడవలసిన వాడు కూడా డిజిటల్ టెక్నాలజీ సాయంతో ప్రచారం ద్వారా ఓటింగ్ ఫలితాన్ని ఎలా తారుమారు చేయవచ్చునో 2014 ఫలితాలు నిరూ పించాయి. ఒక నాయకుడు ఎన్నికలు, ఓటింగ్‌లకు ఆరు నెలలకు ముందే తానే ‘వస్తున్నాడు, వచ్చేస్తున్నాడ’ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో విజ యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇందుకు కాంగ్రెస్ పాలన తప్పిదాలు ఆ ఊదరకు దోహదం చేయడం యాదృచ్ఛికం. ఆ తర్వాత శ్రీలంక ఎన్నికల్లో ప్రజా కంటకునిగా మారిన అధ్యక్షుడు రాజపక్సకు సాయంగా బీజేపీ డిజిటల్ టెక్నాలజీ నిపుణుడిని పంపడం, అది తెలిసిన పాత్రికేయులు ‘మీ రాకలో రహస్యమేమిట’ని ప్రశ్నిస్తే ‘‘ఆ విషయం మీకు చెప్పవలసిన పనిలేద’’ని ఆ నిపుణుడు ఎదురు మాట్లాడ్డం గురించి ఆనాడు కొన్ని పత్రికలు ఒక మూలకు తోసేశాయి. దండగమారి చెత్త అమెరికా పత్రికా ప్రపంచంలోనూ, సీఎన్ఎన్ చానల్లోనూ, ‘న్యూయార్క్ టైమ్స్’లోనూ ప్రసిద్ధుడు బి.జె. మెండెల్సన్ సోషల్ మీడియా పేరిట చెలా మణి అవుతున్న కొన్ని శాఖలను ‘దండుగమారి చెత్త’గా (సోషల్ మీడియా ఈజ్ బుల్షిట్) 2012 లోనే వర్ణించాడు. ఆ పేరిటనే రాసిన గ్రంథంలో ఈ ప్రచార సాధనాన్ని మార్కెటింగ్ వ్యూహ రచనా మాధ్యమంగా వర్ణించాడు. 1998 నుంచీ మార్కెటింగ్ ప్లాట్ఫాంగానే ఈ వెబ్ వేదిక వ్యవహరిస్తూ వచ్చిం దని పేర్కొన్నాడు. సోషల్ మీడియా పేరిట చెలామణిలో ఉన్న చాలా వెబ్ సైట్స్ ఇండియాలో ఇటీవల కాలంలో పడిన ‘పాటు’ అంతా ఏమిటి? ఆ విష యాన్ని కూడా క్రిస్టొఫర్ వీలీ బట్టబయలు చేశాడు: ‘ఇండియాలోని ఏడు లక్షల గ్రామాలలో, 600 జిల్లాల్లో ఈ విదేశీ వెబ్ మాధ్యమాలు సమాచారం సేకరించాయి. వీటి సాయంతో రాజకీయ పార్టీల కక్షిదారులెవరో (ఆదరణ పొందగోరినవారు) కూపీ లాగి ఆయా రాజకీయ పార్టీలు సదరు ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాయి. తద్వారా అనుకున్న సానుకూల ఫలితాన్ని రాబట్టుకోడానికి ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఇదే ఆధునిక వలస విధాన ప్రక్రియ’’ అన్నాడు వీలీ. ఎస్.సి.ఎల్ ఇండియా అనే కంపెనీ కేంద్ర కార్యాలయం ఘజియాబాద్‌లో ఉంది. అనేక రాష్ట్రాలలో కార్యా లయాలున్నాయి. ఈ కూపీ యంత్రాంగాన్ని బీజేపీ రాజస్తాన్ ఎన్నికల్లో ఉపయోగించింది. ఫేస్బుక్ నిర్మాత ఎఫ్.బి. వాడకందార్ల యంత్రంలో నమో దైన వారి సమాచారాన్ని, నంబర్లను తస్కరించి అమెరికా, బ్రిటన్లకు పంపించే వీలు కల్పించి, జుకర్‌బర్గ్ కాస్తా ‘జోకర్’బర్గ్ అయ్యాడు. మన డేటా అంతా అమెరికన్ కంపెనీలకు చేరిన తర్వాత ‘క్షమించాలి, తప్పు చేశా’నని అతడు లెంపలు వాయించుకున్నా, జరగవలసిన అన్యాయం జరిగిపోయింది. అలాగే ‘ఆధార్’ డేటా అంతా (మన కళ్ల కదలికలతో సహా– ఐరిష్ పరీక్ష) అమెరికా, బ్రిటన్లలో నమోదైపోయింది. ఈ కూపీ వాళ్లకి ఎందుకు? ఇండియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమ సామ్రాజ్య ప్రయోజనాలకు, యుద్ధ ప్రయోజనాలకు, చేసే యుద్ధాలకు ‘సై’ అనిపించడానికి ఇది అవసరం. అమెరికాతో నీవు చేతులు కలపకపోతే నిన్నే తన శత్రువుగా ప్రకటించడానికి సామ్రాజ్య పాలకులు సంకోచించరని గుర్తించాలి. ఆ వైపుగానే ఇపుడు ఆంగ్లో–అమెరికన్ ప్రభుత్వాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానాలను మలచడానికి శక్తిమంతంగా ప్రయత్నిస్తు న్నాయి. మన ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాల పునరుద్ధరణకు, శాంతి ప్రతిష్టాపనకు గల అవకాశాల్ని కూడా నిరోధించగల్గుతున్నాయి. ‘కేంబ్రిడ్జి ఎనలిటికా’ ఇండియాలో తిష్ట వేయడానికి కారణం ఈ విన్యాసంలో భాగమే. రాజకీయ పార్టీలు కులాలను విభజించి ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందవచ్చునో దశాబ్దాలుగా వ్యూహాలు సాగిస్తూనే ఉన్నాయి. కుల వ్యవస్థ మూలాలనీ, కుల, మత వైమనస్యాలనూ చెక్కు చెదరకుండా కాపాడగోరే రాజకీయ పార్టీలకు వెన్నుదన్నుగా ఉండటం కూడా ఆ సంస్థ ధ్యేయమే. తద్వారా భారత సామాజిక, రాజకీయ వ్యవస్థను సెక్యులర్ రాజ్యాంగానికి దూరంగా ఉంచడం కూడా. అందుకే ప్రధానమంత్రి ‘యాప్’ సహితం సోషల్ మీడి యాలో వినియోగదార్ల అనుమతి లేకుండా వారి డేటాను వాడుకుంటోందన్న ఆరోపణకు గురి కావలసి వచ్చింది. ‘నమో (మోదీ) యాప్’ ద్వారా భారత వినియోగదార్ల ‘డేటా’ను కాస్తా దొంగిలించడం జరిగిందని ఫ్రెంచి హేకర్ వెల్లడించాడు. మోదీ యాప్ డేటా ‘అమెరికన్ కంపెనీలలోని ఆయన స్నేహి తులకు’ చేరిందని కూడా ఆ ఫ్రెంచి హాకర్ వెల్లడించాడని వార్త. మున్ముందు వీర విహారం 2014 ఎన్నికలతో ముమ్మరంగా ప్రారంభమైన ఈ ‘డిజిటల్ మాయాజాలం’ 2019 సాధారణ ఎన్నికల నాటికి మరింతగా జడలు విప్పుకుని రాజకీయుల ‘నర్తనశాల’ను చూపించవచ్చు. ఎందుకంటే ‘ఫేస్బుక్’ వ్యవస్థాపక అధ్య క్షుడు సీన్పార్కర్ ‘సమాజంతో మీకున్న సంబంధ బాంధవ్యాలను ఫేస్బుక్ తారుమారు చేస్తుందన్నది అక్షరసత్యం’ అన్నాడంటే వచ్చేవి చెడ్డ రోజులా, మంచి రోజులా అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే ఫేస్బుక్ అనేది డేటా దొంగతనానికి పెట్టింది పేరనీ, ఆ మాటకొస్తే ఘరానా సోషల్ నెట్వర్క్ అనీ, దొంగ బుద్ధులకు నిలయమనీ, అందుకనే అది అమెరికన్లకు శిరోధార్యమైం దనీ అమెరికా నిపుణులే వాపోతున్నారని మరువరాదు. బానిసల, నీగ్రోల విమోచన ప్రదాత, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి: ‘‘ప్రజలలోనే నా ప్రగాఢ విశ్వాసమంతా. ఎలాంటి జాతీయ విపత్తు కైనా, సంక్షోభాన్నయినా ఎదుర్కోడానికి ప్రజలనే విశ్వసించాలి. అసలు విషయం ఏమిటంటే, ముందుగా వారికి అబద్ధాలను, అసత్యాలను తెల్పకుండా నికా ర్సయిన నిజాలను వారి ముందుంచాలి. పాలకులపై విశ్వాసానికి అదే మూల స్తంభం’’! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అలర్ట్ : ప్రమాదంలో వాట్సాప్ యూజర్లు
మెసేజింగ్ మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ యూజర్లు ప్రమాదంలో పడబోతున్నారు. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసిన ఒక కొత్త యాప్, యూజర్లు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎవరితో ఛాటింగ్ చేస్తున్నారు వంటి వివరాలను బహిర్గతం చేస్తుంది. ఈ యాప్ పేరు ఛాట్వాచ్గా తెలుస్తోంది. ఛాట్డబ్ల్యూగా ఇది అందుబాటులో ఉందట. ఈ యాప్ ద్వారా మీ వాట్సాప్ కాంటాక్ట్‌లు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు? ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఛాటింగ్ చేసుకుంటున్నారు? వంటివి రాబట్టవచ్చని తెలుస్తోంది. ‘లాస్ట్ సీన్’ తీసేసినప్పటికీ, వాట్సాప్ కాంటాక్ట్‌ల యాక్టివిటీని ఇది కనిపెట్టేస్తుందట. అయితే ఈ యాప్ ఉచితంగా కాకుండా.. వారానికి రూ.140 చెల్లించి దీన్ని వాడుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల వరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్ ఐఓఎస్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న ఈ ఛాట్డబ్ల్యూ యాప్, ఒక్కసారిగా రిపోర్టులు వాట్సాప్ యూజర్లను అలర్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత, డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పలు వెబ్సైట్లలో దీని ఏపీకే అందుబాటులో ఉందని, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలుంటుందని, వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. వాట్సాప్‌లో ఛాట్‌లో ఉన్నప్పుడు మీ గురించి ఎవరైనా అన్ని వివరాలు తెలిసినట్టు చెబితే, అనుమానించాల్సి ఉందని రిపోర్టులు వార్నింగ్ ఇస్తున్నాయి. మీరు ఛాట్వాచ్లో బారిని పడినట్టు గుర్తించాలని పేర్కొంటున్నాయి. ఏ సమయంలో మీ వాట్సాప్ స్నేహితులు నిద్రపోతున్నారు, ఏ సమయంలో లేస్తున్నారు, ఏ సమయంలో ఛాటింగ్ చేస్తున్నారు, ఎవరితో ఎక్కువగా ఛాట్ చేస్తున్నారు వంటి వివరాలను ఈ యాప్ బహిర్గతం చేస్తోందని తెలుస్తోంది. ఈ యాప్‌తో మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల, ఉద్యోగుల వాట్సాప్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ యాక్టివిటీ ఇట్టే పట్టేయొచ్చట. అయితే వాట్సాప్ యాప్ ఫుల్ ఎండ్‌టూఎండ్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉందని, మూడో వ్యక్తులు వాట్సాప్ యూజర్ల గోప్యతను దొంగలించడానికి కుదరదని ఓ వైపు ఆ కంపెనీ చెబుతున్నప్పటికీ, ఇలాంటి యాప్‌ల ద్వారా వాట్సాప్ యూజర్ల వివరాలు బయటికి వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని టెక్ వర్గాలంటున్నాయి. -
డేటా బ్రీచ్: ఫేస్బుక్ కొత్త ఫీచర్
కోట్లాదిమంది వ్యక్తిగత సమాచారం లీక్ అయిందన్న దుమారంనుంచి బయటపడేందుకు సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ దిద్దుబాటు చర్యలకు దిగింది. యూజర్ డేటా బ్రీచ్‌ను అడ్డుకునేందుకు ప్రైవసీ కంట్రోల్లో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో ఫేస్బుక్లోతాజాగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నామని బుధవారం ప్రకటించింది. యూజర్ల గోప్యతను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ‘యాక్సెస్ యువర్ ఇనఫర్మేషన్’ అనే కొత్త ఫీచర్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు డేటా చోరీలో థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్లకు చెక్ పెట్టేలా 'పార్టనర్ కేటగిరీలను' మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. రాబోయే వారాలలో డేటా సెక్యూరిటీ యూజర్ల నియంత్రణలో ఉంచడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి ఎరిన్ ఎగాన్, డిప్యూటీ జనరల్ న్యాయవాది అషిలే బెరింగ్గెర్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. వినియోగదారులకు వారి సమాచారం భాగస్వామ్యంపై మరింత నియంత్రణ ఇవ్వాలనే యోచనలో ఈ కొత్త గోప్యతా టూల్ ను పరిచయం చేయనున్నట్టు చెప్పింది. మెనూలో సెక్యూరిటీ షార్ట్‌కట్స్ ద్వారా యూజర్ల ఫేస్బుక్ ఖాతాలకు అదనపు భద్రతను అందించడంతోపాటు , వినియోగదారులు డేటా, యాక్టివిటీపై ఇతరుల యాక్సెస్‌ను మరింత నియంత్రిచుకోవచ్చని, యాడ్స్‌కు కూడా చెక్ పెట్టవచ్చని తెలిపారు. అయితే ఇది ఇంకా ప్రయోగదశలో ఉందనీ, త్వరలోనే ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించారు. కాగా ఫేస్బుక్ డేటాలీక్ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో సాధారణ యూజర్నుండి సెలబ్రిటీల దాకా ఫేస్బుక్ ఖాతా గోప్యతపై అందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వాట్సాప్ కో ఫౌండర్ బ్రియాన్ ప్రకనటతో డిలీట్ ఫేస్బుక్ ఉద్యమం మరింత ఊపందుకుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ ఫేస్బుక్ అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలిసిందే. -
ఫేస్‌బుక్‌కు భారీ షాక్!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ చిక్కుల్లో పడింది. తాజాగా యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాలకు సంబంధించి విచారణ నేపథ్యంలో గణనీయమైన వ్యాపార నష్టాలను ఎదుర్కొంటోంది. 50 మిలియన్ల మంది ఫేస్బుక్ ఖాతాల వివరాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలు ఫేస్బుక్ షేర్‌ను తీవ్ర నష్టాల్లోకి జార్చాయి. అంతేకాదు మార్కెట్ క్యాప్ రాత్రికి రాత్రే తీవ్రంగా నష్టపోయింది. డాటా బ్రీచ్ వార్తలతో మార్క్ జుకర్‌బర్గ్ 2004 లో స్థాపించిన ఫేస్బుక్ విలువలో 40 బిలియన్ డాలర్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. 2004 తరువాత ఇదే అతిపెద్ద క్షీణత అని ఎనలిస్టులు చెబుతున్నారు. ట్రంప్ ఎన్నికల సభలకు సంబంధించిన అంశాలు 5కోట్లమంది ఫేస్బుక్ యూజర్లకు ఎలా అందాయన్న అంశంపై యూఎస్, యూరోపియన్ న్యాయశాఖ అధికారులు ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌ను విచారించారన్న అంశం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైంది. దీంతో ఫేస్‌బుక్‌సహా టెక్నాలజీ దిగ్గజాలపై నియంత్రణలు పెరగవచ్చన్న అంచనాలు టెక్నాలజీ కౌంటర్లను దెబ్బతీసినట్లు నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో ఫేస్బుక్ 7 శాతం దిగజారింది. అల్ఫాబెట్ 3 శాతం, మైక్రోసాఫ్ట్ 2 శాతం, యాపిల్ 1.5 శాతం చొప్పున పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఫేస్బుక్ కారణంగా టెక్నాలజీ దిగ్గజాలలో భారీ అమ్మకాలు నమోదుకావడంతో ప్రధానంగా సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. -
‘ఆధార్ దుర్వినియోగానికి చెక్’
సాక్షి, బెంగళూర్ : ఆధార్ రాజ్యాంగ చెల్లుబాటుపై వాదవివాదాలు చెలరేగుతుంటే పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇది ఉపకరిస్తుందని ఐటీ దిగ్గజం మోహన్‌దాస్ పాయ్ అన్నారు. ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు గోప్యత చట్టాలను తీసుకురావాలని సూచించారు. పేదలతో పాటు ప్రజల సాధికారతకు ఆధార్ మెరుగైన వనరుగా ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్‌లో నిక్షిప్తమైన ఐరిస్ లేదా ఫింగర్‌ప్రింట్ డేటాకు సంబంధించిన ఉల్లంఘనలు ఎక్కడా చోటుచేసుకున్న ఉదంతాలు లేవని గుర్తుం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఆధార్ గోప్యతకు సంబంధించిన చర్యలపై యూఐడీఏఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆధార్ డేటా ఉల్లంఘనలపై జనవరి 5న యూఐడీఏఐ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. గుర్తుతెలియని నిందితులని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. మరోవైపు ఆధార్ డేటా బహిర్గతమైన ఉదంతాల నేపథ్యంలో అసలు ఆధార్‌నే విస్మరించడం సరైంది కాదని బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. -
ఫేస్బుక్, వాట్సాప్‌లపై సుప్రీం సీరియస్
పేరెంట్ కంపెనీ ఫేస్బుక్, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.. వాట్సాప్‌లో పంపే సందేశాలను ఫేస్బుక్ యాక్సస్ చేస్తుందని, ఎన్ని సెక్యురిటీ ఫీచర్స్ ఉన్నా దాన్ని ఫేస్బుక్ ఉల్లంఘిస్తోందని వెల్లువెత్తిన ఫిర్యాదులపై విచారించిన సుప్రీంకోర్టు, ఆ రెండు కంపెనీలకు అక్షింతలు వేసింది. వాట్సాప్ మెసేజ్ ఎన్‌క్రిప్ట్ అయినా బయటకు ఎలా పొక్కుతుందని ప్రశ్నించింది. ఇది వినియోగదారుల సమాచార గోప్యతకు భంగం వాటిల్లినట్టు కాదా? అని సీరియస్ అయింది.. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ రెండు కంపెనీలకు నోటీసులు జారీచేసింది. సోషల్ మీడియాపై మీ పాలసీ ఏమిటో తెలుపాలని కూడా ఆదేశించింది. దేశంలో సోషల్ మీడియాకు ఎలాంటి విధానం ఉండాలనుకుంటున్నారో తెలుపాలంటూ ఇటు టెలికాం రెగ్యులేటరి అథారిటీ(ట్రాయ్)కి, కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.. ఈ విషయంలో సమగ్రంగా పరిశోధన జరిపి, నివేదిక అందించాలని అటార్ని జనరల్ ముకల్ రోహత్గీకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. మార్కెటింగ్, కమర్షియల్ అడ్వర్టైజింగ్ కోసం తన పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ కొన్ని నెలల క్రితమే ఓ కొత్త పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ తీసుకొచ్చినప్పటి నుంచి వాట్సాప్‌కు చిక్కులెదురవుతున్నాయి. మనదేశంలోనే కాక, ఇతర దేశాల్లోనూ ఈ పాలసీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూజర్ల డేటాను షేర్ చేయడం వ్యక్తిగత ప్రైవసీకి భంగమని ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్‌ను ఫేస్బుక్ తప్పుదోవ పట్టిస్తుందంటూ గత నెల యూరోపియన్ కమిషన్ కూడా అభిప్రాయపడింది. యూరప్‌లో ఈ విషయంపై తీవ్ర ఎత్తున్న ఆందోళనలు వస్తుండటంతో, రెండు కంపెనీలు డేటా షేరింగ్‌ను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు ఫేస్బుక్ పేర్కొంది.