Mohandas Pai
-
ఈ ఏడాది ఐటీ కొలువులు లేనట్టే!
సాక్షి, బెంగళూరు: : కరోనా కల్లోలంతో సంక్షోభంలో పడిన ఐటీ రంగానికి సంబంధించి, ప్రముఖ ఐటీ నిపుణుడు ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆందోళనకర అంచనాలను వెలువరించారు. భారత ఐటీ రంగంలో కోవిడ్-19 మహమ్మారి ప్రతికూల ప్రభావం కారణంగా ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన ఉండబోదని వ్యాఖ్యానించారు. అలాగే సీనియర్ స్థాయి సిబ్బందికి 20-25శాతం జీతం కోత వుంటుందన్నారు. లాక్డౌన్ కారణంగా దాదాపు అన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారనీ, ఇది ఇకముందు కూడా కొనసాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. (కరోనాపై పోరు : ఏడీబీ భారీ సాయం) ఐటీ పరిశ్రమలు ఈ ఏడాది కొత్తగా ఎవర్ని ఉద్యోగాల్లోకి తీసుకోవని, అయితే ఇప్పటికే ఇచ్చిన కమిట్మెంట్లను పరిగణనలోకి తీసుకుంటాయని మోహన్‌దాస్ అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సమస్యలు ఎదురవుతున్నాయని, లాక్‌డౌన్‌తో ఐటీ ఇండస్ట్రీలోని 90 శాతానికిపైగా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల ఇళ్లలో మౌలిక సదుపాయల కల్పన, ఆయా కంపెనీల క్లైంట్ల నుంచి భద్రతాపరమైన అనుమతి లభించడంతో వర్క్‌ఫ్రం హోం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయమని చెబుతాయన్నారు. ప్రైవేటు ఈక్విటీ ఫండ్ ఆరిన్ క్యాపిటల్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ మాట్లాడుతూ లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ 25 నుంచి 30 శాతం మంది ఉద్యోగులను వర్క్‌ఫ్రం హోంకు అనుమతిస్తామని చెప్పారని పాయ్ తెలిపారు. ఇక కార్యాలయాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఐటీ సెక్టార్లో కార్యాలయాలు మరింత విస్తరించడానికి అధికంగా స్థలం అవసరం అవుతుందని తాను భావించడం లేదన్నారు. 25శాతం మంది ఉద్యోగులను ఇంటి వద్దనుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సిబ్బందితో కార్యాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల వచ్చే ఏడాది వరకు ఇప్పటి కార్యాలయాల్లోనే యధావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ) ఒక వేళ ఎవరైనా ఒక ఉద్యోగి జాబ్ మానేసినప్పటికీ ఆ స్థానాన్ని భర్తిచేయరని కూడా పాయ్ చెప్పారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల క్లైంట్లు ఎక్కువ మంది తమ కార్యాలయాలను ఇప్పటికీ తెరవలేదు. అందువల్ల ఐటీ కంపెనీలు రెండు మూడు త్రైమాసికాల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటాయని, దాదాపు ఎలాంటి నియామాకాలు జరగబోవని చెప్పారు. అయితే వచ్చే ఏడాది నియామకాలు జరిగే అవకాశం వుందని అనుకుంటున్నానని పాయ్ వెల్లడించారు. (రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్) -
ఈ–కామర్స్ నిబంధనలు సరైనవే
ముంబై: విదేశీ పెట్టుబడులున్న ఈ– కామర్స్ కంపెనీలకు సంబంధించి కేంద్రం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు కారు చౌక రేట్లతో.. స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయన్నారు. భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్ 2019 స్టార్టప్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, ఈ నిబంధనలు కొంత సముచితమైనవేనన్నారు. మరోవైపు, ఇందులో వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చే కోణం కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాల కోణమే ఎక్కువగా కనిపిస్తోందని సదస్సులో పాల్గొన్న స్టార్టప్ సంస్థల లాయర్ కరణ్ కల్రా వ్యాఖ్యానించారు. ఒక ప్రత్యేక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లుగా అనిపిస్తోందని సీనియర్ లాయర్ నిశిత్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీలు.. తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫాంపై 4 లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి. ఆశావహంగా వాల్‌మార్ట్.. నిబంధనలు కఠినం చేసినప్పటికీ భారత మార్కెట్‌పై ఆశావహంగానే ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ వెల్లడించింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ ఏషియా రీజనల్ సీఈవో డర్క్ వాన్ డెన్ బెర్గీ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు ..రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
ఐటీలో 5లక్షల ఉద్యోగాలు
దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు ఏడేళ్ల పాటు స్థిరంగా ఉండిపోయిన ఎంట్రీ స్థాయి ఉద్యోగుల జీతభత్యాల ప్యాకేజీలు గతేడాది సుమారు 20 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2018 సమీక్ష, 2019 అంచనాల మీద మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. "2018లో హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో భారత ఐటీ కంపెనీలు జపాన్, ఆగ్నేయాసియా దేశాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ సేవల రంగం మళ్లీ వృద్ధి బాట పడుతోంది. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ మంత్రి కేటీఆర్ మార్కెటింగ్ నైపుణ్యాలతో మరిన్ని కొత్త కంపెనీలు హైదరాబాద్‌కి వస్తున్నాయి. హైదరాబాద్ హాట్ డెస్టినేషన్‌గా మారింది" అని పాయ్ పేర్కొన్నారు. స్టార్టప్‌లలో 2 లక్షల ఉద్యోగాలు దేశీ స్టార్టప్ సంస్థలు వచ్చే ఏడాది సుమారు 2,00,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పాయ్ తెలిపారు. స్టార్టప్స్ గతేడాది 1,50,000 మందిని నియమించుకున్నాయని.. ప్రస్తుతం వీటిల్లో ఉద్యోగుల సంఖ్య 6,00,000 పైచిలుకు ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీ సర్వీసులు, స్టార్టప్స్ కలిస్తే 4.5 లక్షలు - 5 లక్షల దాకా నియామకాలు ఉండొచ్చన్నారు. 2018లో ఇవి రెండూ కలిపి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు వివరించారు. "స్టార్టప్‌లు కూడా పెద్ద కంపెనీలుగా ఎదుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 39,000 పైచిలుకు స్టార్టప్స్ ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొత్తగా 5,000 ఏర్పడుతున్నాయి. ఇవి హైరింగ్ చేపట్టినప్పుడు ఇంజినీర్లే కాకుండా వివిధ రకాల ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రకంగా వీటిల్లోనూ ఉద్యోగావకాశాలు గణనీయంగా ఉన్నాయి" అని పాయ్ తెలిపారు. ఎంట్రీ లెవల్లో రూ.5 లక్షలు? ఐటీ సేవల సంస్థల్లో ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందుతుండటం రెట్టింపు స్థాయిలో జరుగుతోందని, ఐటీ కంపెనీల్లో డిజిటల్ విభాగాల ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోందని పాయ్ చెప్పారు. ‘‘ఫ్రెషర్స్ జీతభత్యాల ప్యాకేజీ చాలా కాలం తర్వాత 20 శాతం మేర పెరగడం మంచి పరిణామం. మరింత సుశిక్షితులైన నిపుణులను ఆకర్షించేందుకు కంపెనీలు మరింత ఎక్కువ జీతభత్యాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు ప్రస్తుతం వార్షికంగా రూ. 4.5 - 5 లక్షల దాకా ఉంటున్నాయి. నిజానికి చాలా కాలం పాటు ఎంట్రీ లెవెల్లో జీతాలు పెరగకుండా స్థిరంగా ఉండిపోయాయి. దీంతో ఉద్యోగులు నిరాశలో మునిగారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పోలిస్తే పెద్ద నగరాల్లో డెలివరీ బాయ్స్ కూడా నెలకు రూ.50,000 సంపాదిస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం" అని పాయ్ వ్యాఖ్యానించారు. డిజిటైజేషన్‌తో వ్యాపార అవకాశాలు వచ్చే ఏడాది డిజిటైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అమెరికా బ్యాంకింగ్.. ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా ఐటీపై వెచ్చించనుండటం తదితర అంశాలు భారత ఐటీ కంపెనీలకు వృద్ధి అవకాశాలు కల్పించగలవని పాయ్ చెప్పారు. యూరప్, ఆసియా మార్కెట్లలోకి కూడా చొచ్చుకుపోయేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే, అమెరికాలో లోకలైజేషన్ ప్రధాన సవాలుగా ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుతం అమెరికా విధానాలకు అనుగుణంగా స్థానికంగా నియామకాలు చేపట్టడం, కార్యకలాపాలు విస్తరించడం వంటి అంశాలపై దేశీ ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయన్నారు. అయితే, ఎక్కువగా చిన్న పట్టణాల్లో విస్తరిస్తుండటం వల్ల.. వాస్తవంగా ఖర్చులు పెరగడం కన్నా తగ్గగలవని పాయ్ పేర్కొన్నారు. -
‘ఆ పది కోట్ల మంది ఉద్యోగాలకు పనికిరారు’
సాక్షి, న్యూఢిల్లీ : అపార మానవ వనరులతో అవకాశాల గనిగా పేరొందిన భారత్ తన ప్రతిష్టను కోల్పోనుందా అనే ఆందోళన రేకెత్తుతోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు దీటుగా ఎదగని కోట్లాది యువత నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా మిగిలే ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 21 నుంచి 35 ఏళ్ల మధ్యన ఉన్న పదికోట్ల మంది యువత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకు దీటుగా మెరుగైన నైపుణ్యాలను సంతరించుకోలేదని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి భారత్‌లో మరో పది కోట్ల మంది నాణ్యత లేని మానవ వనరులు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని, దీంతో 21 నుంచి 45 ఏళ్ల వయసుగల ఉద్యోగుల్లో తక్కువ నాణ్యత, దిగువ స్థాయి విద్యార్హతలతో ఉన్న సిబ్బంది సంఖ్య 20 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. పదేళ్ల యూపీఏ హయాంలో విద్యా సంస్కరణలు లోపించడమే ఈ దుస్థితికి కారణమని గతంలో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా వ్యవహరించిన పాయ్ విమర్శించారు. విద్యా సంస్కరణల ఫలితాలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టినా పదేళ్లకు వాటి ఫలాలు అందివస్తాయని ఫలితంగా ఒక తరం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నారు. ఈ నష్టాన్ని నివారించడమే ప్రస్తుతం మన ముందున్న సవాల్ అన్నారు. -
‘ఆధార్ దుర్వినియోగానికి చెక్’
సాక్షి, బెంగళూర్ : ఆధార్ రాజ్యాంగ చెల్లుబాటుపై వాదవివాదాలు చెలరేగుతుంటే పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇది ఉపకరిస్తుందని ఐటీ దిగ్గజం మోహన్‌దాస్ పాయ్ అన్నారు. ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు గోప్యత చట్టాలను తీసుకురావాలని సూచించారు. పేదలతో పాటు ప్రజల సాధికారతకు ఆధార్ మెరుగైన వనరుగా ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్‌లో నిక్షిప్తమైన ఐరిస్ లేదా ఫింగర్‌ప్రింట్ డేటాకు సంబంధించిన ఉల్లంఘనలు ఎక్కడా చోటుచేసుకున్న ఉదంతాలు లేవని గుర్తుం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఆధార్ గోప్యతకు సంబంధించిన చర్యలపై యూఐడీఏఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆధార్ డేటా ఉల్లంఘనలపై జనవరి 5న యూఐడీఏఐ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. గుర్తుతెలియని నిందితులని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. మరోవైపు ఆధార్ డేటా బహిర్గతమైన ఉదంతాల నేపథ్యంలో అసలు ఆధార్‌నే విస్మరించడం సరైంది కాదని బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. -
పీఎంఓలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఐటీని కొత్తపుంతలు తొక్కించేందుకు వివిధ శాఖలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి (సీఐఓ)ని నియమంచాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ సూచించారు. సమర్ధ టెక్నాలజీ విధానం కోసం ప్రభుత్వం సీఐఓను నియమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ వ్యూహాల రూపకల్పనతో పాటు వివిధ శాఖలతో సమన్వయం కోసం ఈ ఏర్పాటు ఉండాలని చెప్పారు. బిగ్ డేటాను సమర్ధంగా నిర్వహించేందుకు భారత్‌కు చీఫ్ డేటా సైంటిస్ట్ అవసరమని అన్నారు. పలు ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌ను అనుసంధానిస్తుండటంతో సీఐఓ పాత్ర అత్యంత కీలకంగా మారుతుందని చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఆధార్ నెంబర్‌తో ఆర్థిక లావాదేవీలను టెక్నాలజీని అనుసంధానించి మిళితం చేయనుంది. వైట్ హౌస్ సీఐఓ మాదరిగానే సీఐఓ కేంద్ర ప్రభుత్వంతో ఐటీ మౌలిక సదుపాయాలకు సంధానకర్తగా ఉంటారని అధికారులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం వెచ్చించే ఐటీ వ్యయాలకు కూడా వైట్‌హౌస్ సీఐఓ బాధ్యత వహిస్తారు. -
చేతకాకే మూర్తిపై నిందలు
సిక్కా రాజీనామాపై ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ పాయ్ మండిపాటు చెత్త పనితీరును కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలని వ్యాఖ్య బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈఓ పదవికి అర్ధంతరంగా గుడ్‌బై చెప్పిన విశాల్ సిక్కాపై కంపెనీ మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిక్కా తన చెత్త పనితీరును కప్పిపుచ్చుకోవడానికే మూర్తిపై ఆరోపణలు గుప్పించారని.. చేతకాక పదవినుంచి తప్పుకున్నారని ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ మండిపడ్డారు. తనపై పదేపదే నిరాధార ఆరోపణలు, వ్యక్తిగతంగా కూడా దూషణలను భరించలేకపోవడంవల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ఫీని వీడుతున్నానంటూ రాజీనామా లేఖలో సిక్కా పేర్కొన్న సంగతి తెలిసిందే. నేరుగా మూర్తిపేరును ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ... ఇన్ఫీ బోర్డు మాత్రం సిక్కా రాజీనామాకు మూర్తే కారణమని కుండబద్దలుకొట్టింది. దీంతో దాదాపు ఏడాదికాలంగా బోర్డుతో మూర్తి సాగిస్తున్న పోరు తారస్థాయికి చేరింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సిక్కా తనంతటతానుగా వైదొలగారనుకున్నారు. తన వైఫల్యాలను బయటపడకుండా చేసుకోవడం కోసం మూర్తిని టార్గెట్ చేసుకొని సిక్కా ఆరోపణలు చేశారు’ అని పాయ్ వ్యాఖ్యానించారు. ఒకపక్క, కొత్త సీఈఓ ఎంపిక కత్తిమీదసాముగా మారగా.. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై అమెరికాలోని కొన్ని న్యాయ సంస్థలు క్లాస్యాక్షన్ దావాలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతోపాటు కంపెనీ క్లయింట్లలో కూడా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. షేర్ల బైబ్యాక్ ప్రకటనను చేసినప్పటికీ(షేరుకు రూ.1,150 చొప్పున ధరతో) స్టాక్ మార్కెట్లో ఇన్ఫీ స్టాక్ కుప్పకూలుతూనే ఉంది. వరుసగా రెండురోజుల్లో 14 శాతంపైగా దిగజారి... రూ.873 స్థాయికి పడిపోయింది. మళ్లీ కొత్త పోస్టు ఎందుకు...: పూర్తిస్థాయి కొత్త సీఈఓ నియామకం జరిగేవరకూ సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్–చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కూడా పాయ్ తప్పుబట్టారు. ‘కంపెనీకి ఇప్పటికే చైర్మన్(ఆర్.శేషసాయి), సహ–చైర్మన్(రవి వెంకటేశన్)లు ఉన్నారు. తాత్కాలిక సీఈఓను(యూబీ ప్రవీణ్ రావు) కూడా నియమించారు మళ్లీ కొత్తగా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎందుకు? ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా, కాబోయే సీఈఓగా కంపెనీకి చెందినవారు ఉండలా, బయటివ్యక్తి అయితే మంచిదా అన్న ప్రశ్నకు... పొగరుబోతుగా, సొంత నిర్ణయాలతో వ్యవహరించే వ్యక్తులు కాకుండా... ఇన్ఫోసిస్ సంస్కృతి, విలువను గౌరవించే వ్యక్తి అయి ఉండాలని బదులిచ్చారు. ఇన్ఫీ చైర్మన్, కో–చైర్మన్లు వైదొలగాలి మాజీ సీఎఫ్ఓ వి.బాలకృష్ణన్ న్యూఢిల్లీ: ఇన్ఫీలో సిక్కా రాజీనామా ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలాలేవు. కొత్త సీఈఓ కోసం అన్వేషణ మొదలుపెట్టడానికిముందే కంపెనీ డైరెక్టర్ల బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కంపెనీ మాజీ సీఎఫ్ఓ వి.బాలకృష్ణన్ డిమాండ్ చేశారు. చైర్మన్ ఆర్.శేషసాయి, సహ–చైర్మన్ రవి వెంకటేశన్లు కూడా బోర్డు నుంచి తప్పుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలకు ఆడిట్ విభాగం హెడ్ రూపా కుద్వా, రెమ్యూనరేషన్ విభాగం హెడ్ జెఫ్రీ ఎస్. లేమాన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కంపెనీ ప్రమోటర్ నారాయణమూర్తి ఆరోపించిన నేపథ్యంలో బాలకృష్ణన్ వ్యాఖ్యలు కూడా ఇదే తరహాలో ఉండటం గమనార్హం. ముందుగా బోర్డును ప్రక్షాళన చేయకుండా కొత్త సీఈఓను తీసుకురావడం కంపెనీకి ఆత్మహత్యాసదృశంగా మారుతుందని బాలకృష్ణన్ అన్నారు. ‘పెద్ద ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులతో తగినవిధంగా చర్చించి బోర్డులోకి మంచి వ్యక్తులకు చోటుకల్పించాలి. ఇప్పుడున్న బోర్డును చూస్తే... ఇన్ఫీకి సారథ్యం వహించేందుకు మంచి సీఈఓలు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి కనబడటం లేదు’ అని బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. కొత్త సీఈఓ నియామకానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గడువును ఇన్ఫీ బోర్డు నిర్దేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఇజ్రాయిల్ కంపెనీ పనయా కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ డీల్‌పై దర్యాప్తు నివేదికను ఇన్ఫోసిస్ బయటపెట్టాల్సిందేనని కూడా బాలకృష్ణన్ పేర్కొన్నారు. -
లేఆఫ్స్‌పై ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ ఏమన్నారంటే..
హైదరాబాద్ : ఉద్యోగాల కల్పనకు ప్రధాన రంగంగా చెప్పుకునే ఐటీ రంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని ఇప్పటికే పలు రిపోర్టులు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఐటీ పరిశ్రమపై ఆశలు వదులుకునేలా ఈ రిపోర్టులు ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాక కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారి పరిస్థితులపై కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు పేర్కొంటున్నాయి. లేఆఫ్స్ బెడద విపరీతంగా ఉన్నట్టు తెలుపుతున్నాయి. అయితే ఈ రిపోర్టులన్నింటిన్నీ దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, ఐటీ రంగ నిపుణుడు టీవీ మోహన్‌దాస్ పాయ్ ఖండించారు. లేఆఫ్స్‌పై వస్తున్న రిపోర్టులన్నీ నిరాధారనమైనవిగా పేర్కొన్నారు. ఉన్నవి లేనివి కల్పించి చూపిస్తున్నట్టు తెలిపారు. లేఆఫ్స్‌పై వస్తున్న ముందస్తు రిపోర్టులు పూర్తిగా అతిశయోక్తి కలిగించేలా, భయాందోళనలను రేకెత్తించేలా ఉన్నాయని చెప్పారు. '' అవును కొంత మంది చాలా భయాందోళనతో ఉన్నారు. అది కూడా మీడియా హైప్ వల్లే. కానీ ఇక్కడ భయాందోళన చెందడానికి ఏం లేదు. భారీమొత్తంలో లేఆఫ్స్ అనేవే లేవు'' అని పాయ్ చెప్పారు. మోహన్ దాస్ పాయ్ ఒకప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీకి మానవ వనరుల విభాగానికి అధినేతగా పనిచేశారు. ఉద్యోగాల అభద్రతాభావంతో చాలా మంది ఐటీ నిపుణుల్లో మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని గతంలో పలురిపోర్టులు వచ్చాయి. భయాందోళన, ఒత్తిడి వాతావరణాన్ని వారు ఎదుర్కొంటున్నారని చెప్పాయి. అంతేకాక వచ్చే మూడేళ్లలో దాదాపు ఆరులక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని కూడా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ రిపోర్టులన్నింటిన్నీ పాయ్ కొట్టిపారేశారు. ఇవి పూర్తిగా చెత్త రిపోర్టులని, అంతేకాక పూర్తిగా అవాస్తమైనవిగా పాయ్ వర్ణించారు. '' ఇప్పటికే ఒక క్వార్టర్ అయిపోయింది. రెండో క్వార్టర్ మధ్యలో ఉన్నాం. రెండు అతిపెద్ద టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఫలితాలను ప్రకటించాయి. వీటిలో ఎలాంటి లేఆఫ్స్‌ను కంపెనీలు ప్రకటించలేదు'' అని పాయ్ వివరించారు. ఈ కంపెనీల్లో యుటిలైజేషన్ రేట్లు కూడా చారిత్రాత్మక గరిష్టాలను నమోదుచేశాయన్నారు. -
పాయ్ వ్యాఖ్యలు బాధాకరం
బెంగళూరు : ఐటీ పరిశ్రమ ప్రముఖుడు మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగుల అసోసియేషన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఐటీలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేస్తున్న వారు, భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారివెంట ఉన్న వారెవ్వరికీ ఉద్యోగాలు రాబోవని మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించడం చాలా బాధకరమని పేర్కొంటున్నాయి. ఈ కామెంట్లు ఉద్యోగుల రాజ్యాంగ హక్కులకు బహిరంగ ముప్పుగా ఉన్నాయని ఆల్ ఇండియా ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖ్విముద్దీన్ అన్నారు. ఐటీ కంపెనీలు అక్రమంగా చేపడుతున్న ఉద్యోగాల కోతపై తాము అంతర్జాతీయ కార్మిక సంస్ధ వద్దకు వెళ్తామని చెప్పారు. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీకి మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్, హెచ్ఆర్ గా నిర్వర్తించిన పాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బెంగళూరు ఐటీ ఉద్యోగుల ఫోరమ్ రాజేష్ నటరాజన్ మండిపడ్డారు. ఐటీ పరిశ్రమలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటుచేయాలనుకునేవారు, కొండంత ఉన్నదాన్ని గోరంత చేసి భయాందోళనలు సృష్టిస్తున్నారని, వారికెవరూ సపోర్టు చేయొద్దని, వారితో వెళ్లేవారికి ఉద్యోగాలు రావని మోహన్ దాస్ పాయ్ హెచ్చరించారు. ఇటీవల ఐటీ కంపెనీల్లో చోటు చేసుకున్న భారీ ఉద్యోగాల కోతతో, ఉద్యోగులు యూనియన్లను ఏర్పాటుచేసేందుకు సన్నద్దమవుతున్నారు. యూనియన్లు ఏర్పాటుచేసిన తమ సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కంపెనీలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి తమపై వేటు వేస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. -
ఐటీ ఉద్యోగానికి బీటెక్ చాలదు
♦ పీజీ, స్పెషలైజేషన్ తప్పనిసరి ♦ ఫ్రెషర్ల జీతాలు పెరగకపోవటం విషాదకరం ♦ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ హైదరాబాద్: రాబోయే రోజుల్లో బీటెక్ డిగ్రీ మాత్రమే ఉన్నవారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు దొరకడం కష్టమైపోతుందని, అదనంగా స్పెషలైజేషన్ ఏదైనా తప్పనిసరిఅని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్లను, ఏదైనా ప్రత్యేక విభాగంలో నైపుణ్యం ఉన్న వారినే తీసుకునేందుకు కంపెనీలు ప్రాధాన్యమిస్తాయని ఆయన తెలిపారు. ‘కాలేజీల్లో చదువుతున్న వారందరికీ నాదో సూచన. ఎంటెక్‌తో పాటు ఎందులోనైనా స్పెషలైజేషన్ చేయండి. అదనంగా క్లాస్‌లలో చేరి సొంతంగా కోడింగ్ నేర్చుకోండి. భవిష్యత్‌లో కంపెనీలు మిమ్మల్ని ఆరు నెలలు కూర్చోబెట్టి, శిక్షణనిచ్చి, జీతాలివ్వడానికి సిద్ధంగా ఉండవు. అవి తమ సమయం ఎందుకు వృధా చేసుకోవాలనుకుంటాయ్? రాబోయే రోజుల్లో కంపెనీలు మీ కోడింగ్ నైపుణ్యాలను పరీక్షించి, మీరు అందులో పాసయితేనే ఉద్యోగంలోకి తీసుకుంటాయి‘ అని పాయ్ చెప్పారు. ఫ్రెషర్ల జీతాలు ట్రాజెడీ..: గడిచిన రెండు దశాబ్దాల్లో ఐటీ రంగంలో ఫ్రెషర్ల వేతనాల్లో పెరుగుదల లేకపోవడం పెద్ద ట్రాజెడీగా ఆయన అభివర్ణించారు. పరిశ్రమ వేగంగా వృద్ధి చెందకపోవడమే ఇందుకు కారణమన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఖ్య పెరిగిపోగా, దానికి తగ్గట్లుగా డిమాండ్ ఉండటం లేదని పాయ్ చెప్పారు. ‘ప్రపంచంలో ఏ దేశం కూడా ఏటా పది లక్షల మంది ఇంజనీర్లకు (భారత్‌లో ఏటా కాలేజీల నుంచి వస్తున్న ఇంజనీర్ల సంఖ్య) ఉపాధి కల్పించలేదు. ఆఖరికి చైనా వల్ల కూడా కాదు. ఇది చాలా టూమచ్‘ అని పాయ్ వ్యాఖ్యానించారు. ఇక గతంలో అంతర్జాతీయంగా ఐటీపై వ్యయాల వృద్ధి ఏటా 3–4 శాతం ఉండగా.. ఈ ఏడాది రెండు శాతం మాత్రమే ఉండబోతోందన్న అంచనాలు కూడా పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయన్నారు. సంక్షోభమేమీ లేదు..: ఉద్యోగాల కోతలపై వస్తున్న వార్తలన్నీ గోరంతలు కొండంతలుగా చూపిస్తున్నవేనని పాయ్ చెప్పారు. ఐటీ రంగంలో ఎలాంటి సంక్షోభమూ లేదన్నారు. పనితీరు సరిగ్గా లేకుండా అట్టడుగు స్థాయిలో ఉన్న 1–2% మందిని కంపెనీలు తొలగించడం సర్వాసాధారణమేనని, అట్రిషన్‌లో ఇదీ భాగమేనని పాయ్ చెప్పారు. ‘ఉద్యోగాల్లో కోతలకు సంబంధించి అసాధారణ పరిస్థితులేమీ లేవని డేటా చూస్తే తెలుస్తుంది. సరిగ్గా పనిచేయని వారిపై (తొలగించిన పక్షంలో) సానుభూతి చూపడం ఎందుకు?’ అని పాయ్ ప్రశ్నించారు. ఐటీలో ఉద్యోగ సంఘాల ఏర్పాటు చేస్తున్నవారు.. భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి వెంట ఉన్న వారెవ్వరికీ ఉద్యోగాలు రాబోవని చెప్పారు. -
'టెక్కీలకు ట్రైనింగ్ పెద్ద కష్టమేమి కాదు'
టెక్నాలజీ రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల్లో చాలామంది కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం కష్టమేనంటూ క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఇండస్ట్రీ నిపుణుడు, మాజీ ఇన్ఫోసిస్ డైరెక్టర్ టీవీ మోహన్ దాస్ పాయ్ స్పందించారు. శ్రీనివాస్ కందుల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశీయ వర్క్‌ఫోర్స్ మీద తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతుండటంతో ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగాలు కోల్పోతుందన్నారు. దీనివల్ల చాలామంది ఇంజనీర్లు నిరుద్యోగులుగా మారుతున్నారని గుర్తుచేశారు.. 60-65 శాతం మంది దేశీయ ఐటీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం కష్టమేనని అనడం పూర్తిగా తప్పుడు ప్రకటనగా పేర్కొంటూ శ్రీనివాస్ కందుల వ్యాఖ్యలను పాయ్ ఖండించారు. దేశీయ ఐటీ ఉద్యోగుల సగటు వయస్సు 27 సంవత్సరాలు, అదే అమెరికా, జర్మనీలో అయితే ఈ ఉద్యోగుల సగటు వయసు 40కి పైనే ఉంటుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు వీరికి ట్రైనింగ్ ఇస్తుండటంతో భారత్ ఐటీ పరంగా చాలా విజయం సాధిస్తోందని చెప్పారు. క్లౌడ్ లేదా బిగ్ డేటా లేదా మరే ఇతర వాటిపైనన్న భారతీయులకు ట్రైనింగ్ ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదని పాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫ్యాకల్టీ సిలబస్‌లో మార్పులు చేయాల్సినవసం ఉందన్నారు. గ్లోబల్ యూనివర్సిటీలో సిలంబస్లను చాలా త్వరగా మార్చుతుంటారని, ప్రభుత్వం రావాలి, చెప్పాలి అనేది వారికి ఉండదని వివరించారు. -
ఫ్రెషర్ల జీతాలు పెరగకుండా ఐటీ సంస్థల కుమ్మక్కు
ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుప్పతెప్పలుగా అందుబాటులో ఉండటాన్ని దేశీయంగా పెద్ద ఐటీ కంపెనీలు అలుసుగా తీసుకుంటున్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ ఆరోపించారు. ఆయా సంస్థలు కుమ్మక్కై గత 7–8 ఏళ్లుగా ఫ్రెషర్స్ జీతాలు తక్కువ స్థాయిలోనే ఉంచుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘దేశీ ఐటీ పరిశ్రమలో సమస్య ఇదే. భారతీయ ఐటీ రంగం ఫ్రెషర్స్‌కి సరైన జీతాలు ఇవ్వడం లేదు. వారి జీతాలు పెరగనివ్వకుండా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడబలుక్కుని వ్యవహరిస్తున్నాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా సర్వీస్ కంపెనీలు కుమ్మక్కు కావడం భారతీయ ఐటీ పరిశ్రమకు మంచిది కాదని పాయ్ పేర్కొన్నారు. మెరుగైన జీతభత్యాలు ఇవ్వకపోతే .. ప్రతిభగల ఫ్రెషర్స్ చేరేందుకు ముందుకు రారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐటీ సేవల సంస్థల్లో చేరుతున్నవారిలో మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి కాలేజీల నుంచి వస్తున్నప్పటికీ .. నైపుణ్యాలున్న వారేనని పాయ్ చెప్పారు. అయితే, ప్రథమ శ్రేణి కాలేజీల నుంచి కూడా ఇంజనీర్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. గణాంకాల ప్రకారం ఫ్రెషర్స్‌కి రెండు దశాబ్దాల క్రితం వార్షికంగా రూ.2.25 లక్షల ప్యాకేజీ ఉండగా.. ప్రస్తుతం కేవలం రూ. 3.5 లక్షలకు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో పాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఐటీ ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే ఎలా...
హైదరాబాద్ : ఐటీ సెక్టార్లో ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్ లక్షల ఉద్యోగాలకు గండి కొట్టనుందన్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా పట్టు సాధించాలని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు. ఐటీ విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలు అలవర్చుకోవాలని ఇండస్ట్రి నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో, హెచ్ఆర్ హెడ్ టీవీ మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్, పైథాన్ లాంటి కోడింగ్ లాంగ్వేజ్‌లపై పట్టు ఉన్నవారికి వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాలు ఎక్కడికి పోవని స్పష్టంచేశారు. ప్రస్తుతం బీటెక్ చదువులు 10వ తరగతి చదివిన విద్యార్థితో సరిపోతుందని, విద్యార్థులు మరింత టెక్నికల్ నాలెడ్జ్‌ను పొందడానికి కేవలం బ్యాచ్‌లర్ డిగ్రీలతో సరిపెట్టుకోకుండా, మాస్టర్ డిగ్రీలను(పోస్ట్-గ్రాడ్యుయేషన్) కూడా చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని లేకపోతే అసలకే తగ్గిపోతున్న ఉద్యోగాల్లో, ఉద్యోగం సంపాదించడం కష్టతరమవుతుందని హెచ్చరించారు. ప్రతేడాది ఐటీ మార్కెట్లోకి వచ్చే 6.5 లక్షల మందిలో కేవలం 2-2.5లక్షల మంది ఇంజనీర్లే ఉద్యోగాలను సంపాదిస్తున్నారని పాయ్ పేర్కొన్నారు.. ఆటోమేషన్ ప్రభావంతో ఏటా కొత్తగా వచ్చే ఉద్యోగాల్లో ప్రారంభ, మధ్యస్థాయి ఉద్యోగాల్లో 10 శాతం వరకూ కోతపడనుందని పేర్కొన్నారు. గణాంకాల పరంగా చూసుకుంటే ఏటా 2 నుంచి 2.5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంటే, వాటిలో 25వేల నుంచి 50 వేల వరకు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. ఐటీ ఇండస్ట్రిలో మొత్తంలో 45 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, వారిలో 4,50,000 మంది మధ్యస్థాయి ఉద్యోగులేనన్నారు. అయితే ఆటోమేషన్ వల్ల వచ్చే దశాబ్దంలోనే వారిలో సగం మంది ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు. మధ్యస్థాయి ఉద్యోగుల్లో చాలామంది ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారని, ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ఐటీ సంస్థలు ఆటోమేషన్‌పై మొగ్గుచూపుతున్నాయని అన్నారు.