
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధంగా యూజర్ల డేటాను సేకరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను షార్ట్–వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఖండించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొంది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ సంస్థలో భాగమైన టిక్‌టాక్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. యూజర్ల డేటా భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించింది. యూజర్ల డేటాను టిక్‌టాక్ చట్టవిరుద్ధంగా సేకరించి .. చైనాకు పంపుతోందని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యని లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆరోపించిన నేపథ్యంలో టిక్‌టాక్ తాజా వివరణనిచ్చింది. తమపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు చైనాలో లేవని, అక్కడి ప్రభుత్వానికి, చైనా టెలికం సంస్థకు గానీ టిక్‌టాక్ యూజర్ల డేటా లభించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారతీయ యూజర్ల డేటాను అమెరికా, సింగపూర్‌లోని ప్రముఖ థర్డ్ పార్టీ డేటా సెంటర్స్‌లో భద్రపరుస్తున్నట్లు టిక్‌టాక్ తెలిపింది.