ముంబై: విదేశీ పెట్టుబడులున్న ఈ– కామర్స్ కంపెనీలకు సంబంధించి కేంద్రం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు కారు చౌక రేట్లతో.. స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయన్నారు. భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్ 2019 స్టార్టప్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, ఈ నిబంధనలు కొంత సముచితమైనవేనన్నారు. మరోవైపు, ఇందులో వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చే కోణం కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాల కోణమే ఎక్కువగా కనిపిస్తోందని సదస్సులో పాల్గొన్న స్టార్టప్ సంస్థల లాయర్ కరణ్ కల్రా వ్యాఖ్యానించారు. ఒక ప్రత్యేక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లుగా అనిపిస్తోందని సీనియర్ లాయర్ నిశిత్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీలు.. తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫాంపై 4 లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి.
ఆశావహంగా వాల్‌మార్ట్..
నిబంధనలు కఠినం చేసినప్పటికీ భారత మార్కెట్‌పై ఆశావహంగానే ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ వెల్లడించింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ ఏషియా రీజనల్ సీఈవో డర్క్ వాన్ డెన్ బెర్గీ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు ..రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ–కామర్స్ నిబంధనలు సరైనవే
Published Thu, Feb 7 2019 4:26 AM | Last Updated on Thu, Feb 7 2019 4:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment