ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్ : డేటా షేరింగ్ స్కాండల్ విషయంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ తన యూజర్ల డేటాను చెప్పా పెట్టకుండా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ తయారీదారులకు ఇచ్చినట్టు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. వాటిలో ఆపిల్, శాంసంగ్, అమెజాన్ వంటి 60 కంపెనీలున్నట్టు తెలిపింది. గత దశాబ్ద కాలంగా యూజర్ల డేటాను ఆ కంపెనీలకు ఫేస్‌బుక్ యాక్సస్ చేస్తున్నట్టు వెల్లడించింది. తాజాగా ఫేస్‌బుక్ చేసిన మరో ఘోర తప్పిదం వెలుగులోకి వచ్చింది. చైనీస్ డివైజ్ మేకర్లతో కూడా డేటా షేరింగ్ ఒప్పందాన్ని ఈ కంపెనీ కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీనే అంగీకరించింది. హువావే టెక్నాలజీస్ కో, లెనోవో, ఒప్పో, టీసీఎల్ వంటి చైనీస్ డివైజ్ తయారీదారులకు ఫేస్‌బుక్ తన డేటాను షేర్ చేసినట్టు వెల్లడించింది. ఇదీ కూడా యూజర్లకు తెలియకుండానే చేసినట్టు తెలిసింది. చైనీస్ డివైజ్ తయారీదారులతో ఫేస్‌బుక్ డేటా షేర్ కావడం ‘అత్యంత ప్రమాదకరం’ అని సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ టాప్ డెమొక్రాట్ మార్క్ వార్నర్ అన్నారు.
అయితే తాము ఈ భాగస్వామ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని, ఫేస్‌బుక్ యాప్ కస్టమ్ వెర్షన్స్‌ను అభివృద్ధి చేయడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు తాము సహకరిస్తున్నామని ఈ కంపెనీ చెబుతోంది. మెంబర్ల సమాచారాన్ని వారు ఎలాంటి వాటికి ఉపయోగిస్తున్నారనే విషయంపై చాలా విశ్లేషణ చేశామని పేర్కొంటోంది. 2009 నుంచి చైనాలో ఫేస్‌బుక్ యాప్ బ్లాక్ అయి ఉంది. అయినప్పటికీ ఆ దేశ కంపెనీలకు మాత్రం ఈ కంపెనీ యూజర్ల డేటా ఇచ్చేసింది. ప్రస్తుతం ఫేస్‌బుక్ షేర్‌చేసిన చైనీస్ కంపెనీలు, ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ, వారి మిలటరీకి సంబంధించినివా తెలుపాలని ఆ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే ఫేస్‌బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ కంపెనీతో యూజర్ల డేటాను పంచుకుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణలపై ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కాంగ్రెస్ సభ్యుల మందుకు వచ్చి కూడా క్షమాపణ చెప్పారు. తాజాగా న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసిన రిపోర్టులు, వెలుగులోకి వచ్చిన చైనీస్ కంపెనీలతో భాగస్వామ్యం అన్ని విషయాల్లోనూ ఫేస్‌బుక్ ఎంత ఘోర తప్పిందం చేసిందో వెల్లడవుతుందని టెక్ వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment