కేంద్ర ప్రభుత్వానికీ, వాట్సాప్ సంస్థకూ మధ్య ఇప్పుడు నడుస్తున్న యుద్ధం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇందులో పౌరుల ప్రాథమిక హక్కుల సమస్య ఇమిడివుంది గనుక ఏది సరైంది... ఏది కాదు అనే అంశాల్లో చాలా చర్చ నడుస్తోంది. సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ వాట్సాప్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తాజా వివాదానికి మూలం. వాట్సాప్‌లో పంపే సందేశాలు, దానిద్వారా ఎవరితోనైనా జరిపే సంభా షణలు బయటివారికి తెలిసే అవకాశం లేదని, ఇది తమ యాప్ ప్రత్యేకతని వాట్సాప్ చెప్పుకుం టోంది. అయితే దురుద్దేశపూర్వకంగా, ద్రోహచింతనతో ఎవరైనా ప్రవర్తించినప్పుడు వారి వివరాలు ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది వాట్సాప్ ప్రత్యేకతను దెబ్బతీస్తుంది గనుక ఆ సంస్థ కోర్టుకెక్కింది. ఈ ఏడాది మొదట్లో ఇదే సంస్థ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరత్రా వినియోగించుకోవడానికి అనుమతించాలంటూ వినియోగదారులపై విధించిన ఆంక్షలను కేంద్రం తప్పుబట్టింది. అప్పట్లో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన వాట్సాప్ త్వరలోనే అమలు చేయబోతున్నట్టు ఈమధ్యే ప్రకటించింది. పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఈ నిర్ణ యాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రం గత వారం వాట్సాప్ సంస్థకు నోటీసు జారీచేయటంతో ఇది స్వచ్ఛందమేనని, తప్పనిసరి కాదని ఆ సంస్థ గొంతు సవరించుకుంది. ఇలా సందర్భాలు వేరు కావొచ్చుగానీ... ఇద్దరూ వినియోగదారుల ప్రయోజనాలనూ, వారి గోప్యతనూ కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాల తీరు వినియోగదారులకు సమస్యలు సృష్టిస్తున్న సంగతి కాదనలేనిది. వాట్సాప్‌కు మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ కొన్నాళ్లక్రితం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. దాదాపు 50 కోట్లమంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా పరులపాలైందని వెల్లడైనప్పుడు అది నిజమో, కాదో వివరణనిచ్చేందుకు కూడా ఫేస్‌బుక్ చాన్నాళ్లు సిద్ధపడలేదు. సామాజిక మాధ్య మాలు వినియోగించే యాప్‌లు ఎంత భద్రమైనవో, అవి తమ డేటాను పరిరక్షించగలవో లేదో వినియోగదారులకు తెలిసేందుకు అనువైన పారదర్శకతను ఆ సంస్థలు పాటించడం లేదు. అసలు ఈ సంస్థలే పౌరుల డేటాను విక్రయిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కేంద్రం మార్గదర్శకాలు తమ వినియోగదారుల భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తుందని అభ్యంతర పెడుతున్న వాట్సాప్ సంస్థ... వినియోగదారుల డేటాతో తాను ఏం చేయదల్చుకున్నదో వెల్లడించడానికి మాత్రం సిద్ధపడటం లేదు. వాట్సాప్ అయినా, మరొకటైనా ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా పౌరులకు అందుబాటులో వున్నాయి. కానీ పాటించే నిబంధనలు మాత్రం అన్నిచోట్లా ఒకేలా లేవు. భారత వినియోగదారుల డేటాను ఇష్టానుసారం ఉపయోగించినట్టు బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో చేయడం సాధ్యం కాదు. వేరే దేశాల్లో కూడా ఆ నిబంధనలే వర్తింపజేయటానికి ఆ సామాజిక సంస్థలకుండే అభ్యంతరా లేమిటి? కనీసం ఆ విషయంలోనైనా అవి పారదర్శకంగా వుండటం లేదు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న సంస్థలు తాము నిర్దేశించుకున్న నిబంధనలేమిటో, సంస్థ ఉద్యోగులు వాటిని ఉల్లంఘిం చినపక్షంలో తీసుకునే చర్యలేమిటో మాత్రం చెప్పవు.
వ్యక్తిగత గోప్యత హక్కు రెండు అంచులా పదునున్న కత్తిలాంటిది. చాలాచోట్ల గో సంరక్ష కులుగా అవతారమెత్తినవారు వాట్సాప్‌లో గ్రూపులుగా ఏర్పడి గోవధ అడ్డుకునే పేరిట ఎంత అరా చకంగా ప్రవర్తించారో తెలియనిది కాదు. పర్యవసానంగా సందేశాలు పంపటంలో వాట్సాప్ పరిమి తులు విధించింది. బాధ్యులు తెలియడం లేదంటూ నిందితులపై ప్రభుత్వాలు నామమాత్రం కేసులతో సరిపెట్టిన సందర్భాలు ఎన్నో వున్నాయి. సాక్షాత్తూ కేంద్రమంత్రులు అలాంటివారిని వెనకే సుకొచ్చిన ఉదంతాలున్నాయి. కేంద్ర మార్గదర్శకాలు ఈ మాదిరి అరాచకాన్ని నిలుపు చేస్తాయన్న నమ్మకం ఎవరికీ లేదు. పైగా సరైన చర్చ జరగకుండా, ఎవరినీ సంప్రదించకుండా ఆదరాబాదరాగా జారీ అయిన మార్గదర్శకాలపై సందేహాలు తలెత్తడాన్ని తప్పు బట్టనవసరం లేదు. ఎన్నడో 2018లో జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిటీ డేటా పరిరక్షణపై ముసాయిదా బిల్లు రూపొందించింది. అది కేంద్ర కేబినెట్‌కు కూడా వెళ్లింది. ఆ తర్వాత దాని అతీగతీ లేదు. నిజానికి అలాంటి చట్టం లేకపోవటంవల్లే వాట్సాప్ సంస్థ కోర్టుకెక్కింది. యూరోపియన్ యూనియన్ డేటా పరిక్షణ చట్టం ముసాయిదాపై రెండేళ్లపాటు సభ్య దేశాల పార్లమెంట్లలో చర్చ జరిగింది. నిపుణులు, సాధారణ పౌరులు కూడా ఎన్నో అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ తర్వాతే చట్టం వచ్చింది. పర్యవసానంగా వాట్సాప్‌తోసహా అన్ని సంస్థలూ దానికి కట్టుబడాల్సి వచ్చింది. ఇక్కడ కూడా జస్టిస్ శ్రీకృష్ణ ముసాయిదా బిల్లుపై విస్తృత చర్చకు వీలు కల్పించి చట్టం తీసుకొస్తే బాగుండేది. అందుకు బదులుగా మార్గదర్శకాల పేరిట ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేవిధంగా నిబంధనలు అమల్లోకి తీసుకురావటం సరి కాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, సమాజంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని నియంత్రించాల్సిందే. కానీ ఆ పేరిట సహేతుక నిరసనను నేరపూరితం చేసే ప్రభుత్వాల వైఖరి కూడా ప్రమాదకరం. అందుకే ఈ విషయంలో విస్తృతంగా చర్చించి తగిన చట్టాన్ని తీసుకు రావాలి. అందరిలోనూ విశ్వాసం ఏర్పడేలా ఒక తటస్థ వ్యవస్థ రూపొందితే... అది పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తే అంతిమంగా అది ప్రజాస్వామ్య పటిష్టతకు దోహదపడుతుంది.
గోప్యతపై లడాయి
Published Fri, May 28 2021 12:18 AM | Last Updated on Fri, May 28 2021 12:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment