ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్ పాయ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : అపార మానవ వనరులతో అవకాశాల గనిగా పేరొందిన భారత్ తన ప్రతిష్టను కోల్పోనుందా అనే ఆందోళన రేకెత్తుతోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు దీటుగా ఎదగని కోట్లాది యువత నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా మిగిలే ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 21 నుంచి 35 ఏళ్ల మధ్యన ఉన్న పదికోట్ల మంది యువత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకు దీటుగా మెరుగైన నైపుణ్యాలను సంతరించుకోలేదని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
2025 నాటికి భారత్‌లో మరో పది కోట్ల మంది నాణ్యత లేని మానవ వనరులు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని, దీంతో 21 నుంచి 45 ఏళ్ల వయసుగల ఉద్యోగుల్లో తక్కువ నాణ్యత, దిగువ స్థాయి విద్యార్హతలతో ఉన్న సిబ్బంది సంఖ్య 20 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. పదేళ్ల యూపీఏ హయాంలో విద్యా సంస్కరణలు లోపించడమే ఈ దుస్థితికి కారణమని గతంలో ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓగా వ్యవహరించిన పాయ్ విమర్శించారు.
విద్యా సంస్కరణల ఫలితాలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టినా పదేళ్లకు వాటి ఫలాలు అందివస్తాయని ఫలితంగా ఒక తరం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నారు. ఈ నష్టాన్ని నివారించడమే ప్రస్తుతం మన ముందున్న సవాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment