వాట్సాప్ కు షాక్: 21కోట్ల జరిమానా
వాట్సాప్ కు షాక్: 21కోట్ల జరిమానా
Published Sat, May 13 2017 11:54 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
లండన్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఇటలీ భారీ జరిమానా విధించింది. బలవంతంగా యూజర్ల వ్యక్తిగత డేటాను పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో షేరు చేపిస్తుందనే నెపంతో ఇటలీ 3.3 మిలియన్ డాలర్లకు పైగానే అంటే 21 కోట్లకు పైగా జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది. ఫేస్ బుక్ తో వాట్సాప్ డేటా షేరింగ్ పై అనుమానాలు ఉన్నాయని 28 దేశాల యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటక్షన్ అధికారులు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు. కానీ వాట్సాప్ మాత్రం యూజర్ల డేటాను ఫేస్ బుక్ షేర్ చేస్తోంది. ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమీక్షిస్తామని, అధికారులకు తమ స్పందన తెలియజేస్తామని వాట్సాప్ అధికార ప్రతినిధి చెప్పారు.
2014లో మెసేజింగ్ యాప్ లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకుంది. 2016 ఆగస్టు నుంచి వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ మార్చి, యూజర్ల డేటాను ఫేస్ బుక్ తో షేరు చేయడం ప్రారంభించింది. ఈ విషయంపై ఇప్పటికే చాలా దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే వాట్సాప్ మాత్రం ఈ ప్రక్రియను నిలిపివేయడం లేదు. భారత్ లో సైతం దీనిపై ఆందోళన రేకెత్తాయి. 2016 సెప్టెంబర్ లో వాట్సాప్ కొత్త పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. 2016 సెప్టెంబర్ 25కు ముందు సేకరించిన యూజర్ల డేటాను ఫేస్ బుక్ లేదా మరే ఇతర సంబంధిత కంపెనీలతో పంచుకోకూడదని ఢిల్లీ హైకోర్టు వాట్సాప్ ను ఆదేశించింది. వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆ కంపెనీ డేటా ప్రొటక్షన్ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఎఫ్బీపై ఏప్రిల్ నుంచి జర్మన్ అథారిటీలు నిషేధం విధించారు.
Advertisement