ఐటీ ఉద్యోగానికి బీటెక్ చాలదు
♦ పీజీ, స్పెషలైజేషన్ తప్పనిసరి
♦ ఫ్రెషర్ల జీతాలు పెరగకపోవటం విషాదకరం
♦ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్
హైదరాబాద్: రాబోయే రోజుల్లో బీటెక్ డిగ్రీ మాత్రమే ఉన్నవారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు దొరకడం కష్టమైపోతుందని, అదనంగా స్పెషలైజేషన్ ఏదైనా తప్పనిసరిఅని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్లను, ఏదైనా ప్రత్యేక విభాగంలో నైపుణ్యం ఉన్న వారినే తీసుకునేందుకు కంపెనీలు ప్రాధాన్యమిస్తాయని ఆయన తెలిపారు. ‘కాలేజీల్లో చదువుతున్న వారందరికీ నాదో సూచన.
ఎంటెక్‌తో పాటు ఎందులోనైనా స్పెషలైజేషన్ చేయండి. అదనంగా క్లాస్‌లలో చేరి సొంతంగా కోడింగ్ నేర్చుకోండి. భవిష్యత్‌లో కంపెనీలు మిమ్మల్ని ఆరు నెలలు కూర్చోబెట్టి, శిక్షణనిచ్చి, జీతాలివ్వడానికి సిద్ధంగా ఉండవు. అవి తమ సమయం ఎందుకు వృధా చేసుకోవాలనుకుంటాయ్? రాబోయే రోజుల్లో కంపెనీలు మీ కోడింగ్ నైపుణ్యాలను పరీక్షించి, మీరు అందులో పాసయితేనే ఉద్యోగంలోకి తీసుకుంటాయి‘ అని పాయ్ చెప్పారు.
ఫ్రెషర్ల జీతాలు ట్రాజెడీ..: గడిచిన రెండు దశాబ్దాల్లో ఐటీ రంగంలో ఫ్రెషర్ల వేతనాల్లో పెరుగుదల లేకపోవడం పెద్ద ట్రాజెడీగా ఆయన అభివర్ణించారు. పరిశ్రమ వేగంగా వృద్ధి చెందకపోవడమే ఇందుకు కారణమన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఖ్య పెరిగిపోగా, దానికి తగ్గట్లుగా డిమాండ్ ఉండటం లేదని పాయ్ చెప్పారు. ‘ప్రపంచంలో ఏ దేశం కూడా ఏటా పది లక్షల మంది ఇంజనీర్లకు (భారత్‌లో ఏటా కాలేజీల నుంచి వస్తున్న ఇంజనీర్ల సంఖ్య) ఉపాధి కల్పించలేదు. ఆఖరికి చైనా వల్ల కూడా కాదు. ఇది చాలా టూమచ్‘ అని పాయ్ వ్యాఖ్యానించారు. ఇక గతంలో అంతర్జాతీయంగా ఐటీపై వ్యయాల వృద్ధి ఏటా 3–4 శాతం ఉండగా.. ఈ ఏడాది రెండు శాతం మాత్రమే ఉండబోతోందన్న అంచనాలు కూడా పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయన్నారు.
సంక్షోభమేమీ లేదు..: ఉద్యోగాల కోతలపై వస్తున్న వార్తలన్నీ గోరంతలు కొండంతలుగా చూపిస్తున్నవేనని పాయ్ చెప్పారు. ఐటీ రంగంలో ఎలాంటి సంక్షోభమూ లేదన్నారు. పనితీరు సరిగ్గా లేకుండా అట్టడుగు స్థాయిలో ఉన్న 1–2% మందిని కంపెనీలు తొలగించడం సర్వాసాధారణమేనని, అట్రిషన్‌లో ఇదీ భాగమేనని పాయ్ చెప్పారు. ‘ఉద్యోగాల్లో కోతలకు సంబంధించి అసాధారణ పరిస్థితులేమీ లేవని డేటా చూస్తే తెలుస్తుంది. సరిగ్గా పనిచేయని వారిపై (తొలగించిన పక్షంలో) సానుభూతి చూపడం ఎందుకు?’ అని పాయ్ ప్రశ్నించారు. ఐటీలో ఉద్యోగ సంఘాల ఏర్పాటు చేస్తున్నవారు.. భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి వెంట ఉన్న వారెవ్వరికీ ఉద్యోగాలు రాబోవని చెప్పారు.