
సాక్షి, బెంగళూర్ : ఆధార్ రాజ్యాంగ చెల్లుబాటుపై వాదవివాదాలు చెలరేగుతుంటే పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇది ఉపకరిస్తుందని ఐటీ దిగ్గజం మోహన్‌దాస్ పాయ్ అన్నారు. ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు గోప్యత చట్టాలను తీసుకురావాలని సూచించారు. పేదలతో పాటు ప్రజల సాధికారతకు ఆధార్ మెరుగైన వనరుగా ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆధార్‌లో నిక్షిప్తమైన ఐరిస్ లేదా ఫింగర్‌ప్రింట్ డేటాకు సంబంధించిన ఉల్లంఘనలు ఎక్కడా చోటుచేసుకున్న ఉదంతాలు లేవని గుర్తుం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఆధార్ గోప్యతకు సంబంధించిన చర్యలపై యూఐడీఏఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆధార్ డేటా ఉల్లంఘనలపై జనవరి 5న యూఐడీఏఐ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. గుర్తుతెలియని నిందితులని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.
మరోవైపు ఆధార్ డేటా బహిర్గతమైన ఉదంతాల నేపథ్యంలో అసలు ఆధార్‌నే విస్మరించడం సరైంది కాదని బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు.