గంతలు కడతారు జాగ్రత్త! | ABK Prasad Article About Facebook Data Hacking | Sakshi
Sakshi News home page

గంతలు కడతారు జాగ్రత్త!

Published Tue, Apr 3 2018 12:51 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ABK Prasad Article About Facebook Data Hacking - Sakshi

ఈ కూపీ వాళ్లకి ఎందుకు? ఇండియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమ సామ్రాజ్య ప్రయోజనాలకు, యుద్ధ ప్రయోజనాలకు, చేసే యుద్ధాలకు ‘సై’ అనిపించడానికి ఇది అవసరం. అమెరికాతో నీవు చేతులు కలపకపోతే నిన్నే తన శత్రువుగా ప్రకటించడానికి సామ్రాజ్య పాలకులు సంకోచించరని గుర్తించాలి. ఆ వైపుగానే ఇపుడు ఆంగ్లో–అమెరికన్‌ ప్రభుత్వాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానాలను మలచడానికి శక్తిమంతంగా ప్రయత్నిస్తున్నాయి.

‘నా గురించి డేటా కావాలా మీకు? తీసుకోండి బాబూ! కానీ అందుకు ముదరాగా మీరు ప్రతి ఆరునెలలకు నాకు విసుగు పుట్టించే కొత్త పనులు మాత్రం పురమాయించకండి! ఈ డేటా లీకులూ, గోప్యత పైన, ఫేస్‌బుక్, వ్యక్తుల భోగట్టా గురించి కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, నరేంద్ర మోదీ (నామో) యాప్, ఆధార్‌ వంటి కూపీ వ్యవస్థలు– టెక్నాలజీ ఆధారంగా మనం సమకూర్చుకున్న మన డేటాను కాస్తా ఎలా దొంగిలిస్తున్నామో తెలుసు. అయినా ఈ గందర గోళంలో తలదూర్చి ఈత కొట్టదలచలేదు. ఇప్పటికే యావత్తు ప్రపంచానికి తెలిసిపోయింది– తమ నోరు మెదపలేక అలా పడివున్న భారత ప్రజా బాహు ళ్యం ఆ మూగ వేదనలో కొద్ది కిలోల బియ్యం కోసం తమ గోప్యతను కాస్తా సంతోషంతో ఎలా మారకం చేసుకుంటున్నారో తెలిసిపోయింది.

బహుశా ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి–ప్రభుత్వమూ, రెండు– కార్పొరేట్‌ శక్తి. ఇక్కడ ఈ క్షణాన ‘ఆధార్‌’ సాధికార శక్తిలో దాగి ఉంది. ఇక నుంచి ఈ శక్తి ‘దాయి’ (ఆయా)గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ రెండు శక్తులూ పరస్పరం చేతులు కలిపి ఆధార్‌లో నిక్షిప్తం చేసిన వ్యక్తిగత సమాచారం (డేటా) అంతా భద్రంగానే ఉందని మనకు వందలసార్లు భరోసా ఇచ్చారు. అంటే మీ డేటా అంతా భద్రంగానే ఉంది కనుక ఇక నుంచి దాన్ని గురించి నోరెత్తి చర్చించకండి అని శాసిస్తున్నారు. అలాగే ‘ఫేస్‌బుక్‌’ సృష్టించిన జుకర్‌బర్గ్‌ కూడా తాను ‘మంచి బాలుడనే’నని వెయ్యిన్నొక్కసార్లు ప్రకటించాడు. చివరికి ఇతడిని ప్రధాని మోదీ అక్కున చేర్చుకుని హత్తుకున్నాడు. ఇలా మోదీ హత్తుకున్న వాళ్లంతా ఎంతో కొంత హాని కలిగిస్తారని చెడు తలపెడతారని నేను నమ్మలేను.’

– జి. సంపత్‌ (ది హిందు సామాజిక వ్యవహారాల విశ్లేషక సంపాదకుడి వ్యంగ్య రచన) 

‘నేడు ఇండియాలో ముమ్మరిస్తున్న పరిణామాలు దేశంలో ప్రవేశించిన ఆధునిక వలస విధానంగా తోస్తోంది’

 – క్రిస్టోఫర్‌ వీలీ (భారత్‌లో సమాచార కూపీ, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి అంశాల గురించి ట్విటర్‌లో బట్టబయలు చేసిన వేగు)

క్రిస్టోఫర్‌ వీలీ తన డాక్యుమెంట్లలో బంధించిన సమాచారాన్నంతా బ్రిటన్‌ కామన్స్‌ సభ ‘కల్చర్, మీడియా స్పోర్ట్స్‌ కమిటీ’ ముందు వెల్లడించాడు. ఈ విషయాలను పరిశీలిస్తే  వలస సామ్రాజ్య పాలనావశేషాల నుంచి స్వతంత్ర భారత్‌ సంపూర్ణ విముక్తిని పొందిన దేశమేనా అని మనకు మనం ప్రశ్నించుకో వలసిన స్థితిలో ఉన్నామని అనిపిస్తుంది. అదే సమయంలో ‘ఆధునిక వలస విధానం ఇలా ఉంటుందన్న భావన’ కలుగుతోందన్నాడు (దిసీజ్‌ వాట్‌ మోడ రన్‌ కలోనియలిజం లుక్స్‌లైక్‌) క్రి స్టొఫర్‌ వీలీ. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశా బ్దాలు గడిచిపోతున్నది.

అయినా భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక నైతిక వ్యవస్థలపై పాత, కొత్త వలస పాలకుల కనుసన్నలలోనే ఆంగ్లో–అమెరికన్‌ బహుళజాతి గుత్త సంస్థలు జోక్యం చేసుకోవడం సహించరాని పరిణామం. అంటే రక్షణ రంగం సహా దాదాపు కీలక రంగాలన్నీ కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ పాలనా వ్యవస్థల కింద విదేశీ, స్వదేశీ గుత్త సంస్థల అదుపాజ్ఞలలోకి వెళ్లి ప్రజా బాహుళ్యం మూల్గులను పీల్చేస్తున్నాయని స్పష్టమైంది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదం కాస్తా విదేశీ వాస్కోడిగామాల అడ్డాగా మార్చుతున్నారు.

సాంకేతికత వెనుక సంక్షోభం
భారత ఎన్నికల వ్యవస్థలోకి చొరబడిన కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, క్రిస్టోఫర్‌ వీలీ సమాచారం వికేంద్రీకరణ పేరిట, ఆధునిక టెక్నాలజీ ముసుగులో ప్రవేశిం చిన ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, ట్వీటర్‌ వగైనా సోషల్‌ మీడియాను ప్రయోజనకర కార్యకలాపాలకు వినియోగించడం లేదు. దోపిడీ వ్యవస్థల రక్షణ కోసం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే రాజకీయ పక్షాలకు వాటి నాయకత్వాలకు ఎన్నికలలో ఉపయోగపడేటట్టూ చేస్తున్నారు. ఎన్నికలలో ఫలితాలను తమకు సానుకూలంగా మార్చుకు నేందుకు అనుకూల ఏజెన్సీల ద్వారా సోషల్‌ మీడియాలో ద్వారా ప్రచార ‘ఊదర’ కొట్టుకుని, ఓటింగ్‌ సరళిని ప్రభావితం చేయడానికి ఈ సంస్థలు పనిచేయడం– బీజేపీ 2012 నుంచి ప్రవేశపెట్టిన ఫలితమే.

2014 లోక్‌సభ ఎన్నికలలో ఇందుకు తెర తీసిన పెద్దమనిషి అరవింద్‌ గుప్తా. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పదిని వందగా చూపే సంఖ్యల తారుమారు విద్యలో డిజిటల్‌ మీడియా మ్యానిప్యులేటర్‌గా అతడే పనిచేశాడు. సంఖ్యా శాస్త్రాన్ని డిజిటల్‌ మీడియా ద్వారా  ఎలా దుర్వినియోగం చేయవచ్చునో నిపుణులు నాకు చెప్పారు. ఇంతకు ముందు కృత్రిమ విద్య ద్వారా మనం స్నేహితులను జయించడం ఎలాగో కొందరు పుస్తకాలు రాశారు. అలాగే ఎన్నికలలో ఓడవలసిన వాడు కూడా డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో ప్రచారం ద్వారా ఓటింగ్‌ ఫలితాన్ని ఎలా తారుమారు చేయవచ్చునో 2014 ఫలితాలు నిరూ పించాయి.

ఒక నాయకుడు ఎన్నికలు, ఓటింగ్‌లకు ఆరు నెలలకు ముందే తానే ‘వస్తున్నాడు, వచ్చేస్తున్నాడ’ని డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో విజ యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇందుకు కాంగ్రెస్‌ పాలన తప్పిదాలు ఆ ఊదరకు దోహదం చేయడం యాదృచ్ఛికం. ఆ తర్వాత శ్రీలంక ఎన్నికల్లో ప్రజా కంటకునిగా మారిన అధ్యక్షుడు రాజపక్సకు సాయంగా బీజేపీ డిజిటల్‌ టెక్నాలజీ నిపుణుడిని పంపడం, అది తెలిసిన  పాత్రికేయులు ‘మీ రాకలో రహస్యమేమిట’ని ప్రశ్నిస్తే ‘‘ఆ విషయం మీకు చెప్పవలసిన పనిలేద’’ని ఆ నిపుణుడు ఎదురు మాట్లాడ్డం గురించి ఆనాడు కొన్ని పత్రికలు ఒక మూలకు తోసేశాయి.

దండగమారి చెత్త
అమెరికా పత్రికా ప్రపంచంలోనూ, సీఎన్‌ఎన్‌ చానల్‌లోనూ, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లోనూ ప్రసిద్ధుడు బి.జె. మెండెల్‌సన్‌ సోషల్‌ మీడియా పేరిట చెలా మణి అవుతున్న కొన్ని శాఖలను ‘దండుగమారి చెత్త’గా (సోషల్‌ మీడియా ఈజ్‌ బుల్‌షిట్‌) 2012 లోనే వర్ణించాడు. ఆ పేరిటనే రాసిన గ్రంథంలో ఈ ప్రచార సాధనాన్ని మార్కెటింగ్‌ వ్యూహ రచనా మాధ్యమంగా వర్ణించాడు. 1998 నుంచీ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంగానే ఈ వెబ్‌ వేదిక వ్యవహరిస్తూ వచ్చిం దని పేర్కొన్నాడు. సోషల్‌ మీడియా పేరిట చెలామణిలో ఉన్న చాలా వెబ్‌ సైట్స్‌ ఇండియాలో ఇటీవల కాలంలో పడిన ‘పాటు’ అంతా ఏమిటి? ఆ విష యాన్ని కూడా క్రిస్టొఫర్‌ వీలీ బట్టబయలు చేశాడు: ‘ఇండియాలోని ఏడు లక్షల గ్రామాలలో, 600 జిల్లాల్లో ఈ విదేశీ వెబ్‌ మాధ్యమాలు సమాచారం సేకరించాయి.

వీటి సాయంతో రాజకీయ పార్టీల కక్షిదారులెవరో (ఆదరణ పొందగోరినవారు) కూపీ లాగి ఆయా రాజకీయ పార్టీలు సదరు ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాయి. తద్వారా అనుకున్న సానుకూల ఫలితాన్ని రాబట్టుకోడానికి ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఇదే ఆధునిక వలస విధాన ప్రక్రియ’’ అన్నాడు వీలీ. ఎస్‌.సి.ఎల్‌ ఇండియా అనే కంపెనీ కేంద్ర కార్యాలయం ఘజియాబాద్‌లో ఉంది. అనేక రాష్ట్రాలలో కార్యా లయాలున్నాయి. ఈ కూపీ యంత్రాంగాన్ని బీజేపీ రాజస్తాన్‌ ఎన్నికల్లో ఉపయోగించింది. ఫేస్‌బుక్‌ నిర్మాత ఎఫ్‌.బి. వాడకందార్ల యంత్రంలో నమో దైన వారి సమాచారాన్ని, నంబర్లను తస్కరించి అమెరికా, బ్రిటన్‌లకు పంపించే వీలు కల్పించి, జుకర్‌బర్గ్‌ కాస్తా ‘జోకర్‌’బర్గ్‌ అయ్యాడు. మన డేటా అంతా అమెరికన్‌ కంపెనీలకు చేరిన తర్వాత ‘క్షమించాలి, తప్పు చేశా’నని అతడు లెంపలు వాయించుకున్నా, జరగవలసిన అన్యాయం జరిగిపోయింది. అలాగే ‘ఆధార్‌’ డేటా అంతా (మన కళ్ల కదలికలతో సహా– ఐరిష్‌ పరీక్ష) అమెరికా, బ్రిటన్‌లలో నమోదైపోయింది.

ఈ కూపీ వాళ్లకి ఎందుకు? ఇండియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమ సామ్రాజ్య ప్రయోజనాలకు, యుద్ధ ప్రయోజనాలకు, చేసే యుద్ధాలకు ‘సై’ అనిపించడానికి ఇది అవసరం. అమెరికాతో నీవు చేతులు కలపకపోతే నిన్నే తన శత్రువుగా ప్రకటించడానికి సామ్రాజ్య పాలకులు సంకోచించరని గుర్తించాలి. ఆ వైపుగానే ఇపుడు ఆంగ్లో–అమెరికన్‌ ప్రభుత్వాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానాలను మలచడానికి శక్తిమంతంగా ప్రయత్నిస్తు న్నాయి. మన  ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాల పునరుద్ధరణకు, శాంతి ప్రతిష్టాపనకు గల అవకాశాల్ని కూడా నిరోధించగల్గుతున్నాయి. ‘కేంబ్రిడ్జి ఎనలిటికా’ ఇండియాలో తిష్ట వేయడానికి కారణం ఈ  విన్యాసంలో భాగమే.

రాజకీయ పార్టీలు కులాలను విభజించి ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందవచ్చునో  దశాబ్దాలుగా వ్యూహాలు సాగిస్తూనే ఉన్నాయి. కుల వ్యవస్థ మూలాలనీ, కుల, మత వైమనస్యాలనూ చెక్కు చెదరకుండా కాపాడగోరే రాజకీయ పార్టీలకు వెన్నుదన్నుగా ఉండటం కూడా ఆ సంస్థ ధ్యేయమే. తద్వారా భారత సామాజిక, రాజకీయ వ్యవస్థను సెక్యులర్‌ రాజ్యాంగానికి దూరంగా ఉంచడం కూడా. అందుకే ప్రధానమంత్రి ‘యాప్‌’ సహితం సోషల్‌ మీడి యాలో వినియోగదార్ల అనుమతి లేకుండా వారి డేటాను వాడుకుంటోందన్న ఆరోపణకు గురి కావలసి వచ్చింది. ‘నమో (మోదీ) యాప్‌’ ద్వారా భారత వినియోగదార్ల ‘డేటా’ను కాస్తా దొంగిలించడం జరిగిందని ఫ్రెంచి హేకర్‌ వెల్లడించాడు. మోదీ యాప్‌ డేటా ‘అమెరికన్‌ కంపెనీలలోని ఆయన స్నేహి తులకు’ చేరిందని కూడా ఆ ఫ్రెంచి హాకర్‌ వెల్లడించాడని వార్త. 

మున్ముందు వీర విహారం
2014 ఎన్నికలతో ముమ్మరంగా ప్రారంభమైన ఈ ‘డిజిటల్‌ మాయాజాలం’ 2019 సాధారణ ఎన్నికల నాటికి మరింతగా జడలు విప్పుకుని రాజకీయుల ‘నర్తనశాల’ను చూపించవచ్చు. ఎందుకంటే ‘ఫేస్‌బుక్‌’ వ్యవస్థాపక అధ్య క్షుడు సీన్‌పార్కర్‌ ‘సమాజంతో మీకున్న సంబంధ బాంధవ్యాలను ఫేస్‌బుక్‌ తారుమారు చేస్తుందన్నది అక్షరసత్యం’ అన్నాడంటే వచ్చేవి చెడ్డ రోజులా, మంచి రోజులా అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే ఫేస్‌బుక్‌ అనేది డేటా దొంగతనానికి పెట్టింది పేరనీ, ఆ మాటకొస్తే ఘరానా సోషల్‌ నెట్‌వర్క్‌ అనీ, దొంగ బుద్ధులకు నిలయమనీ, అందుకనే అది అమెరికన్లకు శిరోధార్యమైం దనీ అమెరికా నిపుణులే వాపోతున్నారని మరువరాదు. బానిసల, నీగ్రోల విమోచన ప్రదాత, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ మాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి:

‘‘ప్రజలలోనే నా ప్రగాఢ విశ్వాసమంతా. ఎలాంటి జాతీయ విపత్తు కైనా, సంక్షోభాన్నయినా ఎదుర్కోడానికి ప్రజలనే విశ్వసించాలి. అసలు విషయం ఏమిటంటే, ముందుగా వారికి అబద్ధాలను, అసత్యాలను తెల్పకుండా నికా ర్సయిన నిజాలను వారి ముందుంచాలి. పాలకులపై విశ్వాసానికి అదే మూల స్తంభం’’!

- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement